Share News

‘గ్రాండ్‌ చెస్‌ టూర్‌’ విజేత.. ప్రజ్ఞానంద

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:13 AM

సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ చదరంగంలో అదరగొడుతున్న భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఖాతాలో మరో అరుదైన విజయం. ఈ తమిళనాడు స్టార్‌ ప్రతిష్టాత్మక గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌లో...

‘గ్రాండ్‌ చెస్‌ టూర్‌’ విజేత.. ప్రజ్ఞానంద

  • ఫైనల్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో

  • కరువానాపై ఉత్కంఠ విజయం

  • ‘ప్రజ్ఞా’నందం.. చరిత్రాత్మకం

  • గ్రాండ్‌ చెస్‌ టూర్‌ విజేత ప్రజ్ఞానంద

  • ఉత్కంఠ ఫైనల్లో కరువానాపై గెలుపు

  • ఈ టైటిల్‌ నెగ్గిన భారత ఆటగాడిగా రికార్డు

సెయింట్‌ లూయిస్‌ (యూఎస్ఏ): సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ చదరంగంలో అదరగొడుతున్న భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఖాతాలో మరో అరుదైన విజయం. ఈ తమిళనాడు స్టార్‌ ప్రతిష్టాత్మక గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో ప్రజ్ఞానంద 15-13తో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో కరువానాను ఓడించాడు. తద్వారా ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారత ప్లేయర్‌గా 21 ఏళ్ల ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ట్రోఫీతో పాటు రూ. 1.91 కోట్ల ప్రైజ్‌మనీని ప్రజ్ఞ అందుకున్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞ.. వచ్చే ఏడాది గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధించాడు. ఇక.. మూడోస్థానం పోరులో అమెరికాకు చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ వెస్లీ సో 18-12తో విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ)పై గెలిచి పోడియం ఫినిష్‌ చేశాడు.

అద్భుతంగా పుంజుకొని..: ఆఖరి రోజు కరువానాతో పోరు ప్రారంభానికి ముందు 3-9తో వెనుకంజలో నిలిచిన ప్రజ్ఞానంద.. అనూహ్యంగా పుంజుకొని టైటిల్‌ నెగ్గడం విశేషం. చివరి రోజు మొత్తంగా రెండు ర్యాపిడ్‌ గేమ్స్‌ (ఒక్కో విజయానికి 4 పాయింట్లు), నాలుగు బ్లిట్జ్‌ గేమ్స్‌ (ఒక్కో గెలుపునకు 2 పాయింట్లు)లో ఇద్దరూ తలపడగా.. మొదట రెండు ర్యాపిడ్‌ గేమ్‌లను నెగ్గిన ప్రజ్ఞ 11-9తో ఫాబియానోపై రెండు పాయింట్ల ఆధిక్యం సాధించాడు. అనంతరం బ్లిట్జ్‌ పోరులో తొలి గేమ్‌ డ్రాగా ముగియగా, రెండో గేమ్‌లో ప్రజ్ఞ ఓడడంతో 12-12తో స్కోర్లు సమమయ్యాయి. ఈ దశలో ఉత్కంఠ తారస్థాయికి చేరిన వేళ.. మూడో గేమ్‌ను సొంతం చేసుకొని ప్రజ్ఞ 14-12తో ఆధిక్యంలోకెళ్లాడు. ఇక, టైటిల్‌ నెగ్గాలంటే కనీసం డ్రా చేసుకోవాల్సిన ఆఖరిదైన నాలుగో బ్లిట్జ్‌ గేమ్‌ను ప్రజ్ఞ డ్రాగా ముగించి ట్రోఫీ దక్కించుకున్నాడు. మొత్తంగా రెండు ర్యాపిడ్‌ గేములలో రెంటినీ నెగ్గిన ప్రజ్ఞ.. నాలుగు బ్లిట్జ్‌ గేముల్లో ఓ గెలుపు, ఒక ఓటమి, రెండు డ్రాలు అందుకున్నాడు.


లోపాలను సవరించుకొని..

ఈ ఏడాది ఆరంభంలో ప్రజ్ఞానందకు అంతగా కలిసిరాలేదు. ఏప్రిల్‌లో ముగిసిన క్యాండిడేట్స్‌ టోర్నీలో ఫేవరెట్‌గా దిగిన ప్రజ్ఞ.. ఆ టోర్నీలో విఫలమై ఏడో స్థానంలో నిలిచాడు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అతడు తన గేమ్‌పై మరింత దృష్టి పెట్టాడు. మార్గదర్శి విశ్వనాథన్‌ ఆనంద్‌తో చర్చించి తన ఆటతీరులో లోపాలను సవరించుకున్నాడు. మరుసటి నెలలోనే నార్వే చెస్‌కు సిద్ధమయ్యాడు. ఆ టోర్నీలో ప్రపంచ నెంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను క్లాసికల్‌ ఫార్మాట్‌లో రెండుసార్లు ఓడించిన ప్రజ్ఞ.. అదేజోరులో టైటిల్‌ విజేతగా నిలిచాడు. జూన్‌లో వరల్డ్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో జట్టు పరంగా విఫలమైనా.. ర్యాపిడ్‌ విభాగం వ్యక్తిగత విభాగంలో బోర్డు 1లో స్వర్ణం నెగ్గి సత్తా చాటాడు. ఈనెల ఆరంభంలో సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌తో పాటు సింక్‌ఫీల్డ్‌ కప్‌లను నెగ్గిన భారత స్టార్‌.. ఇప్పుడు గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టైటిల్‌తో తన కెరీర్‌ను మరింత శోభాయమానం చేసుకున్నాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

గెలిచే అవకాశాలు వస్తాయనుకోలేదు

నిజం చెప్పాలంటే.. ఈరోజు నాకు గెలిచే అవకాశాలు వస్తాయని అస్సలు ఊహించలేదు. ఆరు పాయింట్లు వెనుకంజలో ఉండి కూడా టైటిల్‌ సాధించానంటే నమ్మశక్యంగా లేదు. కరువానా లాంటి అగ్రశ్రేణి ఆటగాడిపై ఒక్క గేమ్‌ నెగ్గడమైనా కష్టమే. అలాంటిది కీలక సమయంలో అతనిపై రెండు ర్యాపిడ్‌ గేమ్‌లనూ గెలిచి టైటిల్‌కు మార్గం సుగమం చేసుకున్నా. ఏడాదిగా నా ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ ఆటతీరులో కొన్ని మార్పులు చేసుకొన్నా. ఇప్పుడు ఫలితం రాబట్టా.

ప్రజ్ఞానంద

సీఎం అభినందన

గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టైటిల్‌ నెగ్గిన ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత ఖ్యాతిని, క్రీడా పటిమను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడని కొనియాడారు. భవిష్యత్తులో ప్రజ్ఞానంద మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించి, దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!

అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు

Updated Date - Aug 29 , 2026 | 04:18 AM