Share News

గాజాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. హమాస్ ఆధీన ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైన్యం!

ABN , Publish Date - Nov 19 , 2026 | 07:49 AM

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భూతల దాడికి దిగింది. హమాస్ ఆధీనంలో ఉన్న మధ్య గాజా ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైనికులు ట్యాంకులతో ప్రవేశించారు.

గాజాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. హమాస్ ఆధీన ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైన్యం!
Israel Gaza War

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భూతల దాడికి దిగింది. హమాస్ ఆధీనంలో ఉన్న మధ్య గాజా ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైనికులు ట్యాంకులతో ప్రవేశించారు. ఈ పరిణామంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లను, తాత్కాలిక నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మధ్య గాజాలోని హమాస్ ఆధీన ప్రాంతంలో బుధవారం ఇజ్రాయెల్ సైన్యం ఈ ఆపరేషన్ ప్రారంభించింది (Israel Gaza War).


ఇజ్రాయెల్ సైన్యం, అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్ సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టాయి. తమ సైనికులకు తక్షణ ముప్పుగా మారిన ఎల్లో లైన్‌కు పశ్చిమాన ఉన్న హమాస్ సొరంగాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నుసైరత్ శరణార్థి శిబిరానికి తూర్పు వైపున ఇజ్రాయెల్ ట్యాంకులు కనిపించాయని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఫిరంగి దాడులు, కాల్పులు జరుగుతున్నాయని స్థానిక భద్రతా వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు (Israel Ground Operation).


2025 అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత గాజా ప్రాంతాన్ని ఎల్లో లైన్ ద్వారా ఇజ్రాయెల్, హమాస్ ఆధీన ప్రాంతాలుగా విభజించారు (Israel Hamas Conflict). గాజాలో 60 శాతానికి పైగా భూభాగం తమ నియంత్రణలో ఉందని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. తాజాగా ఈ రేఖకు పశ్చిమాన ఉన్న హమాస్ ఆధీన ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైన్యం ట్యాంకులతో ప్రవేశించింది. బురైజ్, నుసైరత్ శరణార్థి శిబిరాల సమీపంలో సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో స్థానిక ప్రజలు తమ నివాసాలను వదిలి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే యుద్ధం కారణంగా పలుమార్లు నిరాశ్రయులైన కుటుంబాలు మరోసారి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

Updated Date - Nov 19 , 2026 | 07:49 AM