తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకన్న ముందు నా సోదరినే అనుకున్నారు..
ABN , Publish Date - May 31 , 2026 | 06:58 AM
అప్పుడెప్పుడో ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో మెరిసి, బాలీవుడ్ చెక్కేసిన జాన్వీ కపూర్... ఈసారి ‘పెద్ది’తో జోడి కట్టి జోరు మీదుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో రామ్‌చరణ్ రస్టిక్ లుక్‌తో కనిపిస్తుంటే... అచ్చియమ్మగా తన గ్లామర్‌లుక్‌తో ఆకట్టుకుంటోంది జానూ.
అప్పుడెప్పుడో ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో మెరిసి, బాలీవుడ్ చెక్కేసిన జాన్వీ కపూర్... ఈసారి ‘పెద్ది’తో జోడి కట్టి జోరు మీదుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో రామ్‌చరణ్ రస్టిక్ లుక్‌తో కనిపిస్తుంటే... అచ్చియమ్మగా తన గ్లామర్‌లుక్‌తో ఆకట్టుకుంటోంది జానూ. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని క్యూట్ కబుర్లివి...
‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌గా ముందు నా సోదరి ఖుషీకపూర్ అనుకున్నారు బుచ్చిబాబు. కానీ ఆ తర్వాత ఆ ఆఫర్ నా దగ్గరకి వచ్చింది. అచ్చియమ్మగా ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్నా.
నేనుండేది ముంబాయిలో కానీ హైదరాబాద్ నాకు రెండో ఇల్లుగా అనిపిస్తుంది. ఇక నుంచి రెగ్యులర్‌గా తెలుగుతో పాటు.. తమిళ సినిమాల్లో కూడా కనిపించాలనుకుంటున్నా.
నాకు వేటికైనా ముద్దు పేర్లు పెట్టడం అలవాటు. పెంపుడు జంతువులకే కాదు... కొన్నిసార్లు వస్తువులకు కూడా ముద్దుపేర్లు పెట్టేస్తుంటా. అలా నా వాటర్ బాటిల్‌కి ‘చుస్కీ’ అని పేరు పెట్టా.
నేను జ్యోతిషం నమ్ముతా. నాది మీనరాశి. ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా పగటికలలు కంటారట. అదేం మహిమో తెలియదుగానీ నాకూ ఆ అలవాటు ఉందండోయ్...
ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. నేను చాలా ఎమోషనల్ పర్సన్. నా చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాల్సిందే.

నాకొక వింత అలవాటు ఉంది. కొన్నిసార్లు నాలో నేను మాట్లాడుకుంటుంటా. అది కూడా ఎప్పుడో తెలుసా? నాన్నకు చెప్పని, చెప్పలేని విషయాలను అలా మాట్లాడుకోవడం అలవాటుగా మారింది.
చిన్నప్పుడు నాన్నతో సిగరెట్ మానిపించడానికి... బాత్‌రూమ్‌లోకి సిగరెట్స్ తీసుకు వెళ్లి వాటికి టూత్‌పేస్ట్ పూసేదాన్ని. అలాగే సిగరెట్స్ కనిపిస్తే వాటిని విరిచేసేదాన్ని. అంత కోపంగా ఉండేది వాటిని చూస్తే.
అమ్మ చనిపోయాక డిప్రెషన్‌లోకి వెళ్లా. అమ్మ అప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లాల్సింది కాదు. తను చాలా చూడాల్సి ఉండేది. చాలా అనుభవించాల్సి ఉండేది. అమ్మను చాలా మిస్సవుతున్నా. నన్ను నన్నుగా మలిచిన ఆమెకు చాలా రుణపడి ఉంటా. ఒకరకంగా అమ్మ జ్ఞాపకాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.
నా చెల్లి కొన్నిసార్లు నాకు తల్లిలా ఉంటుంది. ఒకరికొకరం చాలా సపోర్టివ్‌గా ఉంటాం. అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకు మాత్రం గొడవ పడుతుంటాం. కానీ మెచ్యూర్డ్‌గా సర్దుకుంటాం. వెంటనే కలిసిపోతాం.
నేను మద్యానికి బానిసనయ్యానని చెప్పను గానీ.. కొవిడ్ సమయంలో కొన్నిరోజులు తరచుగా డ్రింక్ చేస్తుండేదాన్ని. అది నా జీవితంలో ఒక వరస్ట్ ఫేజ్. అయితే కొన్నిరోజులకు నా నుంచి వచ్చిన మందు వాసన నాకే నచ్చలేదు. అసహ్యం కలిగింది. ఇక అప్పటి నుంచి ఎప్పుడూ డ్రింక్ చేయాలనుకోలేదు.

తిరుమల బాలాజీ అంటే భక్తి ఎక్కువ. నాకు తిరుపతిలో వీఐపీ దర్శనం ఉంటుంది. అయితే దేవుడి దగ్గరికి వీఐపీలా వెళ్లాలనిపించదు. అందుకే చాలాసార్లు 3550 మెట్లెక్కి... తర్వాతే బాలాజీ దర్శనం చేసుకుంటా.
ఒకవేళ పెళ్లి చేసుకుంటే... బ్యాచిలర్ పార్టీ ఇటలీలోని కాప్రీలో... మెహందీ, సంగీత్ మాత్రం మా అమ్మ (శ్రీదేవి) చాలాకాలం ఉన్న చెన్నైలోని మైలాపూర్ ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నా. పెళ్లి వేడుకను అతి తక్కువ మంది సమక్షంలో తిరుపతిలో చేసుకోవాలనుంది. పెళ్లి చీర మాత్రం మనీష్ మల్హోత్రా డిజైన్ చేయాల్సిందే.

తిరుపతిలో నా ముగ్గురు పిల్లలతో సెటిల్ కావాలనే ఆశ ఉంది. ముగ్గురు పిల్లలని ఎందుకన్నానంటే... గొడవలు ఎప్పుడూ ఇద్దరి మధ్యనే అవుతాయి. అప్పుడు వారికి మూడో మనిషి సపోర్ట్ కావాలి. అందుకే ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కావాలనుకుంటున్నా.
రోజూ ‘గోవింద’ నామస్మరణతో, అరిటాకులో భోజనం చేయాలనేది నా చిరకాల కోరిక.
నాది ఓపెన్ మైండ్ మనస్తత్వం. అంతఃసౌందర్యానికి విలువ ఇస్తా. మనుషుల్ని బాగా నమ్ముతా. ఒకవేళ ఎదుటి వాళ్లలో నెగిటివిటీ చూస్తే... అది కూడా నాలోనే ఉందనుకొనే రకాన్ని నేను. అంత పాజిటివ్‌గా ఉంటా.
ఈ వార్తలు కూడా చదవండి:బంగారం కొనాలనుకుంటున్నారా..
నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి’
Read Latest AP News And Telangana News And International News And Telugu News