Share News

మహిళల హాకీ ప్రపంచ కప్: విజేతగా అర్జెంటీనా.. షూటౌట్‌లో డచ్‌కు షాక్

ABN , Publish Date - Aug 30 , 2026 | 07:18 AM

మహిళల హాకీ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా సంచలనం సృష్టించింది. వరుసగా నాలుగు ప్రపంచ కప్ టైటిల్లు గెలిచిన నెదర్లాండ్స్ జైత్రయాత్రకు బ్రేక్ వేసి.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.

మహిళల హాకీ ప్రపంచ కప్: విజేతగా అర్జెంటీనా.. షూటౌట్‌లో డచ్‌కు షాక్
Women’s Hockey World Cup

ఇంటర్నెట్ డెస్క్: మహిళల హాకీ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా సంచలనం సృష్టించింది. వరుసగా నాలుగు ప్రపంచ కప్ టైటిల్లు గెలిచిన నెదర్లాండ్స్ జైత్రయాత్రకు బ్రేక్ వేసి.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో నిర్ణీత సమయం ముగిసే వరకు ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. అందులో డచ్‌పై 1-3 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది.


ఈ విజయంతో గత ప్రపంచ కప్‌ (2022) ఫైనల్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్‌ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో ఎదురైన పరాజయాలకు అర్జెంటీనా ప్రతీకారం తీర్చుకుంది. గతంలో 2002, 2010లోనూ నెదర్లాండ్స్‌ను ఓడించి ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనా.. తాజాగా మూడో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.


మ్యాచ్ సాగిందిలా..!

మొదటి 15 నిమిషాల్లో ఇరు జట్లు సమంగా పోరాడాయి. రెండో క్వార్టర్‌ చివరి నిమిషంలో నెదర్లాండ్స్‌కు తొలి పెనాల్టీ కార్నర్‌ లభించింది. ప్రపంచ నంబర్‌వన్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌గా పేరున్న యిబీ జాన్సెన్‌ అద్భుతమైన డ్రాగ్‌ ఫ్లిక్‌తో గోల్‌ చేసి డచ్‌ జట్టుకు 1-0 ఆధిక్యం అందించింది. టోర్నీలో ఆమెకు ఇది ఎనిమిదో గోల్‌. వెనుకబడిన అర్జెంటీనా రెండో అర్ధభాగంలో దూకుడు పెంచింది. వరుసగా పెనాల్టీ కార్నర్లు లభించినా డచ్‌ గోల్‌కీపర్‌ అన్నె వీనెండాల్‌ అద్భుతమైన సేవ్‌లతో అడ్డుకుంది. అయితే 54వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఎనిమిదో పెనాల్టీ కార్నర్‌ కీలకంగా మారింది. గోర్జెలానీ కొట్టిన ఫ్లిక్‌ను అడ్డుకునే క్రమంలో డచ్‌ గోల్‌కీపర్‌ జారిపడగా.. రీబౌండ్‌గా వచ్చిన బంతిని కెప్టెన్‌ మరియా గ్రానాటో నెట్‌లోకి పంపింది. దీంతో స్కోరు 1-1గా మారి మ్యాచ్‌ షూటౌట్‌కు వెళ్లింది.


షూటౌట్‌లో అర్జెంటీనా జోరు

పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ తరఫున మారీన్ వీన్‌ మాత్రమే గోల్‌ చేయగా.. పీన్‌ సాండర్స్‌, ఫెలిస్‌ ఆల్బర్స్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. అర్జెంటీనా తరఫున విక్టోరియా గ్రానాటో, బ్రిసా, సోఫియా కైరో గోల్స్‌ చేశారు. జోయి డియాజ్‌ కొట్టిన గోల్‌ను రిఫరల్‌ అనంతరం రద్దు చేశారు. చివరకు అర్జెంటీనా 3-1తో షూటౌట్‌లో విజయం సాధించి ప్రపంచకప్‌ను ముద్దాడింది.


ఇవి కూడా చదవండి:

టీమిండియా మ్యాచ్‌లకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు.. కారణం ఇదేనా!

51 ఏళ్ల వయసులో ‘ఫైఫర్’.. 94 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్!

Updated Date - Aug 30 , 2026 | 07:18 AM