Share News

ఎంపీపీ ఎన్నికల్లో చిత్రాలెన్నో!

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:22 AM

మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. కూనవరంలో టీడీపీకి కేటాయించిన మండల పరిషత్‌ ...

ఎంపీపీ ఎన్నికల్లో చిత్రాలెన్నో!

  • జనసేన ఖాతాలోకి టీడీపీ ఎంపీపీ

  • సేనతో చేతులు కలిపిన కూనవరం ఎంపీటీసీ

  • మొవ్వలో బీజేపీలో చేరి పదవి దక్కించుకున్న టీడీపీ నాయకురాలు.. ఆ వెంటనే ప్రమాణం

  • పూసపాటిరేగలో బీఫారం జనసేనకు.. పదవి టీడీపీకి

  • అల్లూరిలో కూటమి మద్దతుతో వైసీపీ రెబల్‌ గెలుపు

  • కొన్ని చోట్ల స్వతంత్రులకు దక్కిన ఎంపీపీ పీఠాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. కూనవరంలో టీడీపీకి కేటాయించిన మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌(ఎంపీపీ) సీటును జనసేన దక్కించుకోగా, పూసపాటి రేగలో జనసేనకు కేటాయించిన ఈ పదవి అనూహ్యంగా టీడీపీని వరించింది. ఇక, చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఎంపీపీ పదవికి ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా కోడుమూరులో సీపీఎంతో చేతులు కలిపిన వైసీపీ.. ఎంపీపీ స్థానం తన వశం చేసుకుంది.

‘మద్దతు’ మారింది!

  • పోలవరం జిల్లా కూనవరం ఎంపీపీ ఎన్నిక సినీ ఫక్కీని తలపించింది. ఎంపీపీ పీఠం తమదేనని టీడీపీ నేతలు భావించిన సమయంలో జనసేన నేత సీపీఎం మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మండలంలో మొత్తం 8 ఎంపీటీసీల కు 4 టీడీపీ, 2 జనసేన, 2 సీపీఎం దక్కించుకున్నాయి. టీడీపీ పోచవరం ఎంపీటీసీ కౌలురి అరుణను ఎంపీపీగా, జనసేనకు చెందిన సోడే రమాదేవిని వైస్‌ ఎంపీపీగా బలపరచాలని నిర్ణయించుకున్నారు.


  • ముందుగా అరుణ కూటమి తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. కొద్ది క్షణాల్లోనే జనసేనకు చెందిన సోడే రమాదేవి సైతం ఎంపీపీ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. అరుణకు మద్దతుగా టీడీపీ నలుగురు ఎంపీటీసీల్లో ముగ్గురు మాత్రమే చేతులెత్తారు. సోడే రమాదేవికి సీపీఎంకు చెందిన ఇద్దరు, జనసేనకు చెందిన ఇద్దరు, కూనవరంటీడీపీ ఎంపీటీసీ లక్ష్మీప్రసన్న మద్దతు తెలిపారు. దీంతో రమాదేవి ఎంపీపీగా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

  • కృష్ణాజిల్లా మొవ్వ మండలం ఎంపీపీ పదవిని బీజేపీకి కేటాయించారు. దీంతో కూచిపూడి ఎంపీటీసీగా గెలిచిన బీజేపీ నేత పోలన సుష్మపేరును బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో అధికారులు బీజేపీ ఇచ్చిన బీఫారంఇవ్వాలని సుష్మను కోరారు. బీఫారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆమె అధికారులకు ఇచ్చారు. అయితే, ఈలోగా అయ్యంకి నుంచి టీడీపీ తరఫున ఎంపీటీసీగా గెలిచిన తాతా రత్నమాణిక్యంతో ఎంపీపీగా ఎంపీడీవో సుహాసిని ప్రమాణస్వీకారం చేయించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి రత్నమాణిక్యంకు బీఫారం ఇచ్చారు. అయితే, మండల టీడీపీ నాయకుల సూచనలతో రత్నమాణిక్యం బీజేపీ కండువా కప్పుకొని, ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

  • విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో 21 స్థానాలుండగా.. టీడీపీ 8, జనసేన 3, వైసీపీ 8, ఇండిపెండెంట్లు 2 గెలుచుకున్నారు. ఎంపీపీ బీఫారం జనసేనకు అభ్యర్థి సామాలమ్మకు ఇచ్చారు. అయితే కూటమి సభ్యులు ఆమెకు మద్దతు తెలపలేదు. తర్వాత టీడీపీ సభ్యుడు తమ్మినాయుడును జనసేన సభ్యులు సహా 12 మంది బలపర్చారు. దీంతో ఆయన ఎంపీపీగా ఎన్నికయ్యారు.


లాటరీ.. లక్కు!

  • విజయనగరం జిల్లాలోని గుర్లలో ఎంపీపీ ఎన్నిక లాటరీ పద్ధతిలో జరిగింది. ఇక్కడ 14 ఎంపీటీసీలకుగాను కూటమికి 7, వైసీపికి 7 వచ్చాయి. లాటరీలో టీడీపీ అభ్యర్థి సన్యాసినాయుడు ఎంపీపీగా ఎన్నికయ్యారు. డెంకాడ ఎంపీపీగా స్వతంత్ర అభ్యర్థి కంది ఉమ గెలుపొందారు. ఇక్కడ 16 మంది ఎంపీటీసీలు ఉండగా.. కూటమి 12, వైసీపీ మూడు గెలుచుకున్నాయి. టీడీపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో కంది ఉమ ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఈమెకు మండల టీడీపీ నాయకుల మద్దతు ఉంది. గురువారం ఎన్నికకు ముగ్గురు వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. మిగిలిన 13 మందిలో 8 మంది కంది ఉమకు మద్దతు తెలిపారు.

