Share News

దారి దోపిడీకి పాల్పడిన పోలీసులు.. కానిస్టేబుల్, హోంగార్డుపై కేసు నమోదు

ABN , Publish Date - Nov 08 , 2026 | 08:07 AM

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారి దోపిడీకి పాల్పడిన ఘటన భాగ్యనగరంలో కలకలం రేపుతోంది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని బెదిరించిన కానిస్టేబుల్, హోంగార్డు అతని నుంచి నగదు దోచుకున్నట్లు తెలుస్తోంది.

దారి దోపిడీకి పాల్పడిన పోలీసులు.. కానిస్టేబుల్, హోంగార్డుపై కేసు నమోదు
Hyderabad Police Arrest

హైదరాబాద్: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారి దోపిడీకి పాల్పడిన ఘటన భాగ్యనగరంలో కలకలం రేపుతోంది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని బెదిరించిన కానిస్టేబుల్, హోంగార్డు అతని నుంచి నగదు దోచుకున్నట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ పరారవగా.. హోంగార్డును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 4న షేక్‌పేట వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని తనిఖీల పేరుతో కానిస్టేబుల్ మల్సూర్, హోంగార్డు ఆపారు. వారు ద్విచక్రవాహనాన్ని, అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగులో నగదు కనిపించడంతో ఇద్దరూ బెదిరింపులకు దిగారు. రూ.70 వేలు ఇవ్వాలని, లేదంటే డబ్బులన్నీ సీజ్ చేస్తామని హెచ్చరించారు. అవి తాను కష్టపడి సంపాదించిన నగదని, అవసరం నిమిత్తం తీసుకెళ్తున్నానని బాధితుడు వివరించాడు. అయినప్పటికీ అతని మాటలను లెక్కచేయని కానిస్టేబుల్, హోంగార్డు చివరకు అతని నుంచి రూ.50 వేలు లాక్కెళ్లారు.


ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను బెదిరించి నగదు లాక్కున్నారంటూ ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్ మల్సూర్‌తో పాటు హోంగార్డుపై చోరీ కేసు నమోదు చేశారు. కాగా, కేసు నమోదైన విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ మల్సూర్ పరారైనట్లు తెలుస్తోంది. హోంగార్డును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులే దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

దీపావళి కాంతులతో సుఖసంతోషాలు

ఏఐకేఎస్‌ మహాసభలను జయప్రదం చేయండి


Updated Date - Nov 08 , 2026 | 08:10 AM