Share News

సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ.. జైలులో ఖైదీలతో నేరుగా మాట్లాడి..

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:14 AM

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శుక్రవారం చెన్నై సమీపంలోని పుఝల్ సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జైలు సదుపాయాలు, ఖైదీలకు అందుతున్న వైద్యం, ఆహారం, విద్య, వృత్తి శిక్షణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు.

సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ.. జైలులో ఖైదీలతో నేరుగా మాట్లాడి..
Tamil Nadu CM Vijay Puzhal Jail Visit

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శుక్రవారం చెన్నై సమీపంలోని పుఝల్ సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జైలు సదుపాయాలు, ఖైదీలకు అందుతున్న వైద్యం, ఆహారం, విద్య, వృత్తి శిక్షణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలు, సమస్యలను కూడా తెలుసుకున్నారు (Tamil Nadu CM Vijay Puzhal Jail Visit).


పుఝల్ సెంట్రల్ ప్రిజన్-1లోని పలు విభాగాలను సీఎం విజయ్ పరిశీలించారు. క్వారంటైన్ ప్రాంతం, సందర్శకుల హాల్, జైలు ఆసుపత్రి, డ్రగ్ డీ-అడిక్షన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, మహాత్మా గాంధీ కమ్యూనిటీ కాలేజీ తరగతి గదులు, లైబ్రరీ, అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించారు. హై-సెక్యూరిటీ బ్లాక్, ఉరిశిక్ష అమలు చేసే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. తనిఖీ సందర్భంగా ఖైదీలతో సీఎం విజయ్ నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు (Vijay Surprise Jail Visit).


ఖైదీలకు కేవలం శిక్ష విధించడం కాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ ద్వారా పునరావాసానికి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు (Puzhal Jail Inmates). జైలులో పుస్తకాల లభ్యతను కూడా పెంచాలని సీఎం సూచించారు. చదువు, నైపుణ్య శిక్షణ, ఖైదీల ఆసక్తులకు అనుగుణంగా వివిధ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. పుఝల్ జైలులోని వృత్తి శిక్షణ కేంద్రాన్ని కూడా విజయ్ పరిశీలించారు.


ఖైదీలు తయారు చేసిన ఇనుప ర్యాకులు, పేపర్ కవర్లు, ఆఫీస్ ఫైల్ బోర్డులతో పాటు హ్యాండ్లూమ్, టైలరింగ్ విభాగాల్లో తయారవుతున్న వస్తువులను పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహారం నాణ్యతను కూడా తనిఖీ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ప్రభుత్వ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ప్రభుత్వ చిన్నారుల ఆసుపత్రిని, అనంతరం దళిత విద్యార్థుల ప్రభుత్వ హాస్టల్‌ను కూడా ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.


ఇవి కూడా చదవండి..

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..


స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 29 , 2026 | 12:08 PM