నా పేరు లేదని తెలిసి నవ్వొచ్చింది... కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన సూర్య
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:52 AM
భారత టీ20 కెప్టెన్సీ నుంచి సూర్య కుమార్ యాదవ్‌ను బీసీసీఐ తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను నూతన సారథిగా నియమించింది. దాదాపు రెండు నెలల తర్వాత కెప్టెన్సీ మార్పుపై తొలిసారి సూర్య స్పందించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ అందించిన ముగ్గురు కెప్టెన్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. ఈ ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచం కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. ఎంతటి క్లిష్టపరిస్థితినైనా తన చిరునవ్వుతోనే మేనేజ్ చేసే కెప్టెన్‌గా సూర్య గుర్తింపు పొందాడు. కెప్టెన్‌గా సూర్య సక్సెస్ అవుతున్నప్పటికీ బ్యాటర్‌గా విఫలం అయ్యాడు. ఈ కారణంతో బీసీసీఐ సూర్యను తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు జట్టు పగ్గాలను అప్పగించింది. దాదాపు రెండు నెలల గడిచిన తర్వాత.. తాజాగా కెప్టెన్సీ మార్పుపై సూర్యకుమార్ (Surya Kumar Yadav) స్పందించాడు. ఒలింపిక్స్‌తోపాటు వచ్చే టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టును నడిపిస్తానని తాను తొలుత అనుకున్నట్లు వెల్లడించాడు.
భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించాడు. ‘ ఆ రోజు జట్టు కెప్టెన్‌గా నా పేరు లేకపోవడం చూసి నవ్వొచ్చింది. నవ్వాను. నేను దేశం తరఫున ఆడుతున్న సమయంలో ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి ఉందనిపించినా, పరిస్థితులు నా చేయి దాటిపోతున్నాయని అనిపిస్తున్నా, అప్పుడూ ఇలాగే నవ్వు వస్తుంది. ముందుగా నేను రిలాక్స్ అవుతాను. గతంలో నాకు వచ్చిన అవకాశాలు, వాటిని సద్వినియోగం చేసుకున్న తీరును గుర్తు చేసుకుంటాను. తద్వారా ఒత్తిడిని జయించి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాను. నాకు వచ్చిన ప్రతి అవకాశానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు కూడా ఇలాగే ఆలోచించాను' అని సూర్య పేర్కొన్నాడు.
'2026లో కప్ గెలిచిన తర్వాత.. మరో రెండేళ్లూ ఈ జట్టుకు నేనే సారథిగా ఉంటానని అనుకున్నా. రాబోయే ఒలింపిక్స్‌లోనూ కెప్టెన్‌గా ఉంటానని భావించా. అయితే, ఇతరుల ఆలోచనలు వీటికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారి నిర్ణయాలను మనం గౌరవించాలి. ఈ జట్టు మరొకరి సారథ్యంలో రాణిస్తే మంచిదే కదా. శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు సారథిని చేశారని ఎప్పుడూ అనుకోను. కానీ, కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు నాకు కాస్త బాధ కలిగింది. రెండేళ్లలో ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. ప్రపంచ కప్ 2026, ఆసియా కప్‌లనూ గెలిచాం. అంతా బాగున్నప్పుడు నన్ను ఎందుకు తప్పించారో అర్థం కాలేదు. ఇదే ప్రశ్న నా మనసులో తిరుగుతూ ఉండేది. దాదాపు నెలన్నరపాటు ఇంటికే పరిమతమయ్యాను’ అని సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్!
పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్..