Share News

ధనత్రయోదశి అదుర్స్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:39 AM

ఈ ఏడాది ధనత్రయోదశి అమ్మకాలు భారీ స్థాయిలోనే నమోదయ్యాయి. శుక్రవారం బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గడం ఇందుకు మరింత కలిసొచ్చినట్టు కల్యాణ్‌ జువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేష్‌ కల్యాణ రామన్‌ చెప్పారు

ధనత్రయోదశి అదుర్స్‌
gold

  • రూ.లక్ష కోట్లకు పైగా విక్రయాలు .. బంగారం, వెండి వాటానే రూ.60,000 కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ధనత్రయోదశి అమ్మకాలు భారీ స్థాయిలోనే నమోదయ్యాయి. శుక్రవారం బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గడం ఇందుకు మరింత కలిసొచ్చినట్టు కల్యాణ్‌ జువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేష్‌ కల్యాణ రామన్‌ చెప్పారు. నగలు, గిఫ్ట్‌ ఆర్టికల్స్‌ దుకాణాలు ఉదయం నుంచే కిటకిటలాడాయి. ఈ ఏడాది ధన త్రయోదశి అమ్మకాల విలువ రూ.లక్ష కోట్లపైనే ఉంటుందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) తెలిపింది. ఇందులో బంగారం, వెండి ఆభరణాలు, కడ్డీలు, నాణేల అమ్మకాలే రూ.60,000 కోట్ల వరకు ఉన్నట్టు జీజేసీ చైర్మన్‌ రాజేశ్‌ రోక్డే చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే పరిమాణపరంగా అమ్మకాల్లో పెద్దగా ఎదుగూ బొదుగూ లేదు. అయితే విలువపరంగా చూస్తే మాత్రం.. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 15- 20శాతం పెరిగినట్టు రాజేశ్‌ చెప్పారు. గత ఏడాది ధన త్రయోదశితో పోలిస్తే బంగారం, వెండి ధరలు ఇంకా ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు చెప్పాయి.

గృహోపకరణ ఉత్పత్తుల విక్రయాల్లో 25శాతం వృద్ధి: ధనత్రయోదశి రోజున కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, అప్లయెన్సెస్‌ విక్రయాలు కూడా 20-25శాతం వృద్ధి నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కొంతకాలంగా మందకొడిగా సాగుతున్న గృహోపరకరణ ఉత్పత్తుల విక్రయాలు శుక్రవారం ఒక్కసారిగా దూసుకుపోయాయని ఆ వర్గాలు తెలిపాయి. ధరలు పెరిగినప్పటికీ ప్రీమియం ఉత్పత్తులు విక్రయాల్లో కీలకంగా ఉన్నాయని పేర్కొన్నాయి.


ఆటోమొబైల్‌ జోరు: దీపావళి నేపథ్యంలో ఆటోమొబైల్‌ మార్కెట్లో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, వాణిజ్య వాహనాల విభాగాల్లో మంచి డిమాం డ్‌ కన్పిస్తోందని ఆటోమొబైల్‌ కంపెనీలు వెల్లడించాయి. ధనత్రయోదశి సందర్భంగా ఒక్క రోజులోనే 30,000 పైగా కార్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు మారుతి సుజుకీ ఇండియా వెల్లడించింది. గత ఏడాది ధనత్రయోదశి సందర్భంగా రెండు రోజుల్లో 50,000 కార్లను డెలివరీ చేసినట్లు గుర్తు చేసింది. వినాయక చవితి (సెప్టెంబరు 14) నుంచి ఈ నెల 6 వరకు 4 లక్షల కార్లను విక్రయించినట్లు మారుతి సుజుకీ వెల్లడించింది.

ప్రస్తుతం 2.52 లక్షల బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని పండగ సీజన్‌లో వినియోగదారుల నుంచి వస్తున్న బలమైన డిమాండ్‌కు నిదర్శనమని మారుతి సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. మరోవైపు హ్యుండయ్‌ మోటార్‌ కూడా ధనత్రయోదశి, దీపావళి రోజున కలిపి 16,000 కార్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో టాటా మోటార్స్‌ కూడా 12,000 వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేయాలని భావిస్తోంది.

ఇవి కూడా చదవండి..

రూ.11కే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్.. ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల కవరేజ్

వెహికిల్‌ సొల్యూషన్స్‌ వ్యాపారంలోకి ఎల్‌జీ

Updated Date - Nov 07 , 2026 | 01:42 AM