టీమిండియా మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్ కరవు.. కారణం ఇదేనా!
ABN , Publish Date - Aug 29 , 2026 | 06:44 PM
టీమిండియా స్వదేశీ మ్యాచ్‌లకు కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. బిడ్ల దాఖలుకు గడువు ఆగస్టు 13తో ముగిసినా.. ఇప్పటివరకు బోర్డు కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయలేదు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్వదేశీ మ్యాచ్‌లకు కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. బిడ్ల దాఖలుకు గడువు ఆగస్టు 13తో ముగిసినా.. ఇప్పటివరకు బోర్డు కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయలేదు. ప్రస్తుతం పలువురు సంస్థలతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గూగుల్ జెమినీ, స్పిన్నీ, ఎస్‌బీఐ లైఫ్ వంటి సంస్థల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
జులై 20న బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ కోసం టెండర్ ఆహ్వానాన్ని జారీ చేసింది. ఆగస్టు 4 వరకు ఐటీసీ పత్రాలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఆగస్టు 5న సందేహాల నివృత్తికి చివరి తేదీగా నిర్ణయించింది. ఆగస్టు 13న బిడ్ల దాఖలు గడువు ముగిసింది. అయితే రెండు వారాలు గడిచినా కొత్త స్పాన్సర్‌పై స్పష్టత రాకపోవడం గమనార్హం.
రూ.4.75 కోట్ల బేస్ ప్రైస్.. ఇదే సమస్య?
ప్రస్తుతం టీమిండియా స్వదేశీ మ్యాచ్‌ల టైటిల్ హక్కులు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. ఒక్కో మ్యాచ్‌కు ఆ సంస్థ బీసీసీఐకి రూ.4.2 కోట్లు చెల్లిస్తోంది. అయితే కొత్త బిడ్డింగ్‌లో బీసీసీఐ కనీస ధరను రూ.4.75 కోట్లుగా నిర్ణయించింది. ఈ పెరిగిన బేస్ ప్రైస్ కారణంగానే సంస్థలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఒప్పందం రెండేళ్ల పాటు.. అంటే 2028 మార్చి 31 వరకు కొనసాగనుంది. గతంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మూడేళ్ల ఒప్పందాన్ని దక్కించుకుంది. తాజా ఒప్పందం ప్రకారం సుమారు 35 మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్ హక్కులు లభిస్తాయి. ఇందులో 10 టెస్టులు, 12 వన్డేలు, 13 టీ20లు ఉన్నాయి.
బిడ్డర్లకు ఆర్థిక అర్హతలు తప్పనిసరి
టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ కఠినమైన ఆర్థిక అర్హతలను కూడా విధించింది. బిడ్డర్‌కు గత మూడు ఆడిట్ చేసిన ఆర్థిక సంవత్సరాల్లో సగటు టర్నోవర్ కనీసం రూ.100 కోట్లు ఉండాలి. లేదా అదే కాలానికి సగటు నికర విలువ కనీసం రూ.100 కోట్లు ఉండాలని బీసీసీఐ నిబంధనల్లో పేర్కొంది. ఈ నిబంధనలు, పెరిగిన బేస్ ప్రైస్ కారణంగా బీసీసీఐకి కొత్త టైటిల్ స్పాన్సర్‌ను ఖరారు చేయడం ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. మరి టీమిండియా స్వదేశీ మ్యాచ్‌లకు కొత్త స్పాన్సర్‌గా ఎవరు వస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
చీలమండ గాయం.. ఆసియా క్రీడలకు నీరజ్ చోప్రా దూరం
ఆ లలిత్ మోదీ నేను కాదు.. వెంటనే తప్పును సరిదిద్దండి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్