కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:11 PM
అమెరికాలో యూ వీసా పొందేందుకు నకిలీ దోపిడీలకు పాల్పడిన కేసులో ఓ భారతీయుడికి కోర్టు జైలు శిక్ష, జరిమానాతో పాటు దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. మసాచుసెట్స్‌కు చెందిన మితుల్ పటేల్ ఈ మోసానికి పాల్పడటంతో బోస్టన్‌లోని ఫెడరల్ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో అడ్డదారిలో కుట్రపూరితంగా వీసాలు పొందేందుకు యత్నించిన ఓ భారతీయుణ్ని బహిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది అక్కడి న్యాయస్థానం. 'యూ-నాన్ ఇమ్మిగ్రేషన్(యూ-వీసా)' కోసం పలు కుట్రపూరిత నేరాలకు పాల్పడిన మితుల్ పటేల్‌కు ఈ శిక్ష విధించింది బోస్టన్‌లోని ఫెడరల్ జిల్లా న్యాయస్థానం. దీంతో పాటు ఒక రోజు జైలు శిక్ష, వెయ్యి అమెరికన్ డాలర్ల జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది. జైలు శిక్ష పూర్తయ్యాక అతణ్ని అమెరికా నుంచి తొలగించాలని ఆదేశించింది.
అభియోగ పత్రాల ప్రకారం.. 2023 మార్చి నుంచి రాంభాయ్ పటేల్ నేతృత్వంలోని ఓ ముఠా మసాచుసెట్స్‌లోని కన్వీనియన్స్ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో కనీసం 6 నకిలీ సాయుధ దోపిడీలను సృష్టించింది. ఈ దోపిడీల్లో అక్కడ పనిచేసే ఉద్యోగులను బాధితులుగా చూపిస్తూ.. వారు యూ వీసాకు అర్హులమని తప్పుడు దరఖాస్తులు చేసుకునేలా ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించి అదే ఏడాది అక్టోబర్‌లో వోర్సెస్టర్‌లోని ఓ దుకాణంలో జరిగిన నకిలీ దోపిడీలో బాధితుడిగా నటించేందుకు మితుల్ పటేల్.. రాంభాయ్ పటేల్‌కు కొంత డబ్బు చెల్లించినట్లు కూడా వెల్లడైంది. దోపిడీ సమయంలో నకిలీ తుపాకీతో బెదిరించి నగదు తీసుకెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యేలా జాగ్రత్త పడేవారు. ఆ తర్వాత కాసేపటికి పోలీసులకు ఫిర్యాదు చేసి.. తామే నిజమైన నేర బాధితులుగా చూపించుకునేవారని అధికారులు గుర్తించారు.
అమెరికాలో యూ వీసా అంటే.. హింసాత్మక నేరాలకు గురై, దర్యాప్తులో పోలీసులకు సహకరించిన విదేశీయులకు ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చే వలస ప్రయోజనం. అయితే.. ఈ నిబంధనల్ని దుర్వినియోగం చేసేందుకు మితుల్ సింగ్, అతడి బృందం కుట్రలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాంభాయ్ పటేల్, నకిలీ దోపిడీల్లో పాల్గొన్న వ్యక్తి, తప్పించుకునేందుకు వాహనం నడిపిన బల్వీందర్ సింగ్‌లను ఇప్పటికే అరెస్టు చేసి, 2025లో దోషులుగా తేల్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి:
బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు.. లెక్కించడంలో 5 మెషీన్లు విఫలం
నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్