Share News

చైనాపై గూఢచర్యం చేస్తున్నాం.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:31 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాపై గూఢచర్యం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. చైనా కూడా అమెరికాలో గూఢచర్యం చేస్తోందని, వేగులను పెట్టిందని చెప్పారు.

చైనాపై గూఢచర్యం చేస్తున్నాం.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాపై గూఢచర్యం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. చైనా కూడా అమెరికాలో గూఢచర్యం చేస్తోందని, వేగులను పెట్టిందని చెప్పారు. చైనాలో జరుగుతున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) సదస్సులో ట్రంప్ పాల్గొననున్నారు. సదస్సులో పాల్గొనడానికి ముందు చైనాలోని షెంజెన్‌లోని మీడియాతో ట్రంప్ మాట్లాడారు. చైనా కన్నా తాము సమర్థంగా గూఢచర్యం చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా.. అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా సాయం చేస్తోందన్న ప్రచారాన్ని ట్రంప్ కొట్టివేశారు. ఇరాన్‌కు చైనా సాయం చేస్తే, ఆ విషయం వెంటనే తమకు తెలుస్తుందన్నారు.


వాస్తవానికి అమెరికాలో జరిగే పరిణామాల కన్నా చైనాలో జరిగే విషయాలే తమకు ఎక్కువగా తెలుస్తాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘అమెరికాలో గూఢచర్యం చేస్తున్నట్లు చైనా చెబుతోంది. చేయనివ్వండి. మేము కూడా చైనాలో గూఢచర్యం చేస్తున్నాం. ఇంటెలిజెన్స్ విషయంలో వారి కన్నా మేము ముందున్నాం. అయితే, దేనిపై గూఢచర్యం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయాలు వెల్లడించను’ అని ట్రంప్ పేర్కొన్నారు.


ఆలిస్ ఓ వ్యాపారవేత్త

ఎన్విడియా వ్యవహారంపైనా ట్రంప్ స్పందించారు. ఎన్విడియా పరిణామాలను విషాదంగా ఆయన అభివర్ణించారు. ఆ సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ మహా మేధావి అని, అలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆలిస్ హువాంగ్ చైనా గూఢచారి అన్న విషయం తనకెప్పుడూ తెలియలేదని అన్నారు. సాధారణంగా చైనా నుంచి వచ్చే అందమైన మహిళలను గూఢచారిగా ముద్ర వేస్తుంటారని, ఆమె ఓ వ్యాపారవేత్త అని పేర్కొన్నారు. ‘ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం అమెరికా చిప్‌లను కొనేందుకు ఆలిస్ ఇక్కడికి (అమెరికా) వచ్చారు. మాకు డబ్బులు కావాలి. అందుకే చిప్‌లను అమ్మేందుకు అనుమతి ఇచ్చాం. అందులో తప్పేముంది?’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 05:42 PM