Share News

వరుణుడి అండతో గట్టెక్కారు

ABN , Publish Date - Nov 08 , 2026 | 06:04 AM

న్యూజిలాండ్‌ పర్యటనలో పరుగుల వరద పారిస్తున్న భారత బ్యాటర్లకు తొలిసారి సవాల్‌ ఎదురైంది. 135 పరుగుల స్వల్ప లక్ష్యం కూడా కివీస్‌ పేసర్ల ధాటికి...

వరుణుడి అండతో గట్టెక్కారు

  • డ/లూ ప్రకారం భారత్‌ గెలుపు

  • గుర్నూర్‌కు 4 వికెట్లు

  • రాహుల్‌ పోరాటం

  • రెండో వన్డేలో కివీస్‌కు నిరాశ

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో పరుగుల వరద పారిస్తున్న భారత బ్యాటర్లకు తొలిసారి సవాల్‌ ఎదురైంది. 135 పరుగుల స్వల్ప లక్ష్యం కూడా కివీస్‌ పేసర్ల ధాటికి ఓ దశలో కొండంతలా కనిపించింది. చివరకు గెలుపునకు 22 పరుగులు, చేతిలో 3 వికెట్లున్న పరిస్థితిలోనూ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ దశలో కురిసిన భారీ వర్షం భారత్‌కు ఊరటనిచ్చింది. ఎందుకంటే అప్పటికే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన మనోళ్లు నాలుగు పరుగుల ఆధిక్యంలో ఉండడంతో విజయం గిల్‌ సేనను వరించింది. దీంతో టీమిండియా సిరీ్‌సలో 2-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా గంట ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు వణికించారు. గుర్నూర్‌ బ్రార్‌ (4/30) కెరీర్‌ బెస్ట్‌ను సాధించడంతో కివీస్‌ 41 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. డారిల్‌ మిచెల్‌ (55), కెప్టెన్‌ శాంట్నర్‌ (31), నికోల్స్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అన్షుల్‌, అక్షర్‌, నబీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 26 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసిన దశలో భారీ వర్షం కురిసింది. గంటపాటు వేచి చూసినా ఆటకు వీలు కాకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. అయితే, డక్‌వర్త్‌ పద్ధతిన అప్పటికే నాలుగు పరుగుల ఆధిక్యం దక్కడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. డఫీ, జేమిసన్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా గుర్నూర్‌ బ్రార్‌ నిలిచాడు.


స్వల్ప ఛేదనే అయినా..: 135 పరుగుల ఛేదనను భారత బ్యాటర్లు సులువుగా పూర్తి చేస్తారనిపించింది. కానీ బరిలోకి దిగాక బ్యాటర్లకు చుక్కలు కనిపించాయు. షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కోవడంలో కష్టాలు పడ్డారు. కెప్టెన్‌ గిల్‌ (0), విరాట్‌ కోహ్లీ (7)లను పేసర్‌ డఫీ వరుస ఓవర్లలో అవుట్‌ చేశాడు. రోహిత్‌ (23) రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదినా చాలా బంతులకు బీట్‌ అయ్యాడు. హిట్‌మ్యాన్‌ను జేమిసన్‌ అవుట్‌ చేశాడు. అక్షర్‌ పటేల్‌ (7) కూడా నిరాశపర్చడంతో 47/4 స్కోరుతో భారత్‌ తీవ్ర ఇక్కట్లలో పడింది. శ్రేయాస్‌ (30)- కేఎల్‌ రాహుల్‌ (26 నాటౌట్‌) జోడీ మాత్రం కివీస్‌ బౌలర్లను ఓపిగ్గా ఆడింది. పిచ్‌ ప్రమాదకరంగా ఉండడంతో రాహుల్‌ తొలి 20 బంతుల్లో 18 డాట్‌ బాల్స్‌ ఆడడం గమనార్హం. అయితే శ్రేయాస్‌ తన షార్ట్‌ బాల్స్‌ వైఫల్యాన్ని అధిగమించలేకపోయాడు. జేమిసన్‌ బౌన్సర్‌కు వికెట్‌ ఇచ్చుకున్నాడు. దీంతో ఐదో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. నమన్‌ ధిర్‌ (12), అన్షుల్‌ కాంబోజ్‌ (1) త్వరగానే అవుట్‌ కాగా.. అప్పటికి విజయానికి 22 పరుగులే కావాల్సి ఉంది. అయితే ఓవర్లు తగినన్ని ఉన్నా రాహుల్‌కు అండగా టెయిలెండర్లు ఎంతో సేపు క్రీజులో ఉండరనిపించింది. కానీ, 27వ ఓవర్‌ ఆరంభానికి ముందే భారీ వర్షంతో ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరడం.. ఆట ముందుకు సాగే అవకాశం లేకపోవడంతో టీమిండియా డ/లూ ప్రకారం 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

