Share News

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

ABN , Publish Date - Nov 20 , 2026 | 02:51 AM

పురపాలక ఎన్నికల తరహాలోనే మండల పరిషత్‌ ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు సత్తా చాటుకున్నాయి. ఎంపీపీ,వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో 90శాతానికి పైగా పదవులను కైవసం చేసుకున్నాయి.భిన్నమైన పరిస్థితుల నడుమ ఐదు ఎంపీపీ, ఆరు వైస్‌ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా
తొట్టంబేడు ఆర్వో గది ఎదుట ఎంపీటీసీల నిరసన

-30పదవుల్లో టీడీపీకి 27... జనసేనకు 1

-వైస్‌ ఎంపీపీల్లోనూ కూటమికి 28...వైసీపీకి 2

- 5మండలాల్లో ఎన్నికలు వాయిదా

పురపాలక ఎన్నికల తరహాలోనే మండల పరిషత్‌ ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు సత్తా చాటుకున్నాయి. ఎంపీపీ,వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో 90శాతానికి పైగా పదవులను కైవసం చేసుకున్నాయి.భిన్నమైన పరిస్థితుల నడుమ ఐదు ఎంపీపీ, ఆరు వైస్‌ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.

తిరుపతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో మొత్తం 35 మండల పరిషత్‌లు వుండగా 30ఎంపీపీ పదవులకు గురువారం ఎన్నికలు సాఫీగా జరిగిపోయాయి. ఐదు ఎంపీపీ, ఆరు వైస్‌ ఎంపీపీ పదవులకు మాత్రం ఎన్నికలు నేటికి వాయిదా పడ్డాయి. ఎన్నికలు జరిగిన 30 మండల పరిషత్‌లలో టీడీపీకి 27, జనసేనకు ఒకటి, వైసీపీకి రెండు చొప్పున దక్కాయి. వైస్‌ ఎంపీపీ పదవుల విషయానికొచ్చేసరికి టీడీపీ 24 పదవులు, జనసేన రెండు, బీజేపీ ఒకటి, వైసీపీ రెండు చొప్పున దక్కించుకున్నాయి.

తొట్టంబేడులో టీడీపీ, బీజేపీ వివాదం

తొట్టంబేడు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా 10 టీడీపీ, ఒకటి బీజేపీ, ఒకటి వైసీపీ గెలుచుకున్నాయి. ఎంపీపీ పదవి తమకంటే తమకని టీడీపీ, బీజేపీ పట్టుబట్టాయి.బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి టీడీపీ ఎంపీటీసీ రమే్‌షను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించి పార్టీ బీఫామ్‌ను కూడా అందజేశారు. గురువారం ఉదయం రమేష్‌ నామినేషన్‌ కూడా వేశారు. ఆలోపు ఎంపీపీ పదవి ఆశిస్తున్న బీజేపీ ఎంపీటీసీ కృష్ణయ్య పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్ళడంతో బీజేపీ రాష్ట్రనేతలు రంగంలోకి దిగి టీడీపీ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో ఎంపీపీ పదవిని బీజేపీకి కేటాయించామని, టీడీపీ బీఫామ్‌ వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యేకి సమాచారం అందింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ టీడీపీ ఎంపీటీసీలను పిలిచి విషయం చెప్పినా వారు వినిపించుకోలేదు. ఎన్నికల్లో కష్టపడి ప్రచారం చేసి, డబ్బు ఖర్చుపెట్టి 12 సీట్లలో 10 సీట్లు గెలిస్తే ఇపుడు ఎంపీపీ పదవి ఇవ్వనంటారా అని ఆగ్రహించారు. ఎమ్మెల్యేపై అలిగి నేరుగా తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్ళి రమే్‌షతో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయించారు. మండల పరిషత్‌ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలు జరపగా ఇండిపెండెంట్‌ అభ్యర్థి అయిన టీడీపీ ఎంపీటీసీ రమే్‌షకు ఆ పార్టీ ఎంపీటీసీలంతా మూకుమ్మడిగా చేతులెత్తి మద్దతు పలికారు. ఈలోపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, శ్రీకాళహస్తి బీజేపీ నేత కోలా ఆనంద్‌ తమ అనుచరులతో కలసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎన్నికలు వాయిదా వేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. మరోవైపు కార్యాలయం లోపల టీడీపీ ఎంపీటీసీలు కూడా రమేష్‌ ఎంపీపీగా ఎన్నికైనట్టు ప్రకటించాలని నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేయాలని రిటర్నింగ్‌ అధికారిని ఆదేశించారు.ఎంపీపీ పదవి ఎవరికనేది కూటమిలో సకాలంలో సర్దుబాటు చేసుకోకపోవడంతో ఇది పెను వివాదానికి దారి తీసింది.

నాగలాపురంలో అడ్డుపడ్డ టీడీపీ వర్గ విభేదాలు

నాగలాపురంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలుండగా అన్నింటినీ టీడీపీయే గెలుచుకుంది. ఎంపీపీ పదవిని మోహనాంబాల్‌, జ్యోతి ఆశించి పట్టుదలకు పోవడంతో ఎంపీటీసీలు రెండు వర్గాలుగా విడిపోయారు. మోహనాంబాల్‌ వర్గంలో నలుగురు, జ్యోతి వర్గంలో ఆరుగురు చొప్పున వున్నారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గురువారం జరిగిన ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు. దీంతో కోరం లేనందున ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు.

వెంకటగిరిలో లాటరీకి ఒప్పుకోని టీడీపీ

వెంకటగిరి మండల పరిషత్‌లో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీ, వైసీపీ చెరి నాలుగు స్థానాలు చొప్పున కైవసం చేసుకున్నాయి. వైసీపీ నుంచీ ఒకరిద్దరు ఎంపీటీసీల మద్దతు కోసం టీడీపీ గట్టిగా యత్నించింది. ఒక ఎంపీటీసీ మద్దతు పలికేందుకు అంగీకరించినట్టు సమాచారం. అయితే దీన్ని పసిగట్టిన వైసీపీ నేతలు తిరుపతి ఎంపీ గురుమూర్తిని పార్టీ ఎంపీటీసీల వెంట గురువారం జరిగిన ఎన్నికల సమావేశానికి పంపించారు. ఎంపీ పక్కనే వుండడంతో ఆ పార్టీ ఎంపీటీసీ టీడీపీకి మద్దతిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇరు పార్టీలకూ సమానంగా సభ్యులున్నందున లాటరీ వేసి ఎంపీపీని, వైస్‌ ఎంపీపీని నిర్ణయించాలని అధికారులు ప్రతిపాదించారు. దీనికి వైసీపీ ఎంపీటీసీలు అంగీకరించినా టీడీపీ ఎంపీటీసీలు ఒప్పుకోలేదు. సమావేశంలోనే టీడీపీ ఎంపీటీసీలు తిరుపతి ఎంపీ గురుమూర్తితో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు.

కోరం లేక మూడుచోట్ల వాయిదా

ఓజిలి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలుంటే టీడీపీ 6, బీజేపీ ఒకటి,వైసీపీ మూడు చొప్పున గెలిచాయి. ఇక్కడ ఎంపీపీ పదవి ఎస్సీ జనరల్‌ కేటగిరీకి రిజర్వయింది. అయితే కూటమి నుంచీ గెలిచిన ఏడుగురిలో ఒక్కరు కూడా ఎస్సీలు లేరు. వైసీపీలో మాత్రం గెలిచిన ముగ్గురూ ఎస్సీలే. వారిలో ఎవరో ఒకరిని తమవైపు లాక్కుని ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు యత్నించినా బుధవారం రాత్రి వరకూ సాధ్యపడలేదని సమాచారం. ఈ నేపధ్యంలో గురువారం జరిగిన ఎన్నికల సమావేశానికి టీడీపీ, బీజేపీ ఎంపీటీసీలు ఏడుగురూ గైర్హాజరయ్యారు. వైసీపీ ఎంపీటీసీలు ముగ్గురూ వచ్చినప్పటికీ కోరం లేనందున అధికారులు ఎన్నికలు జరపకుండా శుక్రవారానికి వాయిదా వేశారు.

ఫవాకాడు మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 6, వైసీపీ 5 చొప్పున గెలుచుకున్నాయి. ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వయింది. టీడీపీ ఎంపీటీసీల్లో ఎస్టీ మహిళ లేరు. వైసీపీలో ఇద్దరు వున్నారు. గురువారం జరిగిన సమావేశానికి 11మందీ హాజరై ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత టీడీపీ ఎంపీటీసీలు ఎన్నికల్లో పాల్గొనకుండా వెళ్ళిపోయారు. కాసేపటికే వైసీపీ ఎంపీటీసీలు కూడా వెళ్ళిపోవడంతో అధికారులు ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు.

