రూ.11కే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్.. ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల కవరేజ్
ABN , Publish Date - Nov 06 , 2026 | 08:00 PM
దీపావళి టపాసుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు బీమా సంస్థలు రూ.11కే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: రెండు రోజుల్లోనే దీపావళి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే పండగ వాతావరణం మొదలైంది. దీపావళి సందర్భంగా నిరుడి కంటే టపాసుల వినియోగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ బాణసంచా కారణంగా ప్రమాదాలు జరగొచ్చు. ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించొచ్చు. ఈ నేపథ్యంలో పలు బీమా సంస్థలు ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. టపాసుల కారణంగా ఏర్పడిన ప్రమాదాల్లో గాయపడినవారి వైద్య బిల్లులను భరించడానికి సిద్ధమంటున్నాయి. కేవలం రూ.11 చెల్లించి ఈ స్వల్పకాలిక బీమా పాలసీ తీసుకుంటే.. ప్రమాద సందర్భాల్లో రూ.25,000 వరకు లబ్ధిపొందొచ్చని వివరిస్తున్నాయి. మరి ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చో లేదో తెలుసుకుందాం.
అసలు ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ ఏం కవర్ చేస్తుంది?
దీపావళి పండుగ సమయంలో బాణసంచా కారణంగా ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది. ఇది తీసుకుంటే ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు బీమా సంస్థలు ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఆర్థిక సాయం అందిస్తాయి. ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే రూ.50,000 డెత్ బెనిఫిట్స్ కింద కుటుంబానికి ఇస్తాయి. ఈ పాలసీ ధర కేవలం 11 రూపాయలే అని బీమా సంస్థలు చెబుతున్నాయి. అయితే లిమిటెడ్ పీరియడ్‌లో మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే..
ఇప్పటికే మీకు ఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రత్యేకించి ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బాణసంచా కారణంగా సంభవించిన ప్రమాదం కూడా యాక్సిడెంట్ కేటగిరీ కిందకు వస్తుందని వివరిస్తున్నారు. ఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.
ఈ వార్తలూ చదవండి
స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. 1,718 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
ధనత్రయోదశి నాడు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి