Share News

సైకోగా కనిపించాలనుంది!

ABN , Publish Date - May 10 , 2026 | 06:54 AM

‘జాతిరత్నాలు’లో చిట్టీగా ప్రేక్షకుల మనసు దోచేసిన ఆరడుగుల సొగసరి ఆమె. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి, తెరపై చలాకీతనం ఉట్టిపడే పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. విభిన్నమైన పాత్రలతో సందడి చేస్తూ... టాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న ఫరియా అబ్దుల్లా చెబుతున్న సరికొత్త కబుర్లివి...

సైకోగా కనిపించాలనుంది!
Faria Abdullah

‘జాతిరత్నాలు’లో చిట్టీగా ప్రేక్షకుల మనసు దోచేసిన ఆరడుగుల సొగసరి ఆమె. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి, తెరపై చలాకీతనం ఉట్టిపడే పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. విభిన్నమైన పాత్రలతో సందడి చేస్తూ... టాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న ఫరియా అబ్దుల్లా చెబుతున్న సరికొత్త కబుర్లివి...

ఛాన్స్‌ మిస్‌... బాధపడుతుంటా...

‘హను-మాన్‌’ సినిమాలో అమృత అయ్యర్‌ పోషించిన పాత్ర చేసే అవకాశం మొదట నాకే వచ్చింది. అయితే అప్పుడే నేను ఇండస్ట్రీకి కొత్తగా రావడం ఒక కారణమైతే, ‘జాతి రత్నాలు’ హిట్‌ అవ్వడంతో పాత్రల ఎంపికలో జాగ్రత్త వహించాలనుకున్నా. కానీ ‘హను-మాన్‌’లో ఆ పాత్ర ప్రాముఖ్యతను గ్రహించలేకపోయా. ఇప్పటికీ తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మను కలిసినప్పుడల్లా ‘మీ సినిమా మిస్‌ చేసుకున్నా’ అని బాధపడుతుంటా.


book1.2.jpgడైరెక్షన్‌ చేస్తా!

‘జెట్లీ’ సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్‌ చెప్పా. ‘మత్తు వదలరా-2’లో ‘డ్రామా నక్కో మామా’ పాట రాసి, కొరియోగ్రఫీ కూడా చేశా. అలా విభిన్న రకాలుగా ఓ సినిమాలో భాగం కావడానికి ప్రయత్నిస్తా. దర్శకత్వం మీద మొదటి నుంచి ఆసక్తి ఉంది. వీలైతే వచ్చే ఏడాదే డైరెక్షన్‌ ట్రయల్స్‌ మొదలెడతా. నేను చేసే సినిమాలో నా మార్క్‌ చూపడానికి ఇష్టపడతా. అలాగే కథకు మొదటి ప్రాధాన్యం ఇస్తా.

షెఫ్‌ అయ్యేదాన్ని...

సినిమాల్లోకి రాకపోయుంటే ఓ పెద్ద క్రూయిజ్‌లో షెఫ్‌ లేదా ఈవెంట్‌ మేనేజర్‌ అయ్యేదాన్ని. అలానే ట్రావెల్‌ వ్లాగర్‌గా కూడా ప్రయత్నించేదాన్ని కావచ్చు.


book1.3.jpgప్రేమ వేరు... పెళ్లి వేరు...

నా దృష్టిలో ప్రేమ, పెళ్లి అనేవి వేరు వేరు అంశాలు. ప్రేమంటే ఒక అద్భుతమైన అనుభూతి. మనల్ని ఒకరు ప్రేమిస్తున్నారు అనే భావనే అద్భుతంగా ఉంటుంది. జీవితానికి ఒక తోడు కచ్చితంగా అవసరమే. వివాహబంధం అనేది ఒక మనిషి తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుత జనరేషన్‌ పెళ్లిపై ఆసక్తి కోల్పోతోంది. భవిష్యత్తులో వివాహానికి అర్థమే మారిపోవచ్చు.


హద్దుల్లో ఉంటే ఇబ్బంది లేదు

సోషల్‌మీడియా వాడడం మంచిదే. కానీ అది శ్రుతిమించని స్థాయిలో... హద్దుల్లో ఉంటే ఇబ్బంది లేదు. గాసిప్స్‌, రూమర్స్‌ ఇలాంటివన్నీ సహజంగానే వస్తుంటాయి. వాటిని ఎక్కువగా పట్టించుకోకూడదు. కెరీర్‌పై ఫోకస్‌ చేసుకుంటూ మన పని మనం చేసుకోవాలి.


book1.5.jpgగ్రామీణ యువతిగా... సరికొత్తగా...

నటిగా నాకు సూటయ్యే అన్ని రకాల పాత్రల్లోనూ నటించాలనుకుంటున్నా. కొత్త కొత్త జానర్‌ చిత్రాల్లో భాగం కావాలని ఉంది. నా క్యారెక్టర్‌ డిజైన్‌ బాగుంటే చిన్న రోల్‌ చేయడానికి కూడా సిద్ధమే. తెరపై నాకు ఇప్పటిదాకా సవాలు విసిరే పాత్రలు రాలేదు అనే అసంతృప్తి ఉండేది. ‘భగవంతుడు’ చిత్రం ఆ లోటును తీర్చుతుంది. ఇందులో గ్రామీణ యువతిగా సరికొత్తగా కనిపిస్తా. ఎక్కువగా యాక్షన్‌ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటా. అలాగే సైకో, సీరియల్‌ కిల్లర్‌... ఇలా చీకటి కోణాల్ని ఆవిష్కరించే రోల్స్‌ చేయడమంటే ఇష్టం.

- మోహన్‌ సత్య వర్మ


ఈ వార్తలు కూడా చదవండి:

మోదీని చూసి నేర్చుకుంటేనే...

ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..

Read Latest Telangana News and National News

Updated Date - May 10 , 2026 | 06:54 AM