Share News

గుజరాత్‌ జైత్రయాత్ర

ABN , Publish Date - May 10 , 2026 | 06:04 AM

ఈ ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ వైపు వడివడిగా సాగుతోంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 84) సూపర్‌ బ్యాటింగ్‌కు తోడు స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (4/33) తిప్పేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌తో...

గుజరాత్‌ జైత్రయాత్ర

వరుసగా నాలుగో విజయం

జైపూర్‌: ఈ ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ వైపు వడివడిగా సాగుతోంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 84) సూపర్‌ బ్యాటింగ్‌కు తోడు స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (4/33) తిప్పేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 77 రన్స్‌తో ఘనవిజయం సాధించింది. ఇది గిల్‌ సేనకు వరుసగా నాలుగో విజయం కాగా.. ఆ జట్టు 14 పాయింట్లతో టాప్‌-2కి చేరింది. ఇక రాజస్థాన్‌కు చివరి ఏడు మ్యాచ్‌ల్లో ఇది ఐదో ఓటమి. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55), వాషింగ్టన్‌ సుందర్‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్‌) రాణించారు. బ్రిజేశ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో రాజస్థాన్‌ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. జడేజా (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38), వైభవ్‌ సూర్యవంశీ (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36), జురెల్‌ (10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 24) మాత్రమే ఆకట్టుకున్నారు. హోల్డర్‌ 3 వికెట్లు తీశాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా రషీద్‌ ఖాన్‌ నిలిచాడు.


పసలేని ఆటతీరుతో..: భారీ ఛేదనలో ఎప్పటిలాగే ఓపెనర్‌ వైభవ్‌ తుఫాన్‌ వేగంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. కానీ గుజరాత్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఫలితం లేకపోయింది. జడేజా మధ్య ఓవర్లలో కాస్త అండగా నిలిచాడు. తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్‌ మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. కానీ ఈ మధ్యలోనే అతడు 3 ఫోర్లు, 3 సిక్సర్లతో హోరెత్తించాడు. ఇందులో రబాడ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లున్నాయి. వైభవ్‌ దూకుడును సిరాజ్‌ అడ్డుకోవడంతో తొలి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే జైస్వాల్‌ (3)ను రబాడ అవుట్‌ చేశాడు. ఐదో ఓవర్‌లో జురెల్‌ 6,4,6,6తో 22 రన్స్‌ అందించాడు. అటు హెట్‌మయెర్‌ (6) మళ్లీ నిరాశపర్చినా.. జడేజా 6,4తో పవర్‌ప్లేలో జట్టు 78/3 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. ఇక మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ రషీద్‌ హవా చూపాడు. ఎనిమిదో ఓవర్‌లో జురెల్‌, ఫెరీరా (4)లను కళ్లుచెదిరే బంతులతో బౌల్డ్‌ చేశాడు. కాసేపటికే శుభమ్‌ దూబే (15)ను కూడా రషీద్‌ బౌల్డ్‌ చేయడంతో రాజస్థాన్‌ 115/6 స్కోరుతో ఓటమి దిశగా సాగింది. జడేజా కాస్త క్రీజులో నిలిచి పోరాడడంతో ఆశలు కనిపించాయి. కానీ, రషీద్‌ 14వ ఓవర్‌లో జడ్డూను ఎల్బీ చేశాడు. ఇక, చివరి వరుస బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో రాజస్థాన్‌ పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే ఓటమి మూటగట్టుకుంది.


