అందుకే ‘రోమాంచకం’ చేశా...
ABN , Publish Date - Aug 30 , 2026 | 08:06 AM
‘మ్యాడ్’తో తెలుగు తెరకు పరిచయమై, ‘8 వసంతాలు’తో మరో మెట్టు ఎక్కింది అనంతిక సనిల్‌కుమార్.
‘మ్యాడ్’తో తెలుగు తెరకు పరిచయమై, ‘8 వసంతాలు’తో మరో మెట్టు ఎక్కింది అనంతిక సనిల్‌కుమార్. అచ్చంగా పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే ఈ మలయాళీ ముద్దుగుమ్మ... స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కిన ‘రోమాంచకం’తో మరోసారి మ్యాజిక్ చేసేందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కబుర్లివి..
అమ్మ కల...
కేరళలోని త్రిస్సూరులో పుట్టి పెరిగా. నాకొక చెల్లి. నేను ప్రస్తుతం న్యాయశాస్త్రంలో డిగ్రీ చేస్తున్నా. నా ప్రతీ అడుగులో నా కుటుంబం మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా అమ్మ తన కలని నాలో చూసుకుంటోంది. ఆమె చిన్నప్పుడు చాలా నేర్చుకోవాలని అనుకునేదట... కానీ కుదరలేదు. అందుకే నన్ను అన్నింట్లో ప్రోత్సహిస్తుంటుంది.
నాలుగు నృత్యరీతుల్లో శిక్షణ
ఐదేళ్ల నుంచే శాస్త్రీయ నృత్యాలు నేర్చుకుంటున్నా. భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, మోహినియాట్టం... నాలుగు రకాల శాస్త్రీయ నృత్యరీతుల్లో శిక్షణ పొందుతున్నా. ఇప్పటికీ ప్రదర్శనలిస్తూనే ఉన్నా. డ్యాన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల కరతాళధ్వనులు వింటే ఆ ఆనందమే వేరు. ఒకరకంగా అదే నేను సంపాదించుకున్న ఆస్తి అనిపిస్తుంది.
సోషల్ మీడియా ద్వారా...
కరోనా లాక్‌డౌన్ సమయంలో డాన్స్‌కు సంబంధించి రీల్స్ సోషల్ మీడియాలో పెట్టేదాన్ని. ఫాలోవర్లు బాగా పెరిగారు. అలా ఏ సినిమా ఆఫీసు చుట్టూ తిరగకుండానే నాకు ఆఫర్లు వచ్చాయి. అయితే తమిళంలో నేను చేసిన మొదటి సినిమా, 2022లో తెలుగులో ‘రాజమండ్రి రోజ్‌మిల్క్’ అనే సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. కొన్నేళ్ల తర్వాత ‘మ్యాడ్’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా. ఆ తర్వాత లక్కీగా రజినీకాంత్ ‘లాల్‌సలామ్’లో అవకాశం వచ్చింది.
హద్దులు దాటను...
ఇంటిమేట్, రొమాన్స్ సీన్స్ చేయడం కొంచెం కష్టమే. కథ డిమాండ్ చేస్తే ‘నో’ చెప్పను. అందుకే ‘రోమాంచకం’ చేశా. అలా అని రొమాన్స్ హద్దులు దాటేలా మాత్రం నా సినిమాలు ఉండవని హామీ ఇస్తున్నా.
మర్చిపోలేని జ్ఞాపకం
బ్యాక్ ఫ్లిప్ సాధన చేస్తున్నప్పుడు వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. యాక్టివ్‌గా ఉండే నాకు రెస్ట్ తీసుకోవడమంటే నచ్చదు. కానీ ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా నొప్పి ఉండేది. అదే సమయంలో ‘8 వసంతాలు’ సినిమా ఆఫర్ వస్తే, నొప్పితోనే పూర్తి చేశా. ఆ సినిమాకు స్పెషల్ జ్యూరీ ఉత్తమ నటి అవార్డు అందుకున్నా. నా జీవితంలో అది మర్చిపోలేని జ్ఞాపకం.
బ్లాక్‌బెల్ట్ హోల్డర్ని...
కరాటేలో నేను బ్లాక్‌బెల్ట్ హోల్డర్ని. అలాగే కేరళకు చెందిన సంప్రదాయ యుద్ధకళ అయిన కలరిపయట్టులో కూడా నైపుణ్యం సాధించా. కత్తిసాము చేస్తా. వింగ్‌చున్ అనే చైనా యుద్ధ విద్యలోనూ శిక్షణ తీసుకున్నా. ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవడం చాలా అవసరం. అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టాలనే కల ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ ధరలు మరింత తగ్గే ఛాన్స్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News