రెండు మండలాల్లో పదవులు తొలిసారి టీడీపీ కైవసం

చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండల పరిషత్‌లను టీడీపీ తొలిసారి గెలుచుకోగలిగింది. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచీ ఈ రెండు మండలాల్లో తొలుత కాంగ్రెస్‌, తర్వాత వైసీపీ మాత్రమే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంటూ వచ్చాయి. సుమారు 40 ఏళ్ళ తర్వాత ఈ మండలాల్లో టీడీపీ ఆధిక్యత సాధించి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులను సాధించింది.

ఏడు మండలాల్లో మహిళారాజ్యం

ఎన్నికలు జరిగిన 30 మండలాల్లో ఏడు చోట్ల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులను మహిళలే చేజిక్కించుకోవడం విశేషం.వాటిలో నారాయణవనం,బీఎన్‌ కండ్రిగ,కేవీబీపురం ,పుల్లంపేట,చిట్వేలి,చిన్నగొట్టిగల్లు,సూళ్ళూరుపేట వున్నాయి.

రాజకీయ కుటుంబాల నుంచీ ఎంపీపీలుగా ముగ్గురు

రాజకీయ నేపధ్యం కలిగిన కుటుంబాల నుంచీ ఐదుగురు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు.నాయుడుపేట ఎంపీపీ నెలవల రాజేశ్‌ సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమారుడు. ప్రస్తుత ఎమ్మెల్యే విజయశ్రీకి సోదరుడు. ఓబులవారిపల్లె ఎంపీపీ ముక్కా సాయి వికాస్‌రెడ్డి రైల్వే కోడూరు టీడీపీ ఇంఛార్జి, కడప అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ ముక్కా రూపానందరెడ్డి కుమారుడు. శ్రీకాళహస్తి ఎంపీపీ తాటిపర్తి రవీంద్రనాధరెడ్డి అక్కడి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి సోదరుడు ఈశ్వర్‌రెడ్డి తనయుడు.

19ఎస్టీవీడీ06:

తల్లి ప్రమాణ స్వీకారంలో చిన్నారి

సత్యవేడు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సత్యవేడు మండలంలో గురువారం జరిగిన ఎంపీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.సత్యవేడు-4 ఎంపీటీసీ హారిక ప్రమాణస్వీకార సమయంలో తన వంతు రాగానే వెళ్ళేందుకు సిద్ధమవగా వెంటవచ్చిన కుమార్తె వదల్లేదు. ఎంతసేపు వారించినా లాభం లేకపోవడంతో అధికారులు చివరకు చిన్నారితో వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారు.

19ఎస్టీవీడీ3: బాబుయాదవ్‌ని బుజ్జగిస్తున్న టీడీపీ నేతలు

వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో ప్రతిష్టంభన

సత్యవేడు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యవేడు వైస్‌ ఎంపీపీ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.కన్నవరం ఎంపీటీసీ బాబుయాదవ్‌ పోటీలో ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగింది. గురువారం ఉదయం సత్యవేడు మూడవ సెగ్మెంట్‌ ఎంపీటీసీ పామాంజి మురళిని టీడీపీ అధినాయకత్వం వైస్‌ ఎంపీపీగా ప్రకటించింది.ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఎంపీటీసీల చేత ముందుగానే మురళి పేరును ఖరారు చేయాలని సంతకాలను సేకరించారు. దీంతో కన్నవరం ఎంపీటీసీ అసంతృప్తితో ఉద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో తాను ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేనని వెనుదిరిగేందుకు సిద్ధమవగా టీడీపీ నేతలు బాబు యాదవ్‌ను బుజ్జగించి సమావేశ మందిరానికి తీసుకెళ్లారు.

ప్రమాణ స్వీకారం మరిచిన అధికారులు

సత్యవేడు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలతో ప్రమాణ స్వీకారం చేయించడాన్ని అధికారులు మరిచిపోయిన వైనమిది. సత్యవేడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్‌వో విజయభరత్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశులు అధ్యక్షతన ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం జరిగింది. తొలుత ఎంపీటీసీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక నిర్వహించి నూతన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసి తమ చాంబర్లలోకి వెళ్లిపోయారు.అయితే ప్రమాణ స్వీకారం చేయించడం మర్చిపోయామని గుర్తొచ్చి మళ్లీ మీటింట్‌ హాల్లోకి వచ్చారు. ఎంపీపీ జమునమ్మ, వైస్‌ ఎంపీపీ మురళి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

Updated Date - Nov 20 , 2026 | 02:52 AM