Share News

454 చెట్ల నరికివేత.. వ్యాపారికి మరో రూ.50 లక్షల జరిమానా

ABN , Publish Date - Nov 20 , 2026 | 08:10 AM

రెండేళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని తాజ్‌ ట్రపేజియం జోన్‌లోని 454 చెట్లను రాత్రికి రాత్రి నరికి.. కోర్టు ధిక్కరణ కేసులో ఇరుకున్న వ్యాపారి శంకర్ అగర్వాల్‌కు ఉపశమనం కలిగించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

454 చెట్ల నరికివేత.. వ్యాపారికి మరో రూ.50 లక్షల జరిమానా

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని తాజ్‌ ట్రపేజియం జోన్‌లోని 454 చెట్లను రాత్రికి రాత్రి నరికి.. కోర్టు ధిక్కరణ కేసులో ఇరుకున్న వ్యాపారి శంకర్ అగర్వాల్‌కు ఉపశమనం కలిగించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఆయనపై ఉన్న కేసును తొలగించేందుకు యూపీలోని ఐదు సంక్షేమ సంఘాలకు రూ.50 లక్షలను విరాళంగా ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు సీజేఐ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆ వ్యాపారి నరికిన ప్రతి చెట్టుకూ లక్షరూపాయల లెక్కన రూ.4.54 కోట్ల జరిమానా కట్టారు. ఇప్పుడు కేసు నుంచి బయటకు రావడానికి మరో రూ.50 లక్షలను సంక్షేమ సంఘాలకు శంకర్ ఇవ్వాలని కోర్టు పేర్కొంది.


ఏంటీ కేసు..?

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శంకర్ అగర్వాల్.. 2024లో అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న దాల్మియా ఫామ్స్‌ను కొనుగోలు చేశారు. అదే సంవత్సరం సెప్టెంబరులో ఇళ్ల నిర్మాణం కోసం భారీ ఎక్స్‌కవేటర్లు ఉపయోగించి ఆ ప్రాంతంలో ఉన్న 454 చెట్లను ఆయన నేలకూల్చారు. దీన్ని అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఎందుకంటే దాల్మియా ఫామ్స్‌.. సుప్రీం కోర్టు నియమించిన పర్యావరణ కమిటీ పర్యవేక్షణలో ఉంది. అక్కడ నరికిన ప్రతి చెట్టుకూ లక్షరూపాయల లెక్కన రూ.4.54 కోట్ల జరిమానా చెల్లించాలని ఆ వ్యాపారిని కోర్టు ఆదేశించింది. అలాగే నష్టపరిహారం కింద రూ.2 కోట్ల విలువైన 9 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దాన్ని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్దేశించింది. కాగా శంకర్‌పై నమోదైన ధిక్కరణ కేసు నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ కేసు కారణంగా తన క్లయింట్ చాలా నష్టపోయారని కోర్టు ముందు వ్యాపారి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దాదాపు రూ.5కోట్ల జరిమానా కట్టారని, రూ.2కోట్ల విలువైన భూమిని అటవీ శాఖకు అప్పగించారని, ఆఖరికి నెల రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని శంకర్‌పై ఉన్న కేసును తొలగించాలని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన కోర్టు.. మరో రూ.50 లక్షలను సంక్షేమ సంఘాలకు విరాళంగా ఇవ్వాలని, అప్పుడు కేసు తొలగిస్తామని పేర్కొంది.


ఈ వార్తలూ చదవండి

ఢిల్లీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ హతం

మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్‌ నేతలే అడ్డుకున్నారు

Updated Date - Nov 20 , 2026 | 08:25 AM