మహ్మద్ షమీకి తగిన వీడ్కోలు దక్కలేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Nov 08 , 2026 | 07:26 AM
భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై మాజీ క్రికెటర్, మీడియం పేసర్ అతుల్ వాసన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. షమీ లాంటి అద్భుతమైన బౌలర్‌కు అంతర్జాతీయ టెస్టు కెరీర్ ముగిసిన తీరు తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై మాజీ క్రికెటర్, మీడియం పేసర్ అతుల్ వాసన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నవంబర్ 6న షమీ తన టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా 13 ఏళ్ల క్రితం (2013 నవంబర్ 6) షమీ తన టెస్ట్ అరంగేట్రం చేసిన రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, షమీ లాంటి అద్భుతమైన బౌలర్‌కు అంతర్జాతీయ టెస్టు కెరీర్ ముగిసిన తీరు తనను ఎంతో కలిచివేసిందని వాసన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
జాతీయ మీడియాతో అతుల్ వాసన్ మాట్లాడుతూ.. 'తీవ్రమైన మోకాలి గాయాలను తట్టుకుంటూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా షమీ అందించిన సేవలు అద్భుతం. భువనేశ్వర్ కుమార్ లాగా షమీ కూడా తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు చెబుతాడని భావించాను. అతడు దేశవాళీ రంజీ ట్రోఫీలో కష్టపడినప్పటికీ జాతీయ జట్టులో స్థానం దక్కలేదు. టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకుని అక్కడి నుంచి వీడ్కోలు చెప్పే అవకాశం షమీకి దక్కలేదు' అని వాసన్ ఆవేదన వ్యక్తం చేశారు.
భారత క్రికెట్‌లో వయసురీత్యా ఒక పక్షపాత ధోరణి కనిపిస్తోందని వాసన్ విమర్శించారు. గాయాల నుంచి కోలుకుని వస్తున్న షమీ జట్టులోకి తీసుకుని అతడి అనుభవాన్ని మరో రెండు సీజన్ల పాటు ఉపయోగించుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌లో సీనియర్ ఆటగాళ్లకు దక్కాల్సినంత గౌరవం, మర్యాద లభించడం లేదని, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో షమీ పునరాగమనం కష్టమని ముందే స్పష్టమైందని అతుల్ వెల్లడించాడు. భారత పేస్ దళానికి అపారమైన సేవలు అందించిన మహ్మద్ షమీ అకస్మాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
ఇవి కూడా చదవండి:
పసుపు పాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు
వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?