రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - May 10 , 2026 | 06:20 AM
శ్రీలంకకు ఆనుకుని గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంతో ఈ నెల 11న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
13 తర్వాత బలపడే అవకాశం
14,15 తేదీల్లో సీమ, కోస్తాలకు భారీ వర్ష సూచన
అమరావతి, విశాఖపట్నం, మే 9(ఆంధ్రజ్యోతి): శ్రీలంకకు ఆనుకుని గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంతో ఈ నెల 11న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 13 తర్వాత వాయువ్యంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం దిశగా పయనించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. అయితే కొన్ని మోడళ్లు వాయుగుండం మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కాగా బంగాళాఖాతంలో బలపడనున్న వాయుగుండం ప్రభావంతో ఈనెల 14,15 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా శనివారం రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత తగ్గినా అనేక ప్రాంతాల్లో ఎండ ప్రభావం, వేడి వాతావరణం, ఉక్కపోత కొనసాగాయి. కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అక్కడక్కడా సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది.
నేడు కోస్తా, సీమలో తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో వీస్తున్న గాలులు, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం మేఘావృతమైన వాతావరణంతోపాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అయితే కొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం ఉంటుందని తెలిపింది. మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.