Share News

ధోని, కోహ్లీ ఇచ్చిన సలహాలు పని చేశాయి: పంజాబ్ ప్లేయర్ యశ్ ఠాకూర్

ABN , Publish Date - Aug 29 , 2026 | 09:29 PM

ఐపీఎల్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోని ఇచ్చిన విలువైన సలహాలు పని చేశాయని భారత పేసర్‌ యశ్‌ ఠాకూర్‌ గుర్తు చేసుకున్నాడు.

ధోని, కోహ్లీ ఇచ్చిన సలహాలు పని చేశాయి: పంజాబ్ ప్లేయర్ యశ్ ఠాకూర్
Yash Thakur

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోని ఇచ్చిన విలువైన సలహాలు పని చేశాయని భారత పేసర్‌ యశ్‌ ఠాకూర్‌ గుర్తు చేసుకున్నాడు. కష్టకాలంలో వారిద్దరి మాటలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పాడు. 27 ఏళ్ల యశ్‌ ఠాకూర్‌ ఐపీఎల్‌లో ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో కొనసాగుతున్నాడు. 2023, 2024 సీజన్లలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున 19 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. అయితే పంజాబ్‌ కింగ్స్‌కు వచ్చిన తర్వాత ఆడే అవకాశాలు తగ్గిపోయాయి. అర్ష్‌దీప్‌ సింగ్‌, మార్కో యాన్సెన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌ వంటి సీనియర్‌ పేసర్ల కారణంగా ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే బరిలోకి దిగాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఎక్కువ సమయం బెంచ్‌పైనే ఉండాల్సి రావడంతో తీవ్ర నిరాశకు గురైన అతడికి.. విరాట్‌, ధోని ఇచ్చిన సలహాలు ఎంతో ధైర్యాన్నిచ్చాయని తెలిపాడు.


‘నాకు అవకాశాలు రావడం లేదు.. చాలా నిరాశగా ఉందని కోహ్లీతో చెప్పాను. భవిష్యత్‌ గురించి ఎక్కువగా ఆలోచించవద్దని ఆయన సూచించాడు. ఇప్పటివరకు వచ్చిన అవకాశాలకు కృతజ్ఞతగా ఉండటం కూడా అంతే ముఖ్యమని చెప్పాడు. రోజురోజుకూ నా సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలని సూచించాడు. ఎప్పుడైనా ఆడే అవకాశం వచ్చినప్పుడు.. ‘నేను సిద్ధంగా లేను’ అనే భావన ఉండకూడదని చెప్పాడు. దీంతో నా ప్రిపరేషన్‌పై మరింత దృష్టి పెట్టడం ప్రారంభించాను’ అని యశ్‌ ఠాకూర్‌ వెల్లడించాడు.


ధోనీ మాటలతో ఒత్తిడి దూరం

‘భారీ సంఖ్యలో ప్రేక్షకుల ముందు ఎప్పుడూ ఆడలేదు. అందుకే చాలా నెర్వస్‌గా, ఒత్తిడిగా అనిపిస్తోందని ధోనికి చెప్పాను. భవిష్యత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఆయన చెప్పారు. ఐపీఎల్‌లో అయినా.. భారత్‌ తరఫున ఆడుతున్నా ఇదే ఫీలింగ్‌ రావచ్చన్నారు. అందుకే ఎక్కువగా ఆలోచించకుండా.. జరుగుతున్న విషయాలను సహజంగా స్వీకరించాలని, కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఆ పద్ధతి ఇప్పటికీ నాకు ఎంతో ఉపయోగపడుతోంది. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపిస్తే.. ముందుగా నన్ను నేను సెటిల్‌ చేసుకునేందుకు కొంత సమయం తీసుకుంటాను’ అని యశ్‌ వెల్లడించాడు.

ఇదిలా ఉంటే, యశ్‌ ఠాకూర్‌కు ఇటీవలే భారత జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు భారత్‌ తరఫున రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.


ఇవి కూడా చదవండి:

టీమిండియా మ్యాచ్‌లకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు.. కారణం ఇదేనా!

51 ఏళ్ల వయసులో ‘ఫైఫర్’.. 94 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్!

Updated Date - Aug 29 , 2026 | 09:36 PM