Share News

ఆ మేధ కృత్రిమమే..దాసోహం కావొద్దు

ABN , Publish Date - May 10 , 2026 | 06:14 AM

సాంకేతికతను అనుకూలంగా మలచుకోవాలేగానీ, దానికి దాసోహం కాకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌ సూచించారు.

ఆ మేధ కృత్రిమమే..దాసోహం కావొద్దు

  • హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ లీసా గిల్‌ సూచన

రాజమహేంద్రవరం, మే 9(ఆంధ్రజ్యోతి): సాంకేతికతను అనుకూలంగా మలచుకోవాలేగానీ, దానికి దాసోహం కాకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో శనివారం పది కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ప్రారంభించారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇవాళ యువత, పెద్దవాళ్లు కూడా కృత్రిమ మేధకు ఆకర్షితులవుతున్నారు. దయ చేసి అది కృత్రిమమైనదని గుర్తుంచుకోండి. ఆ వలలో చిక్కుకోకండి. మనం సాంకేతికతకు దాసోహం కాకూడదు. సాంకేతికతను అనుకూలంగా మలచుకోవడం ఓ మంచి ఉపాయం. న్యాయ వ్యవస్థ కేవలం కోర్టు గదులు, ఇటుకలకే పరిమితం కాదు. ప్రజల మనోభావాలకు సజీవ ప్రతిబింబం’ అన్నారు. డిజిటలైజేషన్‌, డిజిటైజేషన్‌ మన వ్యవస్థలో భాగమైపోయాయని చెప్పారు. సాంకేతికత కారణంగానే కొవిడ్‌ విపత్తులోనూ కోర్టులు పనిచేశాయన్నారు. కోర్టుల్లో ఇప్పుడు మెరుగైన మౌలిక సదుపాయాలు వస్తున్నాయని.. అయితే ఎప్పటికప్పుడు వాటి నిర్వహణ, కాలానుగుణ అభివృద్ధిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజీ, మధ్యవర్తిత్వం అనేవి వైవాహిక, ప్రమాదాల కేసుల్లో మాత్రమే ఉపకరిస్తాయనుకోవడం సరికాదన్నారు. పలు రకాల కేసులను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం ఒక మంచి మార్గమని చెప్పారు. మీడియేషన్‌ సమర్థవంతంగా చేయగలిగితే కేసుల పెండెన్సీని తగ్గించవచ్చన్నారు. కోర్టులు కేసులను నిర్ణయించే విధంగా కాకుండా పరిష్కారం చూపించే విధంగా ఉండాలన్నారు. తీర్పులు త్వరితగతిన రావడానికి సాక్ష్యాలను త్వరగా ప్రవేశపెట్టడం వంటి వాటిలో పోలీసుశాఖ సహకారం అవసమని చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌, జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి, జస్టిస్‌ సుమతి జగడం, జస్టిస్‌ న్యాపతి విజయ్‌, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా న్యాయాధికారి సునీత గంధం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2026 | 06:15 AM