Share News

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య అమెరికా భారీ క్షిపణి పరీక్ష

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:14 PM

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా భారీ అణు సామర్థ్యం గల క్షిపణి పరీక్ష నిర్వహించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా సైన్యం కాలిఫోర్నియా తీరంలో ఉన్న వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి శక్తిమంతమైన మినిట్‌మ్యాన్-3 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య అమెరికా భారీ క్షిపణి పరీక్ష
US Missile Test

ఇంటర్నెట్ డెస్క్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా భారీ అణు సామర్థ్యం గల క్షిపణి పరీక్ష (US Nuclear Missile Test) నిర్వహించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా సైన్యం కాలిఫోర్నియా తీరంలో ఉన్న వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ (Vandenberg Space Force Base) నుంచి శక్తిమంతమైన మినిట్‌మ్యాన్-3 (Minuteman III)ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరీక్షను అమెరికా సాధారణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిందని అధికారులు వెల్లడించారు.


కాలిఫోర్నియా తీరంలో క్షిపణి ప్రయోగం..

ఈ క్షిపణి పరీక్ష సాంటా బార్బరా సమీపంలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి నిర్వహించారు. GT-254 పేరుతో నిర్వహించిన ఈ ప్రయోగంలో నిరాయుధ రాకెట్‌ను ఉపయోగించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ప్రయోగించిన క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మార్షల్ ఐస్ ల్యాండ్ సమీపంలోని లక్ష్యాన్ని కచ్చితంగా తాకినట్లు అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడించింది.

అణు వార్‌హెడ్‌లను మోయగల సామర్థ్యం..

మినిట్‌మ్యాన్-3 క్షిపణి అమెరికా రక్షణ వ్యవస్థలో కీలక భాగమని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమాపై పడేసిన అణుబాంబుల కంటే 20 రెట్లు శక్తివంతమైన వార్‌హెడ్‌లను మోయగల క్షిపణి అని అధికారులు చెబుతున్నారు.


పరీక్ష లక్ష్యం ఏమిటి..?

అమెరికా ఎయిర్‌ఫోర్స్ ప్రకారం.. ఈ పరీక్ష పూర్తిగా రక్షణాత్మక ప్రయోజనాల కోసం నిర్వహించిందని అధికారులు తెలిపారు. క్షిపణి వ్యవస్థ కచ్చితత్వం, ప్రభావం, సిద్ధంగా ఉండే చర్యలను పరీక్షించడం ప్రధాన లక్ష్యమని అధికారులు వివరించారు. అలాగే వివిధ మిషన్ ప్రొఫైల్స్ ద్వారా మినిట్‌మ్యాన్-3 వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


అణు రక్షణ వ్యవస్థ సిద్ధత..

అమెరికా భూమి ఆధారిత అణు దాడి వ్యవస్థ సిద్ధతను నిర్ధారించుకోవడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రతా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రక్షణ వ్యవస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో చర్చ..

ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై దాడులు చేసిన నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ పరీక్షకు ఆ ఘటనలతో ప్రత్యక్ష సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రంప్‌నకు ఊరట.. యుద్ధ చర్యల నియంత్రణపై డెమోక్రాట్ల ప్రయత్నం విఫలం

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 01:08 PM