Share News

రక్షణ గోడలు నిర్మించండి

ABN , Publish Date - May 31 , 2026 | 06:28 AM

గోదావరి వరదతో స్పిల్‌వే నుంచి ప్రవాహ తాకిడికి భూమి కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ నిపుణుడు, పోలవరం నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరైన సీన్‌ హించ్‌బర్గర్‌ రాష్ట్ర జలవనరుల శాఖకు సూచించారు.

రక్షణ గోడలు నిర్మించండి

  • స్పిల్‌వే నుంచి భారీ ప్రవాహ తాకిడికి భూమి కోతకు గురయ్యే ప్రమాదముంది

  • నిపుణుడు సీన్‌ హించ్‌బెర్గర్‌ సూచన

  • పీపీఏ కార్యాలయంలో ఇంజనీర్లతో సమీక్ష

అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): గోదావరి వరదతో స్పిల్‌వే నుంచి ప్రవాహ తాకిడికి భూమి కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ నిపుణుడు, పోలవరం నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరైన సీన్‌ హించ్‌బర్గర్‌ రాష్ట్ర జలవనరుల శాఖకు సూచించారు. ఈ నెల 26న రాజమహేంద్రవరానికి వచ్చిన ఆయన రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని ప్రధాన డ్యామ్‌ ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ పనులను పరిశీలించారు. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులపైనా లోతైన సమీక్ష చేపట్టారు. రాజమహేంద్రవరంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో సీఈవో సంజీవ్‌ వోహ్రా, పీపీఏ కార్యదర్శి రఘురామ్‌, జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహమూర్తి తదితరులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేసిన హించ్‌బర్గర్‌.. వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. స్పిల్‌వే నుంచి స్పిల్‌ చానల్‌ మీదుగా ప్రవాహం 14 లక్షల క్యూసెక్కులు దాటి వేగంగా నదిలో కలిసినప్పుడు భూమి కోతకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. భూమి కోతకు గురికాకుండా రక్షణ గోడలు ఏర్పాటు చేయాలన్నారు. కాగా 2020లో వచ్చిన వరదకు డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. అప్పట్లో గ్యాప్‌-1, గ్యాప్‌-2 ద్వారా వరద ప్రవహించింది. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ను పూర్తిగా నిర్మించడంతో వరదంతా స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ ద్వారానే కిందకు వెళ్తూ గోదావరి నదిలో కలుస్తోంది. 2020 తరహాలో గోదావరికి భారీ వరద వస్తే.. స్పిల్‌వేను దాటి స్పిల్‌చానల్‌ మీదుగా వరద సుడులు తిరుగుతూ నదిలోకి జలాలు వెళ్లే చోట భూమి కోతకు గురయ్యే ప్రమాదముందని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కుడివైపునకు ఈ వరద వెళ్తే తగు రక్షణ చర్యలు ఉన్నా.. ఎడమవైపు భూమి కోతకు గురైతే మాత్రం పెను విధ్వంసం జరుగుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. వరద జలాలు పురుషోత్తపట్నం వైపునకు వెళితే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవం రాకుండా స్పిల్‌చానల్‌ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర జల సంఘానికి రాష్ట్ర జల వనరుల శాఖ గడచిన రెండేళ్లుగా అభ్యర్థిస్తూనే ఉంది. కానీ కేంద్ర జలసంఘం మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా నాన్చుడు ధోరణితో ఉంది. తాజాగా అంతర్జాతీయ నిపుణుడు సీన్‌ హించ్‌బెర్గర్‌ సూచనలు చేయడంతో మరోసారి సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. స్పిల్‌చానల్‌ వద్ద రక్షణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - May 31 , 2026 | 06:29 AM