Share News

బాలికపై రేప్ కేసులో 63 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష

ABN , Publish Date - Nov 29 , 2026 | 09:19 PM

ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 63 ఏళ్ల వ్యక్తికి మహారాష్ట్రలోని ఠాణే జిల్లా కల్యాణ్‌‌లో ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా దోషికి రూ.25 వేల జరిమానా కూడా వేసింది.

బాలికపై రేప్ కేసులో 63 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష

ఇంటర్నెట్ డెస్క్: ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 63 ఏళ్ల వ్యక్తికి మహారాష్ట్రలోని ఠాణే జిల్లా కల్యాణ్‌‌లో ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా దోషికి రూ.25 వేల జరిమానా కూడా వేసింది. బాధిత బాలికకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఆ పరిహారం అందించాలని ఆదేశించింది. ఈ మేరకు కోర్టు స్పెషల్ జడ్జి జస్టిస్ ఎల్‌.లక్ష్మీకాంత్‌ బిద్వాయ్‌ ఈనెల 27న తీర్పు వెలువరించారు.


ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామ్‌విలాస్ దిల్‌రాజ్ యాదవ్‌కు బాలిక కుటుంబంతో పరిచయం ఉంది. అతను తరచూ బాలిక ఇంటికి వెళ్లేవాడు. 2019 జనవరి 19న కూడా ఆమె ఇంటికి వెళ్లాడు. తాను పనిచేసే పిండి మిల్లుకు వెళ్లి పిండి తీసుకురావాల్సి ఉందని, బాలికను తన వెంట పంపాలని ఆమె తల్లిని యాదవ్ కోరాడు. అందుకు బాలిక తల్లి ఒప్పుకోలేదు. అయినా కూడా అతను బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాలికను ఆమె ఇంటికి పంపాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మన్పాడా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేసి కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. బాలికపై యాదవ్ అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించిన న్యాయస్థానం.. ఈ కేసు అరుదైన వాటిలో అత్యంత అరుదైనదిగా పరిగణించదగినది కాదని, నిందితుడికి నేర చరిత్ర కూడా లేదని పేర్కొంది. దీంతో మరణశిక్ష విధించకుండా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్

Updated Date - Nov 29 , 2026 | 09:19 PM