ఆ లలిత్ మోదీ నేను కాదు.. వెంటనే తప్పును సరిదిద్దండి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్
ABN , Publish Date - Aug 29 , 2026 | 02:40 PM
ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో బీడీఆర్ బిల్డర్స్ ఆస్తి వివాదానికి సంబంధించి వచ్చిన కథనాల్లో తనను తప్పుగా గుర్తించడంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో ఉన్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో బీడీఆర్ బిల్డర్స్ ఆస్తి వివాదానికి సంబంధించి వచ్చిన కథనాల్లో తనను తప్పుగా గుర్తించడంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో ఉన్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఒకే పేరు ఉన్న మరో వ్యక్తికి బదులుగా తన ఫొటో, బయోగ్రఫీ, వ్యక్తిగత వివరాలను పలు మీడియా సంస్థలు ఉపయోగించాయని ఆరోపించారు. ఈ మేరకు లలిత్ మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తప్పును సరిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘మీ అందరికీ ఓ విషయం చెప్పదల్చుకున్నా. వసంత్ విహార్/బీడీఆర్ బిల్డర్స్ ఆస్తి వివాదంలో ఉన్న లలిత్ మోదీ నేను కాదు. కోర్టు రికార్డుల్లో ఉన్న వ్యక్తి లలిత్ మోదీ తండ్రి పేరు జేఆర్ మోదీ. ఢిల్లీలోని వసంత్ విహార్ పశ్చిమ మార్క్ 32 ప్రాంతానికి చెందిన వ్యక్తి. నేను లలిత్ మోదీ. ఐపీఎల్ వ్యవస్థాపకుడిని. కొన్ని మీడియా సంస్థలు పొరపాటున నా ఫొటో, బయోగ్రఫీ, గుర్తింపును ఆ వ్యక్తి కేసుకు జత చేశాయి. ఒకే పేరు.. వేర్వేరు వ్యక్తులు. వాస్తవాలను సరిగా తెలుసుకుని ప్రచురించండి’ అని లలిత్ మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్!
పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్..