చీలమండ గాయం.. ఆసియా క్రీడలకు నీరజ్ చోప్రా దూరం
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:18 PM
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చీలమండ గాయం కారణంగా 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలతో పాటు డైమండ్ లీగ్ ఫైనల్‌లోనూ నీరజ్ బరిలోకి దిగే అవకాశం లేకుండా పోయింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు భారీ షాక్ తగిలింది. చీలమండ గాయం కారణంగా 2026 సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. దీంతో సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలతో పాటు డైమండ్ లీగ్ ఫైనల్‌లోనూ నీరజ్ బరిలోకి దిగే అవకాశం లేకుండా పోయింది. శిక్షణ సమయంలో చీలమండకు లిగమెంట్ టియర్ అయినట్లు నీరజ్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాగు. వైద్యులు, తన టీమ్‌తో చర్చించిన తర్వాత ఈ సీజన్‌లో మిగిలిన పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఫామ్‌లోకి వస్తున్న వేళ..
సుదీర్ఘ గాయం తర్వాత ఈ ఏడాది జూన్‌లో దోహా డైమండ్ లీగ్‌తో నీరజ్ మళ్లీ పోటీల్లోకి వచ్చాడు. అక్కడ 85.69 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. అనంతరం గ్లాస్గోలో జరిగిన ఒలింపిక్స్‌లో 85.83 మీటర్లతో రజత పతకం సాధించాడు. ఆ తర్వాత డైమండ్ లీగ్‌లో సీజన్ బెస్ట్ త్రో నమోదు చేసి మంచి ఫామ్‌లోకి వస్తున్న సంకేతాలు ఇచ్చాడు. అయితే అదే సమయంలో తగిలిన గాయం అతడి సీజన్‌కు తెరదించింది.
ఆసియా క్రీడలకు దూరం
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి-నాగోయాలో ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ భారత్‌కు ప్రధాన పతక ఆశాకిరణంగా ఉన్నాడు. గతంలో సాధించిన స్వర్ణ పతకాన్ని ఈసారి కూడా నిలబెట్టుకోవాలని భావించిన అతడికి గాయం రూపంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ‘నేను నా రిథమ్‌ను అందుకుంటున్నానని అనిపించిన సమయంలో ఈ గాయం అవ్వడం చాలా నిరాశ కలిగిస్తోంది. అయితే ఎదురుదెబ్బలు కూడా ప్రయాణంలో భాగమే’ అని నీరజ్ పేర్కొన్నాడు. నీరజ్ దూరం కావడంతో ఆసియా క్రీడల్లో భారత జావెలిన్ ఆశలు ఇప్పుడు రోహిత్ యాదవ్‌పై పడనున్నాయి. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ సిల్వర్ లెవల్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్‌లో రోహిత్ 87.68 మీటర్ల దూరం విసిరి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. నీరజ్ గైర్హాజరీలో భారత జావెలిన్ బృందానికి రోహిత్ ప్రధాన బలంగా మారనున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్!
పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్..