Share News

అదిగదిగో ఏలియన్లు

ABN , Publish Date - May 10 , 2026 | 05:34 AM

గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? అంటే ఇప్పటికీ అస్పష్టమైన సమాధానమే లభిస్తోంది. అయితే తాజాగా పెంటగాన్‌ విడుదల చేసిన సమాచారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది.

అదిగదిగో ఏలియన్లు

  • నాలుగు అడుగుల రోబోల్లా ఉన్నారు

  • ఎగిరే వస్తువుల్లో వేగంగా తిరుగుతున్నారు

  • పెంటగాన్‌ ఫైల్స్‌లో ఆసక్తికర అంశాలు

వాషింగ్టన్‌, మే 9: గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? అంటే ఇప్పటికీ అస్పష్టమైన సమాధానమే లభిస్తోంది. అయితే తాజాగా పెంటగాన్‌ విడుదల చేసిన సమాచారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. అమెరికా రక్షణ శాఖ అత్యంత రహస్యమైనవిగా(క్లాసిఫైడ్‌) గతంలో వర్గీకరించిన 160కి పైగా ఫైళ్లను అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు శుక్రవారం విడుదల చేశారు. అవన్నీ యూఎ్‌ఫఓలుగా పిలిచే గుర్తుతెలియని అసాధారణ దృగ్విషయాల(యూఏపీ)పై దశాబ్దాల కాలం నుంచి వ్యోమగాములు, సైనిక సిబ్బంది, నిఘా అధికారులు, సాధారణ ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించినవి. ఈ ఫైల్స్‌లో 1940 నుంచి ఇప్పటి వరకు మిలిటరీ వీడియోలు, ఇన్‌ఫ్రారెడ్‌ చిత్రాలు, ఎఫ్‌బీఐ మెమోలు, నాసా ప్రతులు, ప్రత్యక్ష సాక్షులకు చెందినవి ఉన్నాయి. గ్రహాంతర వాసుల సమాచారం, వారి ఉనికి గురించి ఈ ఫైల్స్‌లో ఏవీ ధ్రువీకరించడంలేదని పెంటగాన్‌ అధికారులు చెబుతున్నా, సమాచారంలో లోపం కారణంగా పలు విషయాలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.


ప్రపంచ వ్యాప్తంగా పలు సంఘటనలు

గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించి వందలాది సంఘటనల సమాచారం ఆ ఫైల్స్‌లో ఉంది. వీటిలో ఉత్తర అమెరికా, పశ్చిమాసియా, తూర్పు చైనా సముద్రం, ఆఫ్రికా, గ్రీస్‌కు సమీపంలోని మధ్యదరా ప్రాంతం ఘటనలు ఆ ఫైల్స్‌లో రికార్డు అయ్యి ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన ఫైల్స్‌లో గుర్తుతెలియని వస్తువులు వేగంగా కదులుతున్నట్లు చూపిస్తున్న మిలిటరీ ఇన్‌ఫ్రారెడ్‌ వీడియోలు, అసాధారణ ఆకృతులను రాడార్లు గుర్తించినవి, అత్యంత వేగంతో దిశ మార్చుకుంటున్న ప్రకాశవంతమైన గోళాల సమాచారం వెల్లడయ్యాయి. సముద్ర ఉపరితలం సమీపంలో గంటకు 80 మైళ్ల వేగంతో 90 డిగ్రీల కోణంలో మలుపులు తిరుగుతున్న వస్తువును అమెరికా మిలిటరీ సెన్సార్‌ ట్రాకింగ్‌ చేసిన ఫైల్‌ కూడా అందులో ఉంది. తర్వాత అది ఇన్‌ఫ్రారెడ్‌కు చిక్కకుండా మాయమవ్వడంతో దానిని ట్రాక్‌ చేస్తున్న సిస్టం సంబంధాన్ని కోల్పోయినట్లు ఆ ఫైల్స్‌ పేర్కొన్నాయి. అపోలో మిషన్ల వ్యోమగాముల నివేదికలు కూడా ఆ ఫైల్స్‌లో ఉన్నాయి. 1969లో చంద్రుడికి సమీపంలో ఓ కాంతిపుంజాన్ని చూసినట్లు అపోలో 11 వ్యోమగామి బజ్‌ అల్ర్డిన్‌ చెప్పారు. అంతరిక్షంలోకి వెళుతున్న కాంతి రేఖలు చూసినట్లు 1972 అపోలో 12 మిషన్‌ వ్యోమగామి అలన్‌ బీన్‌ పేర్కొన్నారు. అపోలో 17 మిషన్‌ సందర్భంగా చంద్రుడి ఉపరితలంపై త్రిభుజాకారపు కాంతి పుంజాలు చూసినట్లు నాసా చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. నిశ్శబ్దంగా కదులుతూ ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్న సిగరెట్‌, కోడిగుడ్డు, డిస్క్‌ ఆకారంలోని వస్తువులు చూసినట్లు సాక్ష్యాధారాలతో కూడిన ఎఫ్‌బీఐ ఫైల్స్‌ను కూడా పెంటగాన్‌ బయటపెట్టింది.


సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న హ్యూమనాయిడ్‌ లాంటి ఆకారాలను చూసినట్లు పలువురు చెప్పిన ఆధారాలు కూడా అందులో ఉన్నాయి. ఈ ఫైల్స్‌ అన్నింటిని పెంటగాన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అయితే, గ్రహాంతర వాసుల ఉనికి లేదని 2024లో పెంటగాన్‌ నివేదిక స్పష్టం చేసింది. సెన్సార్లలో లోపాలు, వాతావరణ మార్పుల వల్ల కొన్ని వస్తువులను ఏలియన్స్‌గా భ్రమించే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా, భారత్‌లో యూఏపీల చరిత్ర హిమాలయాల నుంచి ఉత్తరప్రదేశ్‌ అంచుల వరకు ఉంది. గ్రహాంతర వాసులు ఉండవచ్చని 2024లో నాటి ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ యూఏపీల ఆధారాలకు సంబంధించి అమెరికా లాగా మనదేశం ప్రత్యేకమైన డేటా బేస్‌ నిర్వహించడంలేదు. ఏలియన్స్‌పై నెలకొన్న ఆసక్తి కారణంగా అమెరికా వంటి డేటాబేస్‌ నిర్వహించాలని ప్రపంచ దేశాలు కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది.


భారత్‌లో ఏలియన్స్‌?

భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉన్న కోంగ్‌కా లా పాస్‌ అనే వివాదాస్పద ప్రాంతాన్ని స్థానికులు, సైనిక సిబ్బంది యూఎ్‌ఫవో బేస్‌గా అభివర్ణిస్తారు. 2012లో ఇక్కడి గగనతలంలో 100 వరకు కాంతివంతమైన వస్తువులు నెలల పాటు కనిపించినట్లు మిలిటరీ సిబ్బంది చెప్పారు. 2015లో కాన్పూర్‌కు చెందిన ఓ బాలుడు సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫ్లయింగ్‌ సాసర్‌ వంటి వస్తువును తాను రికార్డు చేసినట్లు ఆ బాలుడు చెప్పాడు. ఓ యూఎఫ్‌వో వంటి వస్తువు కనిపించడంతో 2023లో ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలను 3గంటల పాటు నిలిపివేశారు. దానిని అడ్డుకోవడానికి వాయుసేన రెండు రఫేల్‌ జెట్స్‌ను కూడా పంపింది. యూఎఫ్‌వోను నిర్ధారించుకునేలోపే అది కనుమరుగైంది.

Updated Date - May 10 , 2026 | 05:35 AM