Share News

ఆధిపత్యం సాగేనా?

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:23 AM

పొట్టి ఫార్మాట్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న భారత మహిళల జట్టు ఆదివారం నుంచి ఆసియాకప్‌ టీ20 టైటిల్‌ వేటను ఆరంభించనుంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌ను ఆడనుంది.

ఆధిపత్యం సాగేనా?

  • నేడు థాయ్‌లాండ్‌తో భారత్‌ పోరు

  • మహిళల ఆసియాకప్‌

  • రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..

దుబాయ్‌: పొట్టి ఫార్మాట్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న భారత మహిళల జట్టు ఆదివారం నుంచి ఆసియాకప్‌ టీ20 టైటిల్‌ వేటను ఆరంభించనుంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌ను ఆడనుంది. వాస్తవానికి ఈ టోర్నీలో గత దశాబ్ధ కాలంగా భారత మహిళలదే పూర్తి ఆధిపత్యం. టీ20 ఫార్మాట్‌లో 2012 నుంచి ఆసియాకప్‌ ఐదు పర్యాయాలు జరగగా.. మూడుసార్లు భారత్‌ నెగ్గింది. కానీ ఈ ఏడాది హర్మన్‌సేన ఆడిన 16 టీ20ల్లో తొమ్మిదింట్లో ఓటమిపాలైంది ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో గ్రూప్‌ దశలోనే వెనుదిరిగింది. అటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఫామ్‌, ఈ ఫార్మాట్‌లో తన భవిష్యత్‌పై సందేహాలు కొనసాగుతున్న వేళ ఆసియాక్‌పలో భారత జట్టు ప్రస్థానం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. తమకన్నా బలహీన జట్లే ఎక్కువగా ఉండడంతో ఈ టోర్నీ ద్వారా ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలనుకుంటోంది. మొత్తంగా ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటుండగా.. శ్రీలంక డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. అటు నరుమోల్‌ చయ్‌వయ్‌ సారథ్యంలోని థాయ్‌లాండ్‌ తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై గెలిచి జోష్‌లో ఉంది.


బ్యాటింగ్‌ మెరుగైతేనే..

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. కానీ ఆమె ఆటలో నిలకడలేమి కనిపిస్తుంది. ఇక గాయం కారణంగా జెమీమా టోర్నీకి దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీకా రావల్‌ను తీసుకున్నారు. కానీ తన ఎంపిక మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్‌ లోటును తీర్చదనే చెప్పవచ్చు. స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. అయితే వీరందించే శుభారంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగిస్తూ స్కోరుబోర్డును పరిగెత్తించడం సవాల్‌గా మారింది. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్‌ కూడా అపజయాలకు కారణమవుతోంది. బౌలింగ్‌లో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మపైనే జట్టు ఎక్కువగా ఆధారపడి ఉంది. శ్రీచరణి, రాధా యాదవ్‌, ప్రేమ రావత్‌ బాధ్యత తీసుకోనున్నారు. రేణుకా సింగ్‌, క్రాంతి, అరుంధతి, నందనితో పేస్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.

Updated Date - Aug 30 , 2026 | 04:39 AM