స్లీపర్ బస్సులో ప్రయాణమా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ABN , Publish Date - Sep 25 , 2026 | 07:43 AM
ఈ మధ్య కాలంలో ‘స్లీపర్ బస్సులో అగ్ని ప్రమాదాలు’ లాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే స్లీపర్ బస్సులో ప్రయాణించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవి ఏంటంటే?
ఇంటర్నెట్ డెస్క్: స్లీపర్ బస్సు ప్రయాణంలో ఉన్న సౌకర్యమే వేరు. సుదూర ప్రయాణాలకు ఇది చాలా అనువైనది. అయితే ఈ సౌకర్యం వెనుక ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. రాత్రి సమయంలో స్లీపర్ బస్సులో దాదాపుగా ప్రయాణికులందరూ నిద్రపోతారు. ఒకవేళ బస్సుకు అకస్మాత్తుగా నిప్పంటుకుంటే, క్షణాల్లోనే పెను ప్రమాదం జరగవచ్చు. అందుకే స్లీపర్ బస్సులో ప్రయాణించాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో తెలుసుకోవాలి
స్లీపర్ బస్సు ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ (అత్యవసర నిష్క్రమణ మార్గాలు) ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. అలాగే తప్పించుకోవడానికి వీలుగా ఉన్న ఇతర మార్గాలనూ అన్వేషించాలి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి బస్సుకు అత్యవసర నిష్క్రమణ మార్గాలు కచ్చితంగా ఉంటాయి.
చేయాల్సినవి.. చేయకూడనివి..!
రాత్రి నిద్రపోయే ముందు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండే చోట మొబైల్‌ను ఉంచాలి.
అత్యవసర నిష్క్రమణ మార్గాల వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ వస్తువులను పెట్టకూడదు.
బస్సులో మంటలు, పొగ కనిపిస్తే, వస్తువులను తీసుకోవడానికి ప్రయత్నించి సమయాన్ని వృథా చేసుకోకండి. ఇలా చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం.
మంటలు, పొగ వేగంగా వ్యాపిస్తుంటే వెంటనే బస్సు నుంచి దిగిపోవాలి.
పొగ లేదా మంటలు వస్తున్న దిశ వైపు వెళ్లకుండా, సురక్షితమైన మరో ద్వారం నుంచి తప్పించుకోవాలి.
బస్సును ఎంచుకొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తక్కువ ఛార్జీలను చూసి లేదా ఇతర సౌకర్యాలు చూసి బస్సులను ఎంచుకోవద్దు.
టికెట్ బుకింగ్‌కు ముందు బస్సు ఆపరేటర్ ఎవరు?, వాహన స్థితి ఎలా ఉంది? లాంటివి కూడా పరిశీలించాలి. అలాగే ఆ బస్సులో ఉన్న భద్రతా ఫీచర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని క్షుణ్నంగా తెలుసుకోవాలి.
ప్రయాణికుల్లో ఎవరి దగ్గరైనా అనుమానాస్పదమైన వస్తువులు, పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తిస్తే తక్షణమే బస్సు యాజమాన్యాన్ని తెలియజేయాలి.
ఇవి కూడా చదవండి
ప్రయాణంలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు
రైల్వే సీట్లు బ్లూ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి?