ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ
ABN , Publish Date - Nov 19 , 2026 | 09:06 PM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ‘అక్వాన్’ కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు.
విజయవాడ, నవంబర్19: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ‘అక్వాన్’ కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ఈ తుపాను పయనిస్తుందని తెలిపారు. నరసాపురానికి 390 కి.మీ., కళింగపట్నానికి 320 కి.మీ. దూరంలో.. అలాగే గోపాల్‌పూర్‌కు 410 కి.మీ., పూరీకి 470 కి.మీ., చెన్నైకి 610 కి.మీ. దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉందని వివరించారు.
శుక్రవారం మధ్యాహ్నానికి నరసాపురం - పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు. శుక్రవారం ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షం కురుస్తుందని సూచించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలకు సూచించారు. వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హుస్నాబాద్‌ను మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలపండి: సీఎంకి పొన్నం విజ్ఞప్తి
రహదారుల నిర్మాణాల్లో ఎక్కడ రాజీ పడొద్దు: ఇంజినీర్లకు కేంద్రమంత్రి సూచన
For More AP News And Telugu News