2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం.. క్రైస్తవులను దాటేయనున్న ముస్లిం జనాభా..
ABN , Publish Date - Nov 19 , 2026 | 08:29 AM
మరో పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతంగా ఉన్న క్రైస్తవాన్ని ఇస్లాం అధిగమించే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధన వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: మరో పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతంగా ఉన్న క్రైస్తవాన్ని ఇస్లాం అధిగమించే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. 2035 నాటికి ముస్లింలు ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహంగా అవతరించవచ్చని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. బుధవారం విడుదల చేసిన తాజా నివేదికలో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది (World's Largest Religion).
ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనాల ప్రకారం.. 2020లో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల జనాభా 227 కోట్లుగా ఉండగా, ముస్లింల జనాభా 202 కోట్లుగా ఉంది. అయితే, 2035 నాటికి ముస్లింల జనాభా 257 కోట్లకు చేరుకోవచ్చని, క్రైస్తవుల జనాభా 252 కోట్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. అంటే క్రైస్తవులను అధిగమించి ముస్లింలు ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహంగా నిలిచే అవకాశం ఉంది. ముస్లింల జనాభా వేగంగా పెరగడానికి ప్రధాన కారణం అధిక జననాల రేటు అని ప్యూ పరిశోధకులు వెల్లడించారు (Islam Population Growth).
2020-2025 మధ్య కాలంలో ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు సగటున 3.1గా ఉండగా, క్రైస్తవ మహిళల్లో ఇది 2.5గా నమోదైంది. ఇతర మతాలకు చెందిన మహిళల్లో ఈ సగటు 1.6గా ఉంది. జనాభా పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే 2070 నాటికి ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా 360 కోట్లకు మించవచ్చని ప్యూ అంచనా వేసింది. అదే సమయంలో క్రైస్తవుల జనాభా 300 కోట్లకు చేరువలో ఉండవచ్చని తెలిపింది. ప్రపంచ జనాభా 2020 నుంచి 2070 మధ్య 29 శాతం పెరుగుతుందని అంచనా. ఇదే సమయంలో ముస్లింల జనాభా 80 శాతం, క్రైస్తవుల జనాభా 30 శాతం పెరగవచ్చని నివేదిక పేర్కొంది (Pew Research Report).
రానున్న దశాబ్దాల్లో ప్రపంచ జనాభా పెరుగుదలలో ఆఫ్రికా కీలక పాత్ర పోషించనుందని ప్యూ పరిశోధకులు అంచనా వేశారు (Muslim Population 2035). 2070 నాటికి కాంగోలో క్రైస్తవుల జనాభా 29.9 కోట్లకు చేరుకోవచ్చని, అమెరికాను అధిగమించి అత్యధిక క్రైస్తవ జనాభా కలిగిన దేశంగా అవతరించవచ్చని పేర్కొన్నారు. ఇక, ప్రస్తుతం అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా ఇండోనేషియా ఉంది. అయితే 2070 నాటికి పాకిస్థాన్ ఈ స్థానాన్ని ఆక్రమించవచ్చని ప్యూ అంచనా వేసింది. ఆ తర్వాత భారత్, నైజీరియా, ఇండోనేషియా దేశాలు నిలిచే అవకాశం ఉందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
గాజాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. హమాస్ ఆధీన ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైన్యం!
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..