పేసర్ల హవా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను రెండో వన్డేలోనూ భారత పేసర్లు బెదరగొట్టారు. షార్ట్‌ పిచ్‌ బంతులతో అద్భుతంగా కట్టడి చేశారు. నబీ కొత్త బంతితో ఓపెనర్లు సైఫర్ట్‌ (0), యంగ్‌ (6) వికెట్లను తీయగా, అన్షుల్‌ తన తొలి ఓవర్‌లోనే నికోల్స్‌ పనిబట్టాడు. ఇక లాథమ్‌ (7), ఫిలిప్స్‌ (0)లను ఒకే ఓవర్‌లో బ్రార్‌ వెనక్కిపంపాడు. దీంతో కివీస్‌ 53/5 స్కోరుతో నిలిచింది. ఈ దశలో డారిల్‌ మిచెల్‌-శాంట్నర్‌ జోడీ ఆరో వికెట్‌కు 59 రన్స్‌ జోడించింది. హాఫ్‌ సెంచరీ అయ్యాక మిచెల్‌ను అక్షర్‌, శాంట్నర్‌ను బ్రార్‌ అవుట్‌ చేయడంతో కివీస్‌ నుంచి పోరాటం కరువైంది. భారత బౌలర్ల ధాటికి కేవలం 22 పరుగుల వ్యవధిలోనే కివీస్‌ చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: యంగ్‌ (సి) రాహుల్‌ (బి) నబీ 6, సైఫర్ట్‌ (సి) కాంబోజ్‌ (బి) నబీ 0, నికోల్స్‌ (బి) కాంబోజ్‌ 11, డారిల్‌ మిచెల్‌ (సి) కాంబోజ్‌ (బి) అక్షర్‌ 55, లాథమ్‌ (సి) నమన్‌ (బి) బ్రార్‌ 7, ఫిలిప్స్‌ (సి) కాంబోజ్‌ (బి) బ్రార్‌ 0, శాంట్నర్‌ (సి) రాహుల్‌ (బి) బ్రార్‌ 31, స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) బ్రార్‌ 3, జేమిసన్‌ (బి) అక్షర్‌ 7, టిక్నెర్‌ (బి) కాంబోజ్‌ 2, డఫీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 41 ఓవర్లలో 134 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-11, 3-23, 4-53, 5-53, 6-112, 7-119, 8-127, 9-132, 10-134. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 7-1-16-0, నబీ 7-0-31-2, అన్షుల్‌ కాంబోజ్‌ 8-0-25-2, గుర్నూర్‌ బ్రార్‌ 10-2-30-4, అక్షర్‌ 9-1-28-2.

భారత్‌: రోహిత్‌ (సి) నికోల్స్‌ (బి) జేమిసన్‌ 23, గిల్‌ (సి) నికోల్స్‌ (బి) డఫీ 0, విరాట్‌ కోహ్లీ (సి) యంగ్‌ (బి) డఫీ 7, శ్రేయాస్‌ (సి) లాథమ్‌ (బి) జేమిసన్‌ 30, అక్షర్‌ (సి) డఫీ (బి) ఫిషర్‌ 7, రాహుల్‌ (నాటౌట్‌) 26, నమన్‌ (సి) సైఫర్ట్‌ (బి) డఫీ 12, కాంబోజ్‌ (సి) డఫీ (బి) జేమిసన్‌ 1, నబీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 26 ఓవర్లలో 113/7. వికెట్ల పతనం: 1-4, 2-17, 3-39, 4-47, 5-86, 6-108, 7-111. బౌలింగ్‌: జేమిసన్‌ 10-1-35-3, డఫీ 7-1-35-3, నాథన్‌ స్మిత్‌ 5-1-19-0, ఫిషర్‌ 4-0-23-1.

ఈ వార్తలు కూడా చదవండి..

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.291 కోట్లు

ధనత్రయోదశి అదుర్స్‌

For More Business News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 06:05 AM