యంగ్ హృతిక్‌లా ఉంటానని ఫ్రెండ్స్ అంటారు: కంగనాకు సౌరవ్ దాస్ కౌంటర్..
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:25 AM
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనాకు సౌరవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో హృతిక్ రోషన్, కంగనా మధ్య జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జెన్-జీ విద్యార్థుల నిరసనలతో మొదలైన ఈ వివాదం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనాకు సౌరవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో హృతిక్ రోషన్, కంగనా మధ్య జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కంగనా తనను లక్ష్యంగా చేసుకోవడంపై స్పందించిన సౌరవ్.. తన స్నేహితులు కూడా అదే విషయాన్ని ప్రశ్నించారని చెప్పారు. వారిలో ఒకరు తాను యంగ్ హృతిక్ రోషన్‌లా కనిపిస్తానని చెప్పారని, అందుకే కంగనా తనపై ఎక్కువగా స్పందిస్తోందేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కంగనా మాట్లాడే తీరు నిరాశతో నిండినట్లుగా ఉందని, ఆమె మాటలు మానసికంగా స్థిరంగా ఉన్న వ్యక్తి మాట్లాడినట్లుగా అనిపించడం లేదన్నారు. దేశ యువతను అవమానించేలా మాట్లాడకూడదని, ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కంగనాపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని తెలిపిన సౌరవ్.. ఆమె మాత్రం వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కంగనాతో కాఫీకి వెళ్లేందుకు కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎవరి పట్లా వ్యక్తిగత వైరం లేదని చెప్పారు.
వివాదం ఎక్కడ మొదలైంది..?
ఈ వివాదం జెన్-జీ నిరసనలపై కంగనా చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న యువతను ఆమె తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల ప్రవర్తన, భాష చాలా అసహ్యంగా ఉందని, అలాంటి వీడియోలు చూస్తే విసుగు వస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సౌరవ్ దాస్.. కంగనా వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. సొంత పార్టీ నాయకులే ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఎంపీగా పని చాలా ఉంటుందని గతంలో కంగనా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అది రాజకీయాలపై ఆమెకి ఉన్న అవగాహనను తెలియజేస్తోందని అన్నారు.
దీనిపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కంగనా స్పందించారు. 28 ఏళ్ల వయసులో కూడా సౌరవ్ తనను విద్యార్థినని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. సౌరవ్ వయసులో తాను రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నానని.. అలాగే ఒకే సమయంలో తాను ఎంపీగా, సినీ దర్శకురాలిగా, నటిగా, నిర్మాతగా, రచయితగా, వ్యాపారవేత్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పారు. సౌరవ్ నిరుద్యోగి, పనికిరాని వ్యక్తి, ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవాలని కంగనా తీవ్రంగా విమర్శించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
ఈ వార్తలు కూడా చదవండి
అభిజీత్ దీప్కేకు పెళ్లి సంబంధాల వెల్లువ.. అనితా దీప్కే ఏం చెప్పారంటే..
ఆ పోస్టులు తొలగించండి.. ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు