ఎవరి కోసం ఈ యుద్ధం?
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:18 AM
ఇరాన్ మీద ఏకపక్ష దాడుల్ని ప్రారంభించి ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తదితరుల్ని బలిగొన్న తర్వాత.. ట్రంప్ గత నెల తొలివారంలో ఇరానీయుల్ని ఉద్దేశించి ఓ పిలుపునిచ్చారు. ‘కొన్ని తరాలకుగానీ రాని అవకాశం మీకు కల్పిం చాం..
అమెరికా ప్రజలారా.. మీతో మాకు ఏ విధమైన శత్రుత్వం లేదు
విధ్వంసంతో పసిపిల్లల్ని హత్య చేస్తున్నారు.. ఇది పరాక్రమమా?
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ బహిరంగ లేఖ
టెహ్రాన్, ఏప్రిల్ 2: ఇరాన్ మీద ఏకపక్ష దాడుల్ని ప్రారంభించి ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తదితరుల్ని బలిగొన్న తర్వాత.. ట్రంప్ గత నెల తొలివారంలో ఇరానీయుల్ని ఉద్దేశించి ఓ పిలుపునిచ్చారు. ‘కొన్ని తరాలకుగానీ రాని అవకాశం మీకు కల్పిం చాం.. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి!’ అని పేర్కొన్నారు. అయితే, ఆయన ఊహించినదానికి భిన్నంగా ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వం వెంట బలంగా నిలబడ్డారు. అందుకే, ఆ దేశం అమెరికా, ఇజ్రాయెల్‌ల సంయుక్త దాడిని దీటుగా ఎదుర్కొంటోంది. మరోవైపు, ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో పలు నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా ప్రజల్ని ఉద్దేశించి గురువారం ఓ బహిరంగ లేఖ రాశారు. ‘అమెరికా ప్రజలారా! మాతో ఎటువంటి సమస్య లేకపోయినా మీ అధ్యక్షుడు మా మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారో గుర్తించండి. ఆయుధాల కంపెనీల కోసం, ఇజ్రాయెల్ కోసం ఈ యుద్ధంలోకి దిగారు. మీ సైనికుల ప్రాణాల్ని బలి పెడుతున్నారు. మీరు కట్టిన పన్నుల్ని నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారు. సాధారణ ప్రజలైన మీతో మాకు ఎటువంటి శత్రుత్వం లేదు’ అని పేర్కొన్నారు. మూడు పేజీల ఈ లేఖలో ఇరాన్ ప్రాచీన నాగరికత నుంచి నేటి పరిస్థితుల వరకూ స్థూలంగా, సూటిగా తన అభిప్రాయాలను పెజెష్కియాన్ వెల్లడించారు. ‘మానవ చరిత్రలోనే ఇప్పటికీ కొనసాగుతున్న అతి ప్రాచీన నాగరికతల్లో మాదొకటి. చారిత్రకంగా, భౌగోళికంగా, సైనికపరంగా మాకు అనుకూలతలు ఉన్నప్పటికీ మేం మా ఆధునిక చరిత్రలో ఎన్నడూ ఇతర ప్రాంతాల మీద ఆక్రమణకు, ఆధిపత్యానికి, యుద్ధానికి దిగలేదు. అదే సమయంలో, మా మీద ఎవరైనా దాడులు చేస్తే వాటిని ప్రతిసారీ విజయవంతంగా తిప్పికొట్టాం. మాకు ఏ దేశం మీదా శత్రుత్వం లేదు. అంతేకాదు, ప్రభుత్వాలకు.. అవి పాలించే ప్రజలకు మధ్య తేడా ఉందన్న విషయంలో ఇరాన్ ప్రజలకు స్పష్టత ఉంది. ఇది మా సంస్కృతిలో, మా సమష్టి చేతనలో ఒక భాగం. కాబట్టి, ఇరాన్‌ను ఒక శత్రువు గా చూపటం అనేది చారిత్రకంగా చూసినా, ప్రస్తుత పరిస్థితుల ప్రకారమైనా సరైనది కాదు. అయినప్పటికీ సైనిక ఆధిపత్యం, ఆయుధ పరిశ్రమ, వ్యూహాత్మక మార్కెట్ల మీద నియంత్రణ కోసం కొన్ని బలీయమైన శక్తులు ఇరాన్‌ను ఒక బూచిగా చూపుతున్నాయి. లేని శత్రువును ఉన్నట్లు సృష్టిస్తున్నాయి’ అని పెజెష్కియాన్ పేర్కొన్నారు.
