రక్షాబంధన్... ఉండదక్కడ!
ABN , Publish Date - Aug 23 , 2026 | 10:06 AM
సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. సోదరులు ఎక్కడున్నా, ఆ రోజున అక్కాచెల్లెళ్లు వారికి రాఖీలు కట్టడం మాత్రం మరవరు.
సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. సోదరులు ఎక్కడున్నా, ఆ రోజున అక్కాచెల్లెళ్లు వారికి రాఖీలు కట్టడం మాత్రం మరవరు. ఒకవేళ దూరంగా ఉంటే పోస్టులోనో, కొరియర్‌లోనో పంపించి ఆరా తీస్తారు. చెల్లెలి మీద ప్రేమతో సోదరులు పలు రకాల కానుకలివ్వడం ఆనవాయితీ. అయితే ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో మాత్రం మాకొద్దీ రాఖీ పండగ అంటున్నారు. దీనికి రకరకాల కథలున్నాయి...
కర్రలకు రాఖీలు...
దేశవ్యాప్తంగా రాఖీపౌర్ణమిని ఆనందోత్సాహాలతో జరుపుకొంటే... ఉత్తరప్రదేశ్‌లోని హార్పూర్ జిల్లాలో ఉన్న 60 గ్రామాల్లో మాత్రం ఈ పండగను జరుపుకోరు. ఏ ఆడపిల్ల కూడా తన సోదరునికి రాఖీ కట్టదు. మరేం చేస్తారు? ఇక్కడ కర్రలకు రాఖీ కట్టే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. 17వ తరానికి చెందిన హిందూ రాజపుత్రుల రాజు మహారాణా ప్రతాప్ కాలం నాటి సంప్రదాయాన్ని ఇక్కడ ఇప్పటికీ ఆచరిస్తున్నారు.
1576లో హల్డీఘాటీ యుద్ధం జరిగింది. యుద్ధంలో పాల్గొన్న సైనికుల కర్రలకు మహిళలు రాఖీ కట్టి వారిని యుద్ధానికి పంపించారట. అప్పటినుంచి ఆ యుద్ధానికి గుర్తుగా ఈ సంప్రదాయం మొదలైంది. తరతరాలుగా గ్రామస్తులు ఆ సంప్రదాయాన్నే ఆచరిస్తున్నారు. రాఖీపౌర్ణమి వచ్చిందంటే... సోదరుల చేతికి కాకుండా, కర్రలకు రాఖీలు కడతాడు. దీన్ని వారు ‘ఛడీ పూజ’ అని పిలుస్తారు. ఈ సందర్భంగా గ్రామంలో జాతరలు జరుపటం ఆనవాయితీగా వస్తోంది.
పండగ శాపం...
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సురానా అనే గ్రామం ఉంది. అక్కడ 12వ శతాబ్దంలో సరిగ్గా రాఖీ పండగ రోజున మహమ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఊళ్లోని వాళ్లని దారుణంగా చంపేశాడు. ఓ మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు మాత్రం వేరే ఊరు వెళ్లడం వల్ల బతికిపోయారట. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకోవాలని చూశారు. కానీ ఆ పిల్లవాడిలో ఒకడు అదే రోజు దివ్యాంగుడిగా మారిపోయాడు. దీంతో ఆ ఊరికేదో శాపం తగిలిందని రాఖీ పండగను జరుపుకోవడం మానేశారు.
అదేవిధంగా సంభాల్ జిల్లాలోని గున్నార్ ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా రాఖీ పండగ సందడి అస్సలు కనిపించదు. దానికీ ఓ కథ ఉంది. 25 ఏళ్ల కిందట ఓ సోదరి తన అన్నకు రాఖీ కట్టింది. అయితే అనూహ్యంగా అతను కొన్ని గంటలకే చనిపోయాడు. ఇదొక్కటే కాదు... ఆ తర్వాత కూడా సరిగ్గా రక్షాబంధన్ రోజునే ప్రమాదం జరిగి... చాలామంది మగవాళ్లు చనిపోవడంతో ఆ ఊరి ప్రజలు రక్షాబంధన్‌కు గుడ్ బై చెప్పేశారు. గోండా జిలాల్లోని బికంపూర్ జగత్ పూర్వాలో కూడా రాఖీ రోజున అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయనే కారణంతో.... శాపంగా భావించి రాఖీ పండగను చేసుకోరు.
కానుక భయంతో..
సంభాల్ జిల్లాలో బైనిపూర్ చాక్ గ్రామానిది మరో రకమైన కథ. రాఖీ కట్టిన తర్వాత సాధారణంగా సోదరులు... సోదరీమణులకు డ బ్బులు లేదా ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీ కదా. 300 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో ఒక జమీందార్ ఉండేవాడు. అతనికి ఇద్దరూ కొడుకులే. రాఖీ కట్టేందుకు కూతురు లేదని బాధపడ్డాడు. రాఖీ పండగ రోజు వారి కులానికి చెందిన అమ్మాయిలతో తన కొడుకులకు రాఖీ కట్టించాడు. వారు రాఖీ కట్టిన దానికి ప్రతిఫలంగా జమీందార్ ఆస్తిని అడిగారట.
పండగకు విలువ ఇస్తూ జమీందార్ కుటుంబం ఆ అమ్మాయిలకు ఆస్తి ఇచ్చి, ఊరు వదిలి వెళ్లిపోయారు. రాఖీపౌర్ణమి కానుకగా.... ఉన్న ఆస్తి ఇచ్చి ఊరు విడిచి వెళ్లాల్సివచ్చిందనే కారణంతో స్థానికులు ఈ పండగను జరుపుకోవడంలేదనే కథ ప్రచారంలో ఉంది. ఇలా దేశ, విదేశాల్లో ఓవైపు రాఖీపౌర్ణమి జరుపుకొంటుంటే... మరోవైపు రకరకాల కారణాల వల్ల, సంప్రదాయాల వల్ల ఉత్తరప్రదేశ్‌లోని చాలా గ్రామాల్లో రాఖీ పండగ జరుపుకోకపోవడం ఒకరకంగా విడ్డూరమే కదా!
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కులు రాక
Read Latest AP News And Telangana News And International News And Telugu News