Share News

పుష్కర స్నానాలకు ముహూర్తం లేదు

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:03 AM

గోదావరి పుష్కర స్నానాలకు ప్రత్యేకంగా ఎలాంటి ముహూర్తం లేదని దేవదాయశాఖ కమిషనర్‌ కె. రామచంద్ర మోహన్‌ స్పష్టం చేశారు.

పుష్కర స్నానాలకు ముహూర్తం లేదు

  • ఆ 12 రోజుల్లో ఏ ఘడియ అయినా మంచిదే

  • రూ.126 కోట్లతో 563 పనులకు ప్రతిపాదనలు

  • మార్చి ఆఖరుకు పూర్తి: దేవదాయ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కర స్నానాలకు ప్రత్యేకంగా ఎలాంటి ముహూర్తం లేదని దేవదాయశాఖ కమిషనర్‌ కె. రామచంద్ర మోహన్‌ స్పష్టం చేశారు. వైదిక పండితులంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని, ఆ 12 రోజుల్లో తొలిరోజు సూర్యోదయం నుంచి చివరి రోజు సూర్యాస్తమయం వరకూ ఏ ఘడియలోనైనా పుణ్నస్నానం ఆచరించవచ్చని తెలిపారు.

పుష్కరాల రోజుల్లో గోదావరి రేవుల్లో ఎక్కడ స్నానం ఆచరించినా పుణ్యమేనని పేర్కొన్నారు. పుష్కర ముహూర్తం, ఇతర అంశాలపై పండితులు, ఆధ్మాత్మిక ప్రముఖులు, అధికారులతో రాజమహేంద్రవరంలోని దేవదాయశాఖ ఆర్‌జేసీ కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వచ్చే జూన్‌ 26 నుంచి జూలై 7 వరకూ పుష్కర తేదీలుగా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది వస్తారనే అంచనాతో అన్ని శాఖల సమన్వయంతో పనులు చేపడుతున్నామని తెలిపారు.

ఆరు జిల్లాల్లోని అన్ని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పుష్కరాలకు దేవదాయ శాఖ ద్వారా ఆరు జిల్లాల పరిధిలో రూ.126 కోట్లతో 563 పనులు ప్రతిపాదించామని, వాటిలో 520 పనులకు పరిపాలనామోదం తెలిపినట్టు వెల్లడించారు. టెండర్లు పూర్తయిన 400 పైగా పనులు వివిధ దశల్లో ఉన్నాయని, 2027 మార్చి చివరి నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 06:16 AM