యుద్ధం ఆగదు
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:21 AM
ఇరాన్‌పై దాడులను ఇప్పట్లో ఆపేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశం తాము విధించిన షరతులకు లోబడి శాంతి ఒడంబడిక కోసం చర్చలకు వచ్చేవరకు యుద్ధం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
మళ్లీ కోలుకోకుండా ఇరాన్‌ను ధ్వంసం చేస్తాం
ఇప్పటికే ఆ దేశ మిలిటరీని పూర్తిగా నాశనం చేశాం
ఇరాన్ క్షిపణి, డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతీశాం
శాంతి ఒడంబడికకు ఒప్పుకోకుంటే వినాశనమే
ఆ దేశాన్ని తిరిగి రాతి యుగానికి పంపుతాం
యుద్ధంలో విజయానికి అతి చేరువలో ఉన్నాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
మీరు అవమానం పొందేవరకు యుద్ధం ఆగదు
మా వ్యూహాలను మీరు అర్థం చేసుకోలేరు: ఇరాన్
వాషింగ్టన్/ టెహ్రాన్, ఏప్రిల్ 2: ఇరాన్‌పై దాడులను ఇప్పట్లో ఆపేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశం తాము విధించిన షరతులకు లోబడి శాంతి ఒడంబడిక కోసం చర్చలకు వచ్చేవరకు యుద్ధం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. బుధవారం రాత్రి ఆయన అమెరికా ప్రజలను ఉదేశించి ప్రసంగించారు. అమెరికాతోపాటు ప్రపంచాన్ని కాపాడేందుకే ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో యుద్ధం ప్రారంభించినట్లు తెలిపారు.‘ఈ యుద్ధంలో మన ప్రధాన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించేందుకు అతి చేరువలో ఉన్నాం. ఈ పనిని అతి త్వరలో పూర్తి చేస్తాం. మరో రెండుమూడు వారాలు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తాం. గతంలో కంటే భీకరమైన దాడులు చేస్తాం. రాతి యుగానికి చెందిన ఆ దేశాన్ని తిరిగి అక్కడికే పంపిస్తాం. దాడులు కొనసాగించినా.. ఆ దేశంతో చర్చలు కూడా కొనసాగుతాయి. శాంతి ఒడంబడికకు వాళ్లు ఒప్పుకోకుంటే ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేస్తాం’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా గతంలో చేసిన ఏ యుద్ధంలోనూ సాధించనంత ఘన విజయాన్ని ఇరాన్ యుద్ధంలో ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ ఉత్పత్తి, ప్రయోగ కేంద్రాలను, వైమానిక, నౌకా దళాలతోపాటు పారిశ్రామిక కేంద్రాలను నాశనం చేసినట్లు చెప్పారు. పశ్చిమాసియాలో హింసను ప్రేరేపించిన ఇరాన్ కీలక నేతలంతా తమ దాడుల్లో మరణించారని తెలిపారు.
ఇకపై పశ్చిమాసియాలో ఏ దేశంపైనా ఇరాన్ పరోక్ష యుద్ధం చేయలేదన్నారు. ఆ దేశ అణు కార్యక్రమాన్ని ఎప్పటికీ కోలుకోకుండా దెబ్బతీసినట్లు వెల్లడించారు. అమెరికా ప్రజల రక్షణతోపాటు ప్రపంచ శాంతి కోసమే ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టినట్లు తెలిపారు. ఇరాన్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అణు ఒప్పందం చేసుకోవటం పెద్ద తప్పు అని ట్రంప్ విమర్శించారు. ఆ ఒప్పందం అమల్లో ఉంటే ఇరాన్ అణు బాంబు తయారు చేసి ఉండేదని అన్నారు. అమెరికాకు ఇకపై హోర్ముజ్ జలసంధి ద్వారా వచ్చే చమురు అవసరం లేదని స్పష్టంచేశారు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేస్తున్న దేశం అమెరికాయేనని తెలిపారు. ఇరాన్‌తో యుద్ధంలో తమకు అరబ్ దేశాలు ఎంతగానో సహాయం చేశాయని కొనియాడారు. మరోవైపు ఇరాన్‌తో యుద్ధం ఇంకా కొనసాగిస్తే అమెరికా ప్రజలు ఓపిక పట్టే పరిస్థితులు కనిపించటం లేదని అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో బుధవారం నిర్వహించిన ఈస్టర్ విందు సందర్భంగా ట్రంప్ అన్నట్లు సమాచారం.
మీకు ఘోర అవమానం తప్పదు: ఇరాన్
అమెరికా అధ్యక్షుడి ప్రకటనకు ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇరాన్ శక్తిసామర్థ్యాల గురించి అమెరికా, ఇజ్రాయెల్‌ల నిఘా వర్గాలకు ఏమీ తెలియదని ఖతమ్ అల్ అన్బియా ప్రధాన కార్యాలయం ప్రతినిధి ఎబ్రాహిమ్ జోల్ఫఘరీ అన్నారు. ‘మీరు ఘోర అవమానం మూటగట్టుకొని లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుంది. మా వ్యూహాలను మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మా శక్తిసామర్థ్యాల గురించి మీకు అసలేమీ తెలియదు. మా ఆయుధ ఉత్పత్తి కేంద్రాలను మీరు చేరుకోలేరు. మా వద్ద ఇప్పటికీ చాలా ఆయుధాలు, డ్రోన్లు ఉన్నాయి’ అని తెలిపారు. కేవలం 250 ఏళ్ల చరిత్ర కలిగిన దేశం.. 6 వేల ఏళ్ల నాగరికత గల దేశాన్ని రాతియుగం వాళ్లు అని పేర్కొనటం అవివేకం అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళ విభాగం అధిపతి బ్రిగేడియర్ జనరల్ సయెద్ మూసావి గురువారం ఎక్స్‌లో మండిపడ్డారు.
పశ్చిమాసియా వైపు జార్జిబుష్
ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగించటానికే ట్రంప్ మొగ్గు చూపటంతో ఆ దేశ నౌకాదళం మరిన్ని దాడులకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అమెరికా నేవీలోని అతిపెద్ద విమాన వాహక నౌకల్లో ఒకటైన యూఎస్‌ఎస్ జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ మధ్య ఆసియా వైపు ప్రయాణం మొదలుపెట్టింది. లక్ష టన్నుల బరువైన నిమిట్జ్ రకానికి చెందిన ఈ నౌకలో 5 వేలకుపైగా సైనికులు, సిబ్బంది ఉంటారు.
హోర్ముజ్ జలసంధి తెరిస్తే కాల్పుల విరమణ!
ఇరాన్‌ను ఒకవైపు బెదిరిస్తూనే.. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఇరాన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేరసారాలు ఆడుతున్నట్లు తెలిసింది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిస్తే.. ఆ దేశంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొనేందుకు సిద్ధమని సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ బుధవారం చెప్పినట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది. అయితే ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ ప్రకటించింది.