ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్!
ABN , Publish Date - Aug 29 , 2026 | 10:24 AM
తమ తండ్రిని చంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు సరైన వైద్యం అందిచండం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇమ్రాన్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మద్దతు తెలిపారు.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మద్దతుగా నిలిచాడు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తున్నదనే వార్తలు, ఆయనకు తగిన వైద్య సేవలు అందడంలేదన్న ఆందోళనల నేపథ్యంలో కమిన్స్ స్పందించాడు. పాకిస్థాన్ ప్రభుత్వం ఇమ్రాన్ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, కోర్టు ఆదేశాల మేరకు మంచి వైద్యం అందించడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతివ్వాలని కమిన్స్ సోషల్ మీడియా వేదికగా పాక్ ప్రభుత్వాన్ని కోరాడు.
ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య సదుపాయాలు, కుటుంబ సభ్యుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ స్థాయిలో పాక్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్య చికిత్స అందించాలని గతంలోనూ 14 మంది మాజీ కెప్టెన్లు లేఖ రాసినప్పటికీ, పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ.. ప్యాట్ కమిన్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారులు, సోదరీమణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత వైద్యుడు కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని పిమ్స్(PIMS) ఆసుపత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, అధికారులు దానిని అమలు చేయలేదనే ఆరోపణలున్నాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయనను పిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి జైలుకు తరలించడం పట్ల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్..
మహిళల ఆసియాకప్ 2026: హాంకాంగ్‌ను ఓడించిన థాయ్‌లాండ్