‘వెలిగొండ’కు అదనపు పరిహారం
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:36 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు.
తక్షణమే రూ.4 కోట్లు విడుదల
నిర్వాసితుల సంతోషమే లక్ష్యం: సీఎం
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులను మరింత సంతోషపరచాలని భావించిన ముఖ్యమంత్రి తాజాగా వారిని ‘ప్రత్యేకం’గా ఆదుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నెల రోజులకు సరిపోయేలా నిత్యావసరాలు, 30 రోజుల వరకు పశువులకు దాణా, నిర్వాసిత కుటుంబాల్లోని మహిళలకు పసుపు-కుంకుమ కిట్లను అందించాలని సర్కారు నిర్ణయించింది. దీనికిగాను రూ.4.07 కోట్లను తక్షణమే విడుదల చేసింది. ఈ మేరకు శనివారం జల వనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసిత కుటుంబాలకు చెందిన పశువుల దాణాకు రూ.65.8 లక్షలు కేటాయించారు. 10 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు చెందిన 4,933 పశువులకు 30 రోజుల పాటు దాణాను ప్రభుత్వమే అందించనుంది. దీనికిగాను మొత్తం 295.98 టన్నుల దాణా అవసరమని గుర్తించింది. అలాగే, నిర్వాసితులకు నిత్యావసర సరుకుల కిట్ల కోసం రూ.2.81 కోట్లు కేటాయించింది. రూ.2,818 విలువైన ఒక్కొక్క కిట్‌ను 10 వేల కుటుంబాలకు అందించనున్నారు. ఈ కిట్‌లో 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర, లీటర్ నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు ఉంటాయి. అలాగే నిర్వాసిత కుటుంబాల్లోని మహిళలకు ప్రత్యేకంగా పసుపు, కుంకుమ, చీర, గాజులతో కూడిన కిట్‌ను అందించనున్నారు. రూ.వెయ్యి విలువైన ఈ కిట్‌లను 6 వేల మంది మహిళలకు ఇవ్వనున్నారు. దీనికిగాను రూ.60 లక్షలు కేటాయించారు. మొత్తం 3 విభాగాలకు కలిపి రూ.4.7 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్వాసితుల సంతోషమే లక్ష్యమని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కాగా, ఇప్పటికే రూ.768 కోట్లను నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారంగా అందించిన విషయం తెలిసిందే.
గెజిట్‌లో లేని వారి కోసం..
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితల అధికారిక జాబితా (గెజిట్)లోలేని 1,800 మందిని గుర్తించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. పోలవరం(ఆర్‌అండ్‌ఆర్) ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ నేతృత్వంలో డిప్యూటీ కలెక్టర్లతో కూడిన కమిటీని నియమిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఎన్‌టీఆర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఎం. పూర్ణచంద్రరావు, నెల్లూరు డిప్యూటీ కలెక్టరు నరసయ్య, పోలవరం డిప్యూటీ కలెక్టర్లు నాగమల్లేశ్వరరావు, బాలకృష్ణారెడ్డి, కోరాడ శ్రీనివాసరావులను నియమించారు. ఈ బృందం గెజిట్‌లో పేర్లు లేనివారిని, రేషన్ కార్డులు లేనివారిని, నిర్వాసితుల పేర్లలో తేడాలు ఉన్నవారిని గుర్తిస్తుంది.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు