అఫ్రీన్... అదిరెన్!
ABN , Publish Date - Nov 08 , 2026 | 08:29 AM
వాన పడితే రెయిన్ కోట్, చలి వేస్తే లెదర్ జాకెట్, సినిమాకి వెళితే జీన్స్ జాకెట్... ఇలా రకరకాల జాకెట్లు మిలీనియల్స్, జెన్‌జీల నిత్య జీవనంలో భాగమయ్యాయి.
వాన పడితే రెయిన్ కోట్, చలి వేస్తే లెదర్ జాకెట్, సినిమాకి వెళితే జీన్స్ జాకెట్... ఇలా రకరకాల జాకెట్లు మిలీనియల్స్, జెన్‌జీల నిత్య జీవనంలో భాగమయ్యాయి. ఏదో అవసరానికి అనే కాకుండా... తమ ఫ్యాషన్ స్టేట్‌మెంట్లో భాగంగా కూడా వివిధ రకాల జాకెట్స్‌ను ధరించడం తాజా ట్రెండ్. ప్రస్తుత పండగ సీజన్‌లో అఫ్రీన్ జాకెట్ల హవా నడుస్తోంది. చిక్కని దేశీ లుక్‌కు... చక్కని చిరునామా అఫ్రీన్లు. తళుకుబెళుకు అఫ్రీన్ల తాజా విశేషాలివి...
‘ధురంధర్’ పాటలతో సెన్సేషనల్‌గా మారిన ఇండియన్- అమెరికన్ గాయని జాస్మిన్ శాండ్లర్... ఇటీవల ఒక షోలో గులాబీ రంగు అఫ్రీన్ జాకెట్‌తో తళుక్కున మెరిసింది.
గాయకుడు, ఆంత్రప్రెన్యూర్ గిరిష్ చావ్లా ఇటీవల ఓ స్టేజ్ షోలో ధరించిన అఫ్రీన్ జాకెట్ ఫ్యాషన్ ప్రపంచంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
ఈ రెండు టీవీ కార్యక్రమాలతో అందరి దృష్టి ఆయా సెలబ్రిటీలతో పాటు వాళ్లు ధరించిన అఫ్రీన్ జాకెట్లపై పడింది. రంగురంగుల దారాలు, పూసలు, చెమ్కీలు, అద్దాలు, చిన్న చిన్న వస్త్రపు ముక్కలతో ప్యాచ్‌వర్క్‌తో విభిన్నంగా ఉన్న జాకెట్లు యువతరాన్ని ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఆధునికంగా కనిపిస్తూనే సంప్రదాయ భావాల్ని కలిగిస్తున్నాయి. అందుకే ఇవి ట్రెండీగా మారాయి. అఫ్రీన్ జాకెట్లను ధరించి యువతీ యువకులు నిన్నటి దసరా గర్బానృత్యాల్లో, డీజే కార్యక్రమాల్లో సందడి చేశారు. దసరా, దీపావళి, కొత్త సంవత్సరాది వేడుకలతో పాటు... యూత్ ట్రెండ్‌గా మరి కొన్నేళ్లు అఫ్రీన్లు రాజ్యమేలుతాయని ఫ్యాషన్ పండితులు తేల్చి చెబుతున్నారు. అఫ్రీన్ అంటే ఏమిటి, ఎలా తయారుచేస్తారు? ఏ ప్రాంతానికి చెందినవి? వీటి రూపకల్పనలో కళాకారుల నిపుణత ఏమిటి... ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే రాజస్థాన్‌కు వెళ్లాల్సిందే.
గోల్డెన్‌సిటీలో...
