Share News

పుస్తకాల పర్వతం..

ABN , Publish Date - Nov 08 , 2026 | 09:23 AM

పుస్తకం చదివేలా చేయాలంటే పుస్తకం కొనిస్తే సరిపోదు. అలాగని భయపెట్టో, బెదిరించో పుస్తకాలు చదివేలా చేయలేరు. పుస్తకం చదవాలంటే ఆసక్తి కలగాలి.

పుస్తకాల పర్వతం..
Book Mountain Library

పుస్తకం చదివేలా చేయాలంటే పుస్తకం కొనిస్తే సరిపోదు. అలాగని భయపెట్టో, బెదిరించో పుస్తకాలు చదివేలా చేయలేరు. పుస్తకం చదవాలంటే ఆసక్తి కలగాలి. అందుకేనేమో రోజూ కళ్ల ముందు పుస్తకాలు ఒక పర్వతంలా కనిపించేలా గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఈ విభిన్న ఆలోచన సత్ఫలితాలను ఇచ్చింది. నెదర్లాండ్స్‌లోని స్పైకెనిస్సే పట్టణంలో ఉన్న పబ్లిక్‌ లైబ్రరీ స్థానికులను పుస్తక పఠనం వైపు మళ్లేలా చేయడంలో విజయవంతమైంది.

నెదర్లాండ్స్‌లో ఉన్న ‘బుక్‌ మౌంటెన్‌’ ఒక సాధారణ గ్రంథాలయం కాదు. పుస్తకాల పట్ల ప్రేమను పెంచడానికి రూపొందించిన ఒక సృజనాత్మక ఆలోచనకు ప్రతిరూపం. దీని ప్రత్యేకత ఏమిటంటే... సాధారణ గ్రంథాలయంలా కాకుండా పుస్తకాలతో నిండిన ఒక పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఈ గ్రంథాలయాన్ని ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడానికి ఏర్పాటు చేశారు. ఈ అద్దాల మేడను ఎంవిఆర్‌డివి అనే ఆర్కిటెక్చర్‌ సంస్థ డిజైన్‌ చేసింది.


book3.2.jpgపుస్తక పఠనం నేర్పాలని...

కొన్నేళ్ల క్రితం స్పైకెనిస్సే ఒక కుగ్రామం. అక్కడి గ్రామ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. కాలక్రమంలో గ్రామం పట్టణంగా అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయి. అయితే, పట్టణంలో అక్షరాస్యత మాత్రం పది శాతం కన్నా ఎక్కువ లేదు. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలకు చదవడం పట్ల ఆసక్తి మాత్రం పెరగలేదు. ముఖ్యంగా పిల్లలు, యువత పుస్తకాలు చదవడం కన్నా టీవీ వినోదాలపై ఎక్కువ సమయం గడుపు తున్నారనే ఆందోళన ఉండేది. దాంతో పట్టణ ప్రజలకు పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగేలా చేయాలని అధికారులు నిర్ణయించారు. అది కూడా ప్రజలు స్వయంగా వచ్చి పుస్తకాలు చదవాలని అనిపించేలా గ్రంథాలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా ఒక అద్భుతమైన డిజైన్‌తో గ్రంథాలయం నిర్మించారు.


book3.3.jpgఒక పర్వతం ఆకారంలో పుస్తకాల అరలు కూడా క్రమంగా పైకి వెళ్లేలా భవనాన్ని రూపొందించారు. దూరం నుంచి చూస్తే ఈ భవనం పుస్తకాలతో నిర్మించిన పర్వతంలా కనిపిస్తుంది. అందుకే ‘బుక్‌ మౌంటెన్‌’ అనే పేరు స్థిరపడింది. భవనం చుట్టూ పారదర్శకమైన గాజు నిర్మాణం ఉండటం వల్ల బయట నుంచి లోపల ఉన్న పుస్తకాల అరలు స్పష్టంగా కనిపిస్తాయి. వాటి మధ్య విశాలమైన మెట్లు, చదువుకోవడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. భవనం మొత్తం గాజుతో నిర్మించడం వల్ల సహజ వెలుతురు బాగా వస్తుంది. గ్రంథాలయం పైభాగంలో కెఫే ఉంటుంది. పర్యావరణ విద్యా కేంద్రం, చెస్‌ క్లబ్‌, సమావేశ గదులు, ఆడిటోరియం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.


ఈ భవన నిర్మాణంలో అనేకమంది శ్రమ దాగి ఉంది. భవనానికి సరైన ఆకారం ఇవ్వడం, గాజు పైకప్పును ఏర్పాటు చేయడం, పుస్తకాల అరలను మెట్లతో అనుసంధానించడం, లోపలికి సహజమైన వెలుతురు వచ్చేలా చూడటం వంటివి పక్కాగా అమరేలా చూశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి పై అంతస్తు వరకు 480 మీటర్ల వాకింగ్‌ రూట్‌ ఉంటుంది. గాజు నిర్మాణం, పర్వతంలాంటి ఆకారం, పైకి వెళ్లే మార్గం ప్రజల్లో ఆసక్తిని కలిగించాయి.

పుస్తకాలు చదవడం అనేది పాఠశాలలో జరిగేది మాత్రమే కాదని, అది ఆనందాన్ని ఇచ్చే అనుభవమని ‘బుక్‌ మౌంటెన్‌’ తెలియజేస్తుంది. ఈ గ్రంథాలయం పఠనాన్ని ప్రోత్సహించే వినూత్నమైన నిర్మాణంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ‘పబ్లిక్‌ లైబ్రరీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు పోటీలలో ఫైనలిస్ట్‌గా నిలిచింది.


ఈ వార్తలు కూడా చదవండి:

భ్రాంతిలో బతికితే ఫలితమిదే!

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 09:25 AM