51 ఏళ్ల వయసులో ‘ఫైఫర్’.. 94 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్!
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:41 PM
‘ఐస్లే ఆఫ్ మ్యాన్’ జట్టుకు చెందిన మహిళా క్రికెటర్ జోన్ హిక్స్ 51 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో 94 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించింది ‘ఐస్లే ఆఫ్ మ్యాన్’ జట్టుకు చెందిన మహిళా క్రికెటర్ జోన్ హిక్స్. 51 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. గ్రీక్‌తో జరిగిన మహిళల టీ20 మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి.. ఏకంగా 94 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 ఏళ్లు దాటిన తర్వాత ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది.
15 ఓవర్లలోనే గ్రీక్ ఆలౌట్
టాస్ గెలిచిన ఐస్లే ఆఫ్ మ్యాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన హిక్స్.. గ్రీక్ బ్యాటింగ్ లైనప్‌ను చీల్చిచెండాడింది. లిడియా కట్సిమారి, సోఫియా-నెఫెలి జార్జోటా, అగెలికి-ఐయోన్నా అర్జిరోపౌలూ, థియోడోరా పారిసి-మెసిమెరి, అలెక్జాండ్రా కౌర్కౌలూను పెవిలియన్‌కు పంపింది. ఆమె తీసిన ఐదు వికెట్లలో నాలుగు బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ కావడం విశేషం. హిక్స్ దెబ్బకు గ్రీక్ జట్టు 15 ఓవర్లలో కేవలం 52 పరుగులకే కుప్పకూలింది. అర్జిరోపౌలూ 17 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మరో బౌలర్ జార్జినా ఫోర్డ్ 2/9తో రాణించింది. స్వల్ప లక్ష్యాన్ని ఐస్లే ఆఫ్ మ్యాన్ జట్టు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఛేదించింది. కేవలం 6 ఓవర్లలో 56/1తో విజయాన్ని అందుకుంది.
94 ఏళ్ల నాటి రికార్డు బద్దలు
హిక్స్ సాధించిన ఈ ఘనతతో 1932 నుంచి కొనసాగుతున్న అరుదైన అంతర్జాతీయ రికార్డు బద్దలైంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా బౌలర్ బెర్ట్ ఐరన్‌మోంగర్ పేరిట ఉంది. 49 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాపై మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అతడు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ టెస్టులో ఐరన్‌మోంగర్ 5/6, 6/18తో సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా 36, 45 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 72 పరుగుల తేడాతో గెలిచింది. అప్పటి నుంచి 94 ఏళ్లుగా ఆ రికార్డు చెక్కు చెదరలేదు. తాజాగా హిక్స్ దానిని అధిగమించింది. అయితే హిక్స్ తన 40వ ఏట మహిళా క్రికెట్‌లోకి అడుగు పెట్టడం విశేషం. ఇప్పటి వరకు 22 అంతర్జాతీయ టీ20ల్లో 33 వికెట్లు పడగొట్టింది. అందులో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
చీలమండ గాయం.. ఆసియా క్రీడలకు నీరజ్ చోప్రా దూరం
ఆ లలిత్ మోదీ నేను కాదు.. వెంటనే తప్పును సరిదిద్దండి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్