అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జార్జ్‌కు ఉద్వాసన
ABN , Publish Date - Apr 03 , 2026 | 07:39 AM
ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్‌ను పదవీ బాధ్యతల నుంచి తప్పించి.. ప్రస్తుత వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న క్రిస్టోఫర్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ సైన్యంలోని అత్యున్నత అధికారి అయిన జనరల్ రాండీ ఏ.జార్జ్‌ను పదవీ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు ఆయన తక్షణమే వైదొలగాలని రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్టు పెంటగాన్ నివేదించింది. అయితే.. ఆయన తొలగింపునకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
'జార్జ్ సేవలకు మేం కృతజ్ఞులం. కానీ సైన్యంలో నాయకత్వ మార్పునకు సమయం ఆసన్నమైంది' అని రక్షణ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారని రాసుకొచ్చింది పెంటగాన్. ప్రస్తుతం.. వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన జనరల్ క్రిస్టోఫర్‌ను తాత్కాలిక ఆర్మీ చీఫ్‌గా నియమించింది. హెగ్సెత్ గతేడాది తొలిసారిగా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సైన్యంలోని ఉన్నతస్థాయి పదవుల్లోని సుమారు డజనుకుపైగా అధికారులను తొలగించడం గమనార్హం. అందులో జార్జ్ ఒకరు.
1988 వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్, పదాతిదళ అధికారి అయిన జార్జ్.. అమెరికన్ ఆర్మీ 41వ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్‌గా 2023 సెప్టెంబర్ 21న బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ఆయన 38వ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా.. తొలి గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, అఫ్గానిస్థాన్‌లలోనూ పనిచేశారు. సైన్యంలో బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బైడెన్ పాలనలో 2021-22 కాలంలో రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్‌కు అగ్రశ్రేణి సైనిక సహాయకుడిగానూ సేవలందించారు. ఆపరేషన్ డెసర్ట్ షీల్డ్, డెసర్ట్ స్టార్మ్, ఇరాకీ ఫ్రీడమ్, ఎండ్యురింగ్ ఫ్రీడమ్ వంటి పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు జార్జ్.
ఇవీ చదవండి:
భారతీయ మిత్రులకు ముప్పు ఉండదు: ఇరాన్