  • కృష్ణాజిల్లా ఉంగుటూరు ఎంపీపీ పదవి లాటరీ పద్ధతిలో టీడీపీకి దక్కింది. 16 ఎంపీటీసీలకుగాను టీడీపీ 8, వైసీపీ 7, సీపీఎం ఒకస్థానంలో గెలిచాయి. లాటరీ పద్ధతిలో ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. టీడీపీకి చెందిన పెదఅవుటపల్లి-2 ఎంపీటీసీ పుల్లూరు సుజిత, వైసీపీ తేలప్రోలు-1 ఎంపీటీసీ మరగాని గంగాలక్ష్మీ పేర్లను రాసి లాటరీ తీశారు. లాటరీలో పుల్లూరి సుజిత పేరు రావడంతో ఆమెతో ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేయించారు. వైస్‌ఎంపీపీ పదవికి కూడా లాటరీ నిర్వహించగా ఆత్కూరు-2 ఎంపీటీసీ(వైసీపీ) సొంగా బుజ్జిబాబు పేరు వచ్చింది. దీంతో ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.


  • భోగాపురం ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికలకు టీడీపీ, జనసేన అభ్యర్థులు, ఇండిపెండెంట్లు హాజరు కాకపోవడంతో ప్రిసైండింగ్‌ అధికారి ఎం. రామారావు వాయిదా వేశారు. టీడీపీ, జనసేన మధ్య ఎంపీపీ పదవి విషయమై విభేదాలు రావడంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది.

  • శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం ఎంపీపీ పదవికి టీడీపీలో ఇద్దరు ఆశావహుల మధ్య నెలకొన్న పోటీలో చివరకు రావాడ ఎంపీటీసీ సభ్యుడు లంక ప్రభాకర్‌ విజయం సాధించారు. 25 ఎంపీటీసీ స్థానాలకు గాను కూటమి 15, వైసీపీ 9, ఇండిపెండెంట్‌ ఒక స్థానంలో గెలిచారు. ఎంపీపీ పదవి కోసం ప్రభాకర్‌, జగన్నాథం నాయుడు పోటీపడ్డారు. ప్రభాకర్‌కు 12 మంది కూటమి సభ్యులు మద్దతివ్వగా.. జగన్నాథంనాయుడుకు ఇద్దరు కూట మి సభ్యులతోపాటు 9 మంది వైసీపీ సభ్యులు అండగా నిలిచారు.

చేతులు కలిపిన వైసీపీ-కామ్రేడ్స్‌

  • కర్నూలు జిల్లా కోడుమూరు ఎంపీపీ వైసీపీ ఖాతాలో పడింది. వైసీపీకి చెందిన ఎంపీటీసీ రఘునాథరెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ వైసీపీ-సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. దీంతో సీపీఎం నుంచి ఎంపీటీసీగా గెలిచిన కనికె నాగిరెడ్డిని ఉపాధ్యక్ష పదవి వరించింది. మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకుగాను వైసీపీ 10, టీడీపీ 9 స్థానాలు గెలుచుకున్నాయి. సీపీఎం ఒక చోట, స్వతంత్ర అభ్యర్థి మరో స్థానంలో గెలిచారు. అయితే సీపీఎం పొత్తుతో వైసీపీ సంఖ్యా బలం పెరగడంతో ఎంపీపీ పదవిని దక్కించుకుంది. ఓటమిని ముందే గ్రహించిన టీడీపీ ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు.


వైసీపీ వద్దంది.. టీడీపీ గెలిపించింది!

అల్లూరి జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో జీకే వీధి-1 ఎంపీటీసీ సభ్యుడు పూజారి లీలాప్రసాద్‌ ఎంపీపీగా గెలిచారు. ఈయనకు వైసీపీ టికెట్‌ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ ఎంపీపీ స్థానానికి వైసీపీ అభ్యర్థి బొబ్బిలి లక్ష్మణ్‌ను పార్టీ ప్రకటించింది. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకుగాను వైసీపీ 14, టీడీపీ 1, జనసేన 2, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.

వైసీపీకి 14 మంది మద్దతు ఉండడంతో ఎంపీపీ పీఠం తమదేనని నాయకులు ధీమాగా ఉన్నారు. జీకేవీధి-3 సెగ్మెంట్‌లో పోటీ చేసి గెలుపొందిన బొబ్బిలి లక్ష్మణ్‌ను ఎంపీపీ అభ్యర్థిగా సిఫారసు చేస్తూ పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు బీఫారం ఇచ్చారు. అయితే, జీకే వీధి-1 ఎంపీటీసీ సభ్యుడు పూజారి లీలాప్రసాద్‌ అత్యంత రహస్యంగా వైసీపీతోపాటు టీడీపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టారు.

చేతులెత్తే పద్ధతిలో ప్రిసైడింగ్‌ అధికారి ఎన్నిక నిర్వహించారు. బొబ్బిలి లక్ష్మణ్‌కు వైసీపీకి చెందిన ఐదుగురు సభ్యులు చెయ్యెత్తగా, స్వతంత్ర అభ్యర్థి లీలా ప్రసాద్‌కు వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు, టీడీపీకి చెందిన ఒకరు మద్దతిచ్చారు. దీంతో లీలాప్రసాద్‌ను ఎంపీపీగా ప్రకటించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 06:15 AM