Share News

భళా... ‘భోగాపురం’ కళ!

ABN , Publish Date - Aug 23 , 2026 | 08:15 AM

ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం.. సంస్కృతీ సాంకేతికతల ‘కళ’బోత.

భళా... ‘భోగాపురం’ కళ!
Bhogapuram Airport

ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం.. సంస్కృతీ సాంకేతికతల ‘కళ’బోత. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకృతి అందాలను, ఆధ్యాత్మిక ప్రత్యేకతలను, సంప్రదాయాలను పర్యాటకులకు పరిచయం చేస్తుంది. తూర్పు తీరానికి ముఖద్వారంగా వర్ధిల్లుతున్న విశాఖపట్నం సమీపాన ఏర్పాటైన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర కళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. విమానాశ్రయానికి పెట్టిన పేరు దగ్గర నుంచి... లోపల కనిపించే ప్రతీ దృశ్యం సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.

తూర్పు కనుమల్లో గిరిజనులను సైన్యంగా మార్చుకొని ఆంగ్లేయులను ఎదురించి, స్వాతంత్య్రం కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టారు. దేశంలో ఈ తరహా పేరు ఏ విమానాశ్రయానికీ లేకపోవడం గమనార్హం.

ఆయన విగ్రహాన్ని విమానాశ్రయం ప్రాంగణంలో పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విమానాశ్రయంలోకి ఒకసారి అడుగుపెడితే...


ఏటికొప్పాక బొమ్మల ఆహ్వానం

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటికొప్పాక బొమ్మలకు ఒక ప్రత్యేకత ఉంది. మెత్తటి అంకుడు కర్రతో వీటిని తయారు చేస్తారు. సహజ సిద్ధమైన రంగులను వేస్తారు. లక్కతో అతికిస్తారు. పిల్లలు ఆడుకోవడానికి, దసరా బొమ్మల కొలువులో పెట్టుకోవడానికి వీటిని ముందుగా ఆర్డర్‌ ఇచ్చి తయారు చేయించుకుంటారు. ఇటీవల వీటిని పెళ్లిళ్లలో రిటర్న్‌గిఫ్ట్‌గా కూడా ఇస్తున్నారు. చాలాకాలంగా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. చేతిలో ఇమిడిపోయే ఈ బొమ్మలను నిలువెత్తు రూపంగా తయారు చేసి విమానాశ్రయం ఎదుట స్వాగతం పలుకుతున్నట్టు ప్రదర్శించడంతో అత్యంత శోభాయమానంగా కనిపిస్తోంది.


book3.jpgఉభయ తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల్లో ఉపయోగించే నాదస్వరం, సంగీత సాధకులు ప్రత్యేకంగా తయారు చేయించుకునే బొబ్బిలి వీణ, కళా ప్రదర్శనలను నేపథ్య సంగీతంతో రక్తి కట్టించే మృదంగ వాద్యాలు అన్నీ ఇక్కడి ఆంధ్రుల కళా సంస్కృతిని కళ్లకు కట్టినట్టు ప్రదర్శిస్తున్నాయి. వీణా వాద్యకారులు బొబ్బిలిలో తయారైన వీణలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. వాటినే ఉపయోగిస్తారు. అందుకని విమానాశ్రయంలో వాటిని ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు.


ఆకాశం నుంచి నాదస్వరాలు

విమానాశ్రయం టెర్మినల్‌ మధ్యలో సీలింగ్‌ నుంచి రంగు రంగుల నాదస్వరాలను వేలాడి దీసి కొత్త రకం షాండ్లియర్లుగా తీర్చిదిద్దారు. తెలుగు ఇళ్లలో ప్రతీ శుభకార్యాలయంలో సన్నాయి వాద్యం తప్పనిసరి. ఈ విమానాశ్రయం నుంచి వెళ్లేవారికి కూడా ఆ శుభ సంగీతం వినిపించాలనే అభిరుచితో వాటిని షాండ్లియర్లుగా వేలాడదీయడం సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. స్కైలైట్‌గా వ్యవహరిస్తున్న ఈ కళాకృతిలో నుంచి పగటిపూట సూర్యకిరణాలు లోపల పడి వెలుగులు పంచుతాయి. రాత్రివేళ లోపల అమర్చిన విద్యుద్దీపాలు కాంతిని విరజిమ్ముతాయి.


book3.2.jpg60 మీటర్ల డిజిటల్‌ స్క్రీన్‌

విమానాశ్రయం టెర్మినల్‌ భవనంలో 60 మీటర్ల వెడల్పున అతి పెద్ద డిజిటల్‌ స్ర్కీన్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక నిలయాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ ఒక్కొక్కటిగా ప్రదర్శితమయ్యే ఏర్పాట్లు చేశారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం, విజయనగరం పైడితల్లి, సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి, అనకాపల్లి నూకాంబిక.. ఇలా అన్ని దివ్యక్షేత్రాలు కనిపిస్తాయి. అలాగే విశాఖ సాగర తీరం, అరకు అందాలు, బొర్రా గుహల విశేషాలు కనువిందు చేస్తాయి. అదేవిధంగా సింహాచలం, విజయవాడ, తిరుపతి ప్రధాన ఆలయాల్లో కన్నుల పండువగా నిర్వహించే తెప్పోత్సవాలకు సింబాలిక్‌గా హంస బొమ్మను ఏర్పాటుచేశారు.


కడప శిలతో లేపాక్షి బసవన్న

శిల్ప కళలకు ఆంధ్రప్రదేశ్‌ పెట్టింది పేరు. లేపాక్షి బసవన్నను ప్రపంచ ప్రయాణికులకు చూపించడానికి విమానాశ్రయం గోడపై దానిని శిలతో చెక్కించారు. కడపలో సేకరించిన మాలవరం ఇసుకరాయిని ఇందుకోసం ఉపయోగించారు. డిజిటల్‌ స్కానింగ్‌ చేసి, లేపాక్షిలో బసవన్న కొలతలు తీసుకొని దానికి అనుగుణంగా గోడ నుంచి బయటకు ఉద్భవించినట్టుగా చూపించారు. దీనికి నేపథ్యంగా శతాబ్దాల ఆలయ సంప్రదాయాలను కళాకృతులను చూపించారు. ఈ తరానికి తెలియని తోలుబొమ్మలాటలను కూడా కళాత్మకంగా చిత్రీకరించి, అవి ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగిస్తున్నారు.


book3.3.jpgఅరకు కాఫీ ఘుమఘుమలు

విశాఖ ఏజెన్సీలో గిరిజనులు పండించే కాఫీ రుచే వేరు. అరకు కాఫీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్న దీనిని ఇక్కడి విమాన ప్రయాణికులకు అందించడానికి ప్రత్యేకమైన స్టాల్‌ ఏర్పాటు చేశారు. అక్కడే బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు ఇలా అన్ని రకాల ప్రత్యేక వంటకాల రుచులను పరిచయం చేస్తున్నారు.


book3.5.jpgసీలింగ్‌పై సంక్రాంతి ముగ్గులు

తెలుగులోగిళ్లలో తెల్లవారితే కనిపించేది ఇంటి ముందు ముగ్గులే. సంక్రాంతి పర్వదినాల్లో అయితే ఇక చెప్పక్కర్లేదు. ఆ సొగసును కూడా అంతర్జాతీయ పర్యాటకులకు చూపించడానికి జీఎంఆర్‌ యాజమాన్యమే టెర్మినల్‌లో సీలింగ్‌ మొత్తం సంక్రాంతి ముగ్గుల డిజైన్‌తోనే తయారు చేయించింది. నేలపై ఉండాల్సిన ముగ్గులు ఆకాశంలో విస్తరించినట్టుండి అద్భుత దృశ్యాలను ఆవిష్కరిస్తోంది. మొత్తానికి కొత్తగా ప్రారంభమైన భోగాపురం విమానాశ్రయాన్ని చూడగానే ఎవరైనా సరే ఒక్కసారిగా ‘భళా’ అనాల్సిందే!

  • యర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం

ఫొటోలు: వై.రామకృష్ణ


ఈ వార్తలు కూడా చదవండి:

శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కులు రాక

ఆదమరిస్తే అన్నీ కష్టాలే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 08:21 AM