క్రికెటర్ల ‘టాటూ’ కహానీ!
ABN , Publish Date - Mar 08 , 2026 | 07:15 AM
సంగీతకారులకు, క్రీడాకారులకు టాటూల పిచ్చి కాస్త ఎక్కువే. ప్రేమబంధాలు, విజయాలు... ఇలా అన్నింటినీ శరీరంపై చెరిగిపోని పచ్చబొట్టుగా మార్చుకుని, అభిమానులను ఆకట్టుకుంటారు మన క్రికెటర్లు.
సంగీతకారులకు, క్రీడాకారులకు టాటూల పిచ్చి కాస్త ఎక్కువే. ప్రేమబంధాలు, విజయాలు... ఇలా అన్నింటినీ శరీరంపై చెరిగిపోని పచ్చబొట్టుగా మార్చుకుని, అభిమానులను ఆకట్టుకుంటారు మన క్రికెటర్లు. అయితే వాటి వెనుక ఉండే కహానీలు ఏంటో తెలుసా?...
చేతిపై వరల్డ్ కప్...
కెప్టెన్‌గా మహిళల క్రికెట్‌పై బలమైన ముద్ర వేసింది హర్మన్ ప్రీత్‌కౌర్. తన నాయకత్వంలోనే భారత మహిళల జట్టు గతేడాది వన్డే ప్రపంచ కప్‌ను అందుకుని 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఆ విజయానికి గుర్తుగా తన ఎడమ చేతి భుజంపై వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు, 2025 (గెలిచిన సంవత్సరం), 52 (పరుగుల వ్యత్యాసం) నెంబర్లతో టాటూ వేయించుకుంది. అలాగే ఆమె ఎడమ భుజంపై ఉన్న మండల టాటూలో ‘అహం బ్రహ్మాస్శి’ అనే మంత్రం ఉంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని, అంతర్గత బలాన్ని సూచిస్తుంది.
తల్లిదండ్రులకు ప్రేమతో...
‘మిస్టర్ 360’గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్‌కు తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. అందుకే తన భుజంపై వారి ముఖాలను టాటూగా వేయించుకున్నాడు. అలాగే అతడి చేతిపై తల్లిదండ్రుల పేర్లతో ఒక అంబిగ్రామ్ టాటూ కూడా ఉంది. అంటే ఒక వైపు నుంచి చూస్తే తండ్రి పేరు, మరోవైపు నుంచి చూస్తే తల్లి పేరు కనిపిస్తుందన్నమాట. అలాగే తన భార్య దేవిషా శెట్టిపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఛాతి మీద ఆమె పేరును టాటూగా వేయించుకున్నాడు.
అంతేకాదు.. 2014లో న్యూజీలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి ‘మౌరీ’ తెగ సంస్కృతికి ప్రభావితమై... మౌరీ ట్రైబల్ టాటూ వేయించుకున్నాడు. ఇది అదృష్టాన్ని తెస్తుందని, మనసును ప్రశాంతంగా ఉంచుతుందని సూర్యకుమార్ నమ్ముతాడు.
‘ప్రేమ’ బంధం
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒంటి మీద ఇటీవల ఓ కొత్త పచ్చబొట్టు చేరింది. ప్రేయసి మహికాశర్మతో అనుబంధానికి గుర్తుగా హార్దిక్... తన మెడ వెనుక రెండు చిరుత చిత్రాలతో పాటు వాటి మధ్యలో ‘ఎం’ అనే అక్షరాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. హార్దిక్ ఛాతీపై ఉండే మీడియా ప్లేయర్ బటన్లు (పాజ్, ప్లే, ఫార్వర్డ్).. గతాన్ని నెమరువేసుకుంటూ, వర్తమానాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తు వైపు ‘ఫాస్ట్ ఫార్వర్డ్’ అవ్వాలనే జీవిత సత్యాన్ని చెబుతాయి.
కుడిచేతిపై ఉన్న యోధుడి టాటూ, కష్టాలు ఎదురైనప్పుడు ‘నెవర్ గివప్’ అంటూ హెచ్చరిస్తూనే ఉంటుందట. ఎడమ భుజంపై ఉన్న సింహం బొమ్మ... మైదానంలో అతడు ప్రదర్శించే ఫియర్‌లెస్ ఆటతీరును, గెలిచి తీరాలనే వేటగాడి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తనపై తాను పెట్టుకున్న నమ్మకమే తనను ఈ స్థాయికి చేర్చిందని చాటిచెప్పేలా ‘బిలీవ్’ అనే పదాన్ని చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.
టాటూల వీరుడు
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఒంటి మీద ఏకంగా 12 టాటూలున్నాయి. తన ఎదుగుదలకు కారణమైన తల్లి ‘సరోజ్’, తండ్రి ‘ప్రేమ్’ పేర్లను హిందీలో తన చేతులపై చెరిగిపోని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా.. ఎడమ చేతిపై తన వన్డే క్యాప్ నంబర్ 175, టెస్ట్ క్యాప్ నంబర్ 269లను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. కోహ్లీకి అత్యంత ఇష్టమైన టాటూలలో ఒకటి జపనీస్ సమురాయ్.
ఆధ్యాత్మిక కోణంలో ఎడమ భుజంపై ధ్యాన ముద్రలో ఉన్న శివుడు, వెనుక కైలాస పర్వతం చిత్రాలుంటాయి. కోహ్లీది వృశ్చిక రాశి. అందుకే తన రాశి చిహ్నమైన తేలు టాటూను కుడి చేతిపై వేయించుకున్నాడు. ఎడమ చేతిపై ఉన్న సేక్రెడ్ జామెట్రీ టాటూ మనిషి జీవిత చక్రాన్ని, విశ్వంలో ఒకదానికొకటి ఉన్న సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది.
ఐదు సిక్సర్లకు గుర్తుగా...
టీమ్ ఇండియా బ్యాటర్ రింకూసింగ్ అనగానే... పవర్‌ఫుల్ హిట్టింగ్ గుర్తుకొస్తుంది. 2023 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు బాది, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గెలిపించిన ఘట్టం కళ్ల ముందు మెదులుతుంది. ఆ అద్భుత క్షణానికి గుర్తుగా పచ్చబొట్టు వేయించుకున్నాడు రింకూ. తన ఎడమ చేతిపై ఒక వృత్తం (సూర్యుడు) ఉండి, అందులో ‘గాడ్స్ ప్లాన్’ అని రాసి ఉంటుంది. ఆ వృత్తం చుట్టూ ఉన్న గీతలు (సూర్య కిరణాల్లా) ఆ మ్యాచ్‌లో ఆయన కొట్టిన ఐదు సిక్సర్ల దిశలను సూచిస్తాయి.
అలాగే కుడి చేతి మీద 2:20ని సూచిస్తూ ఒక గడియారం బొమ్మ ఉంటుంది. 2018లో కోల్‌కతా జట్టు వేలంలో తనను ఎంపిక చేసినప్పుడు సమయం మధ్యాహ్నం 2:20 అయ్యింది. అది తన జీవితాన్ని మార్చిన సమయం కాబట్టే ఆ టాటూ వేసుకున్నాడట.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News