Share News

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడి ఇంటికి నిప్పు, గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలపై దాడులు..

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:12 AM

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి హింసాత్మకంగా మారాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మాజీ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్‌కు చెందిన పూర్వీకుల ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడి ఇంటికి నిప్పు, గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలపై దాడులు..
Muhammad Yunus House Fire

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి హింసాత్మకంగా మారాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మాజీ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్‌కు చెందిన పూర్వీకుల ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆయన స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలపైనా వరుస దాడులు జరిగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు, అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి (Bangladesh Violence).


బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్ నగరంలోని పంచలైష్ ప్రాంతంలో మహమ్మద్ యూనస్ కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటికి బుధవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదు. కాగా, ఈ ఘటనకు కారణమైన వ్యక్తులెవరనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందుజాగ్రత్తగా ఇంటి వద్ద భద్రతను పెంచారు. మహమ్మద్ యూనస్ స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలను కూడా దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు (Grameen Bank Fire Bangladesh).


దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంక్ శాఖలకు నిప్పు పెట్టడం, విధ్వంసానికి పాల్పడటం వంటి ఘటనలు నమోదయ్యాయి (Awami League Protest). నవంబర్ 10 నుంచి ఇప్పటివరకు కనీసం 37 గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలు దాడులకు గురయ్యాయి. అవామీ లీగ్ ఇచ్చిన దేశవ్యాప్త లాక్‌డౌన్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢాకాలో 24 గంటల వ్యవధిలో 565 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మాజీ విద్యాశాఖ మంత్రి నూరుల్ ఇస్లాం నహిద్ కూడా ఉన్నారు. గతేడాది ఇదే సమయంలో ప్రత్యేక ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించింది. ఆ తీర్పునకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అవామీ లీగ్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.


ఇవి కూడా చదవండి..

2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం.. క్రైస్తవులను దాటేయనున్న ముస్లిం జనాభా..

గాజాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. హమాస్ ఆధీన ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైన్యం!

Updated Date - Nov 19 , 2026 | 11:13 AM