Operation Absolute Resolve: వెనెజువెలాపై అమెరికా దాడి
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:38 AM
వెనెజువెలాపై సైనిక చర్య తప్పదని కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా సైన్యం....
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రాజధాని కారకస్‌పై బాంబులు
అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిలియా నిర్బంధం
కారకస్, జనవరి 3: వెనెజువెలాపై సైనిక చర్య తప్పదని కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా సైన్యం ‘ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్’ పేరుతో వెనెజువెలాపై భీకర బాంబుదాడులతో విరుచుకుపడింది. ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరి్‌సను నిర్బంధంలోకి తీసుకుంది. అమెరికా సైన్యం ఈ మొత్తం ఆపరేషన్‌ను అత్యంత సమన్వయంతో అరగంటలోనే పూర్తిచేయటం విశేషం. సైనిక చర్య విజయవంతమైందని, మదురోను, సిలియాను యూఎ్‌సఎస్ ఐవో జిమా యుద్ధ నౌకలో న్యూయార్క్‌కు తరలిస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. మదురోను తన సైనికులు నిర్బంధించటం ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీ షో చూసినట్లుగా చూశానని ట్రంప్ తెలిపారు. తర్వాత కొద్దిసేపటికి, మదురో కళ్లకు గంతలు కట్టి, బేడీలు వేసి తీసుకువెళ్తున్న ఫొటోను ట్రంప్ విడుదల చేశారు. ఈ దాడిని వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డిల్సీ రోడ్రిగేజ్ ఖండించారు. ఇది తమదేశంపై జరిగిన సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించారు. అమెరికాలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలకు మదురోనే నాయకుడని ట్రంప్ చాలాకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో 2020లో న్యూయార్క్ దక్షిణ జిల్లాలో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన అమెరికాకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు కారక్‌సపై అమెరికా సైన్యం యుద్ధ విమానాలు, సాయుధ హెలికాప్టర్లతో విరుచుకుపడింది. ముందుగా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఆ వెంటనే అధ్యక్షుడి నివాసంపై దాడిచేసి మదురో దంపతులను అదుపులోకి తీసుకుని, మెరుపు వేగంతో దేశ సరిహద్దులు దాటించింది. ఏం జరుగుతుందో తెలుసుకొనేలోపే రాత్రి 2 గంటలకల్లా ఆపరేషన్‌ను ముగించి అమెరికా మిలిటరీ తమ స్థావరాలకు వెళ్లిపోయింది. అమెరికా సైనిక ఆపరేషన్ తర్వాత వెనెజువెలాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లో వచ్చి నిరసన తెలుపగా, కొంత మంది సంబరాలు చేసుకున్నారు. కాగా, అమెరికా సైనిక చర్యను, చైనా, ఫ్రాన్స్, చిలీ, రష్యా, క్యూబా, బొలీవియా, ఇరాన్ ఖండించగా, అర్జెంటీనా స్వాగతించింది.

డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి స్థాయికి..
నికోలస్ మదురో అతిసామాన్యుడి స్థాయి నుంచి దేశాధ్యక్షుడిగా ఎదిగారు. 1962, నవంబర్ 23న ఆయన జన్మించారు. మధురో తండ్రి కార్మిక సంఘం నాయకుడిగా పనిచేయటంతో ఈయన కూడా వామపక్ష భావాలతోనే పెరిగారు. 1992లో సైనిక కమాండర్‌గా ఉన్న హ్యూగో చావెజ్ నాటి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సైనిక తిరుగుబాటుకు ప్రయత్నించగా అది విఫలమైంది. ప్రభుత్వం చావెజ్‌ను జైల్లో పెట్టడంతో ఆయనను విడుదలచేయాలని దేశవ్యాప్తంగా జరిగిన వామపక్షాల నిరసనల్లో మదురో కీలకపాత్ర పోషించారు. 1998లో చావెజ్ దేశాధ్యక్షుడు అయ్యాక ఆయన ప్రభుత్వంలో మదురో కీలకపాత్ర పోషించారు. చావెజ్ 2013 మార్చి 5న మరణించారు. అంతకు కొద్దిరోజుల ముందే ఆయన మదురోను తన వారసుడిగా ప్రకటించారు.