ఓపెనర్ల దూకుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే భారీ స్కోరు దిశగా సాగింది. ఓపెనర్లు గిల్‌, సుదర్శన్‌ జోరును రాజస్థాన్‌ బౌలర్లు నిలువరించలేకపోయారు. బట్లర్‌ (13) విఫలమైనా డెత్‌ ఓవర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, తెవాటియా (14 నాటౌట్‌) జట్టు స్కోరును 220 దాటించారు. తొలి ఓవర్‌లోనే పేసర్‌ ఆర్చర్‌ నాలుగు వైడ్లు, ఓ నోబ్‌తో 11 బంతులు వేసి 18 రన్స్‌ ఇచ్చాడు. మొదట సుదర్శన్‌ తానే ఎక్కువ స్ట్రయికింగ్‌ తీసుకుని దూకుడు కనబర్చాడు. ఆ తర్వాత గిల్‌ చెలరేగి ఐదో ఓవర్‌లో 4,6,4.. ఆరో ఓవర్‌లో 4,4,4 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 82 పరుగులతో నిలిచింది. ఈ దశలో స్పిన్నర్లు పరుగులను కట్టడి చేశారు. 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన సుదర్శన్‌ను స్పిన్నర్‌ యష్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఉన్నకాసేపు బట్లర్‌ వేగం చూపినా అతను 14వ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఇక సెంచరీ వైపు సాగుతున్న గిల్‌ను 17వ ఓవర్లో బ్రిజేశ్‌ వెనక్కిపంపాడు. అయితే సుందర్‌ మాత్రం బౌండరీలతో ఆకట్టుకున్నాడు. 18, 19వ ఓవర్లలో పరుగులను కట్టడి చేసిన రాజస్థాన్‌.. ఆఖరి ఓవర్‌లో మాత్రం తెవాటియా రెండు సిక్సర్లు, సుందర్‌ 6తో 21 రన్స్‌ సమర్పించుకుంది. దీంతో గుజరాత్‌ సవాల్‌ విసిరే స్కోరందుకుంది.


స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) ఆర్చర్‌ (బి) యశ్‌రాజ్‌ 55, గిల్‌ (సి) దేశ్‌పాండే (బి) బ్రిజేశ్‌ 84, బట్లర్‌ (సి) ఫెరీరా (బి) జడేజా 13, వాషింగ్టన్‌ (నాటౌట్‌) 37, హోల్డర్‌ (సి) జైస్వాల్‌ (బి) బ్రిజేశ్‌ 7, తెవాటియా (నాటౌట్‌) 14, ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 20 ఓవర్లలో 229/4; వికెట్ల పతనం: 1-118, 2-150, 3-185, 4-205; బౌలింగ్‌: ఆర్చర్‌ 3-0-46-0, తుషార్‌ దేశ్‌పాండే 4-0-52-0, బ్రిజేశ్‌ 4-0-47-2, యశ్‌రాజ్‌ 4-0-37-1, జడేజా 4-0-34-1, ఫెరీరా 1-0-11-0.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) నిషాంత్‌ (బి) రబాడ 3, వైభవ్‌ సూర్యవంశీ (సి) అర్షద్‌ (బి) సిరాజ్‌ 36, జురెల్‌ (బి) రషీద్‌ 24, హెట్‌మయెర్‌ (సి) హోల్డర్‌ (బి) రబాడ 6, జడేజా (ఎల్బీ) రషీద్‌ 38, ఫెరీరా (బి) రషీద్‌ 4, శుభమ్‌ దూబే (బి) రషీద్‌ 15, షనక (సి) గిల్‌ (బి) హోల్డర్‌ 16, ఆర్చర్‌ (సి) బట్లర్‌ (బి) హోల్డర్‌ 5, దేశ్‌పాండే (సి) వాషింగ్టన్‌ (బి) హోల్డర్‌ 1, బ్రిజేశ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 16.3 ఓవర్లలో 152 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-38, 2-40, 3-68, 4-87, 5-91, 6-115, 7-136, 8-141, 9-151, 10-152; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-55-1, రబాడ 3-0-33-2, సాయి కిషోర్‌ 1-0-8-0, రషీద్‌ ఖాన్‌ 4-0-33-4, వాషింగ్టన్‌ 2-0-10-0, హోల్డర్‌ 2.3-0-12-3.

Updated Date - May 10 , 2026 | 06:07 AM