Share News

ఇజ్రాయెల్‌ను లోపలి నుంచే కూల్చేస్తారు.. అరబ్ పార్టీలతో కూటమిపై నెతన్యాహు..

ABN , Publish Date - Nov 08 , 2026 | 08:48 AM

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అధికారానికి దూరం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఇజ్రాయెల్‌ను లోపలి నుంచే కూల్చేస్తారు.. అరబ్ పార్టీలతో కూటమిపై నెతన్యాహు..
Benjamin Netanyahu

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అధికారానికి దూరం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అరబ్ పార్టీల మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయత్నాలపై నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. అరబ్ పార్టీల మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను లోపలి నుంచే కూల్చేస్తుందని హెచ్చరించారు (Israel Political Crisis).


ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించలేదు. 120 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు వచ్చాయి. గాడి ఐసెన్‌కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో 19 స్థానాలు గెలుచుకున్న అరబ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది. రామ్ పార్టీ, అరబ్ మెజారిటీ ఉన్న జాయింట్ లిస్ట్ మద్దతు లభిస్తే ఐసెన్‌కాట్ నేతృత్వంలోని ప్రతిపక్షానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది (Arab Parties Coalition).


ఈ పరిణామాలపై స్పందించిన నెతన్యాహు.. ఇస్లామిస్ట్ పార్టీలపై ఆధారపడే ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను లోపలి నుంచే విచ్ఛిన్నం చేస్తుందని వ్యాఖ్యానించారు. యూరప్‌లో జరుగుతున్న పరిణామాల కంటే ఇజ్రాయెల్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించారు. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల అనంతరం ఐసెన్‌కాట్‌కు 67 మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు ప్రకటించగా, నెతన్యాహుకు 46 మంది మద్దతు తెలిపారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కాట్‌కు అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి (Israeli Government Formation).


అరబ్ పార్టీలతో కూటమి ప్రయత్నాలను విమర్శించిన నెతన్యాహు, జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఉన్న జాతీయవాద, జియోనిస్ట్ పార్టీలన్నీ ఒకే ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని సూచించారు. అయితే ఐసెన్‌కాట్ పార్టీ మాత్రం నెతన్యాహు ప్రతిపాదనపై భిన్నంగా స్పందించింది. నిజంగా ఐక్యతా ప్రభుత్వం కావాలనుకుంటే నెతన్యాహు మిత్రపక్షాలు తీవ్రవాద పార్టీలతో తమ సంబంధాలను తెంచుకుని, ఐసెన్‌కాట్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..


స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 08 , 2026 | 08:48 AM