చర్చలు జరుగుతుండగానే యుద్ధం
అమెరికా ఒక దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచీ నేటి వరకూ ఇరాన్ ఆ దేశం మీద యుద్ధానికి దిగలేదని, అయినప్పటికీ, ఇరాన్ చుట్టూ అమెరికా భారీస్థాయిలో సైనిక దళాల్ని మోహరించిందని, సైనిక స్థావరాల్ని నెలకొల్పిందని పెజెష్కియాన్ గుర్తు చేశా రు. ఇరాన్ తన వనరుల్ని జాతీయం చేసుకోవటాన్ని అమెరికా 1953లో అడ్డుకోవటంతో.. ఇరాన్ ప్రజాస్వామ్యీకరణ ప్రక్రియ నిలిచిపోయి దేశంలో నియంతృ త్వం నెలకొందన్నారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం అనంతర పరిస్థితులను వివరిస్తూ.. ఆధునిక ప్రపం చ చరిత్రలో ఏ దేశంమీద లేనటువంటి సుదీర్ఘ, విస్తృతమైన ఆంక్షలను తమమీద అమెరికా విధించిందని తెలిపారు. అయినప్పటికీ, తాము చర్చల మార్గం వీడలేదని, తమకు విధించిన అన్ని షరతు ల్నీ పాటించామని, ఒప్పందం మధ్యలోంచి అమెరికా (2018లో ట్రంప్ తొలి ప్రభుత్వహయాంలో) అకస్మాత్తుగా బయటకు వచ్చిందని గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో మళ్లీ చర్చలు జరుగుతుండగానే.. మధ్యలోనే తమమీద అమెరికా రెండుసార్లు యుద్ధానికి ది గిన విషయాన్ని ప్రస్తావించారు. స్కూళ్లమీద దాడి చేసి చిన్న పిల్లల్ని హత్య చేయటం, క్యాన్సర్ చికిత్స కేంద్రాల్ని ధ్వంసం చేయటం వల్ల అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ఠ దిగజారటం తప్ప ఆ దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు. ఇది పరాక్రమం కాదన్నారు. ఇటువంటి విధ్వంసం వల్ల కలిగే ప్రకంపనలు అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితుల్ని సృష్టిస్తాయన్నారు.
అమెరికా ప్రజలు అర్థం చేసుకోవాలి
ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నారో అమెరికా ప్రజలు అర్థం చేసుకోవాలని పెజెష్కియాన్ సూచించారు. ‘ఇజ్రాయెల్‌కు అనుచర దేశంగా అమెరికా ఈ యుద్ధంలోకి దిగలేదా? పాలస్తీనీయుల మీద తమ దురాగతాల్ని ప్రపంచం దృష్టి నుంచి మళ్లించటం కోసం ఇజ్రాయెల్.. ఇరాన్‌ను బూచిగా చూపి యు ద్ధం ప్రారంభించలేదా? అమెరికా సైనికుల ప్రాణాలతో, అమెరికా ప్రజల పన్నులతో ఇజ్రాయెల్ ఈ యుదా ్ధన్ని నడిపించటం లేదా? ఇకపై అమెరికన్లకే ప్రాధాన్యం అంటూ అమెరికా ప్రభుత్వం(ట్రంప్) చేసిన ప్రకటనకు ఈ యుద్ధానికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించండి. ఇరాన్‌పై తప్పుడు ప్రచారాన్ని పక్కనపెట్టి అసలు విషయాల్ని గుర్తించండి’ అని పేర్కొన్నారు. ‘నేడు ప్రపంచం ఒక కూడలిలో ఉంది. ఘర్షణా? సంవాదమా?.. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటామనేది భవిష్యత్‌ను నిర్మిస్తుంది’ అని పెజెష్కియాన్ స్పష్టం చేశారు.