రాజస్థాన్ అనగానే వస్త్రాలకు సంబంధించి ముందుగా గుర్తుకు వచ్చేవి రంగురంగుల గాగ్రా చోళీలు. ఇప్పుడు అఫ్రీన్‌లను కూడా చెప్పుకోవాలి. అక్కడి జైసల్మేర్ నగరానికి ‘గోల్డెన్ సిటీ’ అని పేరు. ఓ పక్క బంగారు వన్నె ఇసుక నేలలు, మరో పక్క పసుపుపచ్చని సున్నపురాయితో నిర్మించిన కోటలపై సూర్యుడి కిరణాలు పడి పసిడిని తలపిస్తాయి. అందుకే ఆ పేరు క్రమంగా స్థిరపడింది. ఈ విశిష్టమైన నేల మీదే అఫ్రీన్ జాకెట్లు రూపుదిద్దుకున్నాయి. ఇది పూర్తిగా స్థానిక కళాకారుల ఆలోచనలకు ప్రతిబింబం. పాత దుస్తులను రీసైకిల్ చేసి వాటిని ముక్కలుగా కత్తిరించుకుంటారు. రంగులను అద్దుతారు. ఏదో ఓ థీమ్‌లో రంగు దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. అక్కడక్కడా అద్దాలు, చమ్కీలు, పూసలు, బీడ్స్ కుడతారు. జ్యామితీయ ఆకారాలు, పూలు, లతలు, పక్షులు, ప్రకృతికి సంబంధించిన విశేషాలు ఇందులో ఉంటాయి.
హస్తకళా నిపుణులు తమ మేధతో, పనితనంతో చేసిన జాకెట్లు ఇవి. అందుకే ఒకటి ఉన్నట్టుగా మరొకటి ఉండదు. ప్రతీ ఒక్క జాకెట్ దేనికదే ప్రత్యేకమైనది, విభిన్నమైనది. అంటే ఒకరి దగ్గర ఉన్న అఫ్రీన్‌లాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండదన్న మాట. ఇదే అఫ్రీన్ జాకెట్‌లకు విభిన్నమైన క్రేజ్‌ని తెచ్చిపెడుతోంది. ఒక్కో జాకెట్‌ను రూపొందించడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అందుకే అంత అద్భుతంగా కనిపిస్తాయి, ఎక్కువగా కాటన్ వస్త్రాలతో చేస్తారు కాబట్టి ధరించడానికి హాయిగా ఉంటుంది. అందుకే ఆ పేరు ఈ జాకెట్లకు వచ్చిందేమో. వాస్తవం కూడా అదే. పర్షియన్ భాషలో అఫ్రిన్ అంటే ‘అత్యంత అందమైనది’ అని అర్థం.
అనేక రంగుల్లో...
రాజస్థాన్‌ను సందర్శిస్తున్న విదేశీ టూరిస్టులు బ్రాండెడ్ జాకెట్ల కన్నా కళాత్మకమైన రంగు రంగుల అఫ్రీన్‌లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తెలుపు, ఎరుపు, నీలం, పచ్చ, గులాబీ, ఊదా, నలుపు... ఇలా అనేక రంగుల్లో అఫ్రీన్ జాకెట్లు లభిస్తున్నాయి. దట్టమైన ఎంబ్రాయిడరీ, ఘనమైన చమ్కీలు, కుచ్చులు, అద్దాల పనితనంతో ఉన్నవి పండగలు, ఫంక్షన్లకు ధరించవచ్చు. కాలేజీలు, వీకెండ్ షాపింగ్, సినిమాలకు ధరించేందుకు వీలుగా ఉండే సింపుల్ అఫ్రీన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బాడీ ఫిట్టింగ్, ఓవర్ సైజు, యూనిసెక్స్ జాకెట్లు లభిస్తున్నాయి. కళాత్మక పనితీరు ఆధారంగా వీటి రేటు ఆధారపడి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ప్రసిద్ధ కాంతా వర్క్, జర్దోసీ పనితనంతో రూపొందించిన అఫ్రీన్‌లు కూడా నేడు మార్కెట్లోకి వచ్చాయి.
ఇటీవలి దసరా నవరాత్రుల్లో దాండియా, గర్బా నృత్యాల్లో చాలామంది యువతీ యువకులు అఫ్రీన్ జాకెట్లను ధరించి సోషల్ మీడియాలో వీటికి భలే క్రేజ్ వచ్చేలా చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెరిగిపోయాయి. ఎంతమందిలో ఉన్నా ఈ జాకెట్లు కళ్లను కట్టిపడేస్తాయి. ఫొటోలలోనే కాదు ఇన్‌స్టా రీల్స్‌లో చాలా గొప్పగా అనిపిస్తాయి. అందుకే నేటితరం యువతతో పాటు సెలబ్రిటీలు కూడా అఫ్రీన్ జాకెట్లను ధరించి ఫ్యాషన్ స్టేట్‌మెంట్లు చేస్తున్నారు. ‘‘నవరాత్రుల్లో బోల్డ్‌గా కనిపించడంతో పాటు, ఎక్స్‌ప్రెసివ్‌గా, కాస్త విభిన్నమైన లుక్‌లో కనిపించాలని అనుకున్నాను. అందుకే నవరాత్రి వైబ్‌కి సరిపడేలా అఫ్రీన్ జాకెట్ ధరించాను. నా దృష్టిలో నన్ను నేను విభిన్నంగా వ్యక్తపరచుకోవడమే ఫ్యాషన్’’ అంటారు ఆంత్రప్రెన్యూర్ గిరిష్ చావ్లా.
మరెన్నడూ లేనంతగా ప్రస్తుతం ప్రజలు ఫ్యాషన్‌లలో ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అందులో భాగమే అఫ్రీన్‌లు. లెహెంగాలు, స్కర్ట్‌లు, ప్యాంట్‌లు, చుడీదార్, ప్లాజో, చీరలు... ఇలా వివిధ రకాల దుస్తులపై యువత ఈ జాకెట్లను ధరిస్తున్నారు. తమకే సొంతమైన యూనిక్ లుక్‌లో మెరిసిపోతున్నారు.
ఇదీ స్టయిల్...
అఫ్రీన్ జాకెట్లు ధరించేప్పుడు కొన్ని టెక్నిక్స్‌ను పాటించడం మరచిపోకండి.
దేశీ లుక్: పండగ వేళల్లో ఎంబ్రాయిడరీ స్కర్ట్‌లు, ప్యాంట్‌ల మీదకి అఫ్రీన్‌లను ధరించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారవచ్చు. ఈ తరహా దుస్తులు ‘మాక్సిమలిజమ్’లో భాగం. అటు కాంటెంపరీగా అనిపిస్తూనే దేశీ లుక్‌కు దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది మీ ఆహార్యం.
మోనోక్రోమ్ మంచిది: మీరు ధరించిన అఫ్రీన్ హైలైట్‌గా నిలవాలంటే మీ దుస్తులన్నీ ఒకే రంగులో ఉండేలా చూసుకోవాలి. కుర్తా, పైజామా, షర్టూ, స్కర్టూ ... ఒకే రంగులో ఉంటే అఫ్రీన్ బాగా కనిపిస్తుంది.
మీరు సాయంకాల పార్టీ లేదా ఫంక్షన్లకు అఫ్రీన్‌ను ధరించాలని అనుకుంటే మీ డ్రెస్సింగ్‌కు సంబంధించి కాస్త ప్రిపేర్ అవడం మంచిది. మెరుపుల షర్టు, స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్, కాస్త హీల్ ఉన్న బూట్స్ వేసుకుని వెళ్లండి. మీ లుక్ అదుర్స్ అని అందరూ అంటారు.
సాధారణంగా జాకెట్ అంటేనే ఓవర్ సైజులో ఉంటుంది. కాబట్టి అఫ్రీన్‌లను ధరించినప్పుడు సరైన సైజులో ఉన్న ట్రౌజర్లు, స్ర్టెయిట్ లెగ్ జీన్స్ ధరిస్తే బాగుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News