USA: అమెరికాది స్టేట్ టెర్రరిజమ్.. క్యూబా ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 10:23 AM
వెనెజువెలా దేశంపై అమెరికా వైమానిక దాడులు చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ దాడులను మెజారిటీ దేశాలు ఖండించగా.. అర్జెంటీనా మాత్రం ప్రశంసించింది. ఇక.. స్పెయిన్ ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాపై అమెరికా దాడులు(United States strikes in Venezuela) చేయడంపై ప్రపంచ దేశాలు మిశ్రమ స్పందన కనబరుస్తున్నాయి. క్యూబా, బ్రెజిల్, రష్యా, చైనా, ఇరాన్, మెక్సికో వంటి దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అమెరికా దాడులు.. స్టేట్ టెర్రరిజమ్ అంటూ యూఎస్ ప్రత్యర్థి, వెనెజువెలా మిత్ర దేశం క్యూబా(Cuba) ఘాటుగా స్పందించింది. వెనెజువెలా మీద దాడులపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని పిలుపునిచ్చింది. ఇక.. ఈ దాడులు నేరపూరితమైనవని.. క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ బెర్మూడెజ్(Miguel Diaz-Canel Bermudez) వ్యాఖ్యానించారు. మరోవైపు వెనెజువెలాపై దాడుల అంశంపై బ్రెజిల్ స్పందిస్తూ.. అమెరికా పరిధి దాటి ప్రవర్తించిందని ఆ దేశ అధ్యక్షుడు లులా డా సిల్వా(Lula da Silva) పేర్కొన్నారు.
వెనెజువెలాపై(Venezuela) యూఎస్ వైమానిక దాడులు ముమ్మాటికీ సైనిక దురాక్రమణ కిందకే వస్తాయని రష్యా(Russia) మండిపడింది. దీనికి అమెరికా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఇరుదేశాలూ ఇకపై ఎలాంటి ఉద్రిక్త చర్యలకు పాల్పడకుండా ఉండాలని పిలుపునిచ్చింది. ఎలాంటి సమస్యలనైనా సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇక.. వెనెజువెలా ప్రజలకు, ప్రభుత్వానికి మద్దతు తెలిపిన రష్యా.. ఈ విషయమై ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(United Nations Security Council) అత్యవసర సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
అమెరికా వైమానిక దాడులను చైనా(China) ఖండించింది. ఈ విషయంలో యూఎస్ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడటం సహా వెనెజువెలా సార్వభౌమత్వానికి భంగం కలిగించిందని పేర్కొంది. ఈ ఘటనతో తాము దిగ్భ్రాంతి చెందినట్టు తెలిపిన డ్రాగన్.. వెనెజువెలాతో తమకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పుకొచ్చింది. ఇక.. ఈ దాడులపై మెక్సికో(Mexico) స్పందిస్తూ.. లాటిన్ దేశాల స్థిరత్వానికి తీవ్ర ముప్పు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
మద్దతుగా అర్జెంటీనా.. మధ్యవర్తిగా స్పెయిన్..
ఇదిలా ఉండగా.. ఈ దాడులపై అమెరికాకు అర్జెంటీనా(Argentina) మద్దతిస్తామని ప్రకటించింది. 'లాంగ్ లివ్ ఫ్రీడమ్(Long Live Freedom)' అని ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలే వ్యాఖ్యానించారు.
మరోవైపు.. వెనెజువెలా, అమెరికా దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని వెల్లడించింది స్పెయిన్(Spain). ఈ మేరకు.. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించాలని, బాధ్యతగా వ్యవహరించాలని ఆ దేశం పిలుపునిచ్చింది.
ఇవీ చదవండి:
న్యూయార్క్‌కు చేరుకున్న వెనుజువెలా అధ్యక